YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 1 August 2012

ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్

 రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం మండల కమిటీలు పూర్తిచేశామని, తరువాత జిల్లా కమిటీలను ప్రకటించడంతోపాటు వీరందరికీ హైదరాబాదులో శిక్షణ ఇచ్చిన అనంతరం రాష్ట్ర యువత కమిటీని ప్రకటిస్తామని పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ లో సైతం వైఎస్‌ఆర్ సీపీకి జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇటీవల సిరిసిల్లలో విజయమ్మ నిర్వహించిన చేనేత దీక్షే అందుకు నిదర్శనమన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చాలా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయని, తమకు అందిన సర్వే ప్రకారం తెలంగాణ లో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ 60 నుంచి 70 సీట్లు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. 

రాష్ట్ర కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు. సంక్షేమ పథకాలను నీరుగార్చడమే కాకుండా వైఎస్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో కిరణ్ సర్కార్ కుట్రలకు పాల్పడి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించిందన్నారు. ఏడాదిలో లక్ష ఉద్యోగాలు, మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలన్నారు. ఈ ప్రకటన చేసి గత డిసెంబర్ నాటికి ఏడాది దాటింది, కానీ లక్ష ఉద్యోగాలు ఎక్కడ కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఇంకా నిర్వహించకపోవడం దారుణంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. 26.90 లక్షల మందికి గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉండగా 2.90 లక్షల మందికి మొండిచేయి చూపారన్నారు. దీనివల్ల ఎంతోమంది నిరుపేదలు పెద్ద చదువులు చదువుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

చాలా మంది మంత్రులు కూడా వైఎస్‌ఆర్ సీపీ వైపు మొగ్గుచూపుతున్నారని అయితే ప్రజాదరణ ఉన్నవారిని మాత్రమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆహ్వానిస్తుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అనంతరం తిరిగి తెలంగాణ లో ఓదార్పు యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసేందుకు టీడీపీ సిద్ధమైందని, అయితే వైఎస్‌ఆర్ సీపీ ఆయనకు మద్దతు ప్రకటించడంతో టీడీపీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించిందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. దానిని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సీపీ ఒక్కటయ్యాయని పేర్కొనడం అమాయకత్వమన్నారు.

ఇప్పటికైనా అనవసర దుష్ర్పచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పోరాటాలు ముమ్మరం చేసి యువతకు అవసరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దక్కించుకోవడంలో వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం కృషిచేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నరాల రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ ప్రసాద్, బీసీ సెల్ నాయకులు కఠారి శంకర్ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!