YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 30 July 2012

రంగారెడ్డి జిల్లాలో ఇకపై ఏఎన్నికలు వచ్చినా అన్నింటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్


హైదరాబాద్,న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లాలో ఇకపై ఏఎన్నికలు వచ్చినా అన్నింటిలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేలా కృషి చేయాలని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ టీడీపీ ఇన్‌చార్జి బి.సంజీవరావు, వికారాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి(కాంగ్రెస్), జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి సుమారు 500 మంది తమ అనుచరులతో కలసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌కు రాజీనామాలు చేసినవారిలో వికారాబాద్, తాండూర్ , చేవెళ్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఉన్నారు. నాయకుల, కార్యకర్తల ఊపు ఉత్సాహం చూస్తూంటే రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా స్పష్టమవుతోందని వైవీ అభిప్రాయపడ్డారు. 

స్థానిక సంస్థలు, అసెంబ్లీ.. ఏ ఎన్నికలు వచ్చినా అన్నిస్థానాలూ మన పార్టీకే రావాలని ఆయన వారికి ఉద్బోధించారు. గడప గడపకూ పార్టీని తీసుకువెళ్లాలని, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి ప్రస్తుతం అవి ఎలా నీరుగారుతున్నాయో కూడా చెప్పాలని ఆయన సూచించారు. రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అడ్‌హాక్ కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి, మహిళా విభాగం కన్వీనర్ కె.అమృతాసాగర్, ఎస్సీ విభాగం కన్వీనర్ రాచమల్ల సిద్ధేశ్వర్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, ట్రేడ్‌యూనియన్ విభాగం కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్‌ల సమక్షంలో కార్యకర్తలందరికీ వైవీ పార్టీ కండువాలు కప్పి, స్వాగతం పలికారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మను కలవాలని కార్యకర్తలు అభిలషించగా నెల్లూరు రైలు ప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళ్లినందు వల్ల ఆమెను కలుసుకోలేకపోతున్నామని సుబ్బారెడ్డి వారికి వివరించారు. పార్టీలో చేరినవారిలో బి.సంజీవరావు సతీమణి మధురవేణి కూడా ఉన్నారు. సంజీవరావు మాట్లాడుతూ వై.ఎస్. జీవించి ఉన్నపుడు తనకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే స్వల్ప తేడాతో ఓడిపోయానన్నారు. 

ఆ తరువాత టీఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు కారణంగా 2004లో టికెట్‌ను కోల్పోయానని తన సతీమణి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారన్నారు. ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న తాను వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి పాటుపడగలదని భావించి పార్టీలో చేరానన్నారు. 1975లో కాంగ్రెస్‌పార్టీలో చేరిన తాను వై.ఎస్. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన నాటి నుంచీ ఆయన నేతృత్వంలో పనిచేస్తూ వస్తున్నాననీ ఆయన ఆశీస్సులతోనే మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కూడా అయ్యానని రామచంద్రారెడ్డి తెలిపారు. ఇకపై వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పని చేస్తానన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!