YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 1 August 2012

చార్జీల సర్కారుకు షాక్!

ఏకకాలంలో అటు కరెంటు కోతల్ని, ఇటు చార్జీల వాతల్ని అమలుచేయడంలో ఎక్కడలేని చాకచక్యాన్నీ ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. పేరేదైతేనేం... వినియోగదారుల జేబులు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని కొన్నాళ్లుగా ప్రభుత్వం చార్జీలను పెంచుకుంటూ పోతోంది. అలాగని రోజులో స్విచ్ వేస్తే బల్బ్ వెలగడం అరుదే. అటు వెలుగుల క్షణాలు క్షీణిస్తుంటే ఇటు కరెంటు బిల్లు ఎందుకు పెరుగుతున్నదో తెలియక సామాన్యులు అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట 2009-10 నాటి సర్‌చార్జిని వసూలు చేయరాదంటూ రాష్ట్ర హైకోర్టు విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది. చంద్రబాబు హయాంలో అధిక చార్జీలను నిరసించే ఉద్యమంపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గుళ్ల వర్షం కురిపించి ముగ్గుర్ని పొట్టనబెట్టుకున్న ఘటన తర్వాత తాము అధికారంలోకొస్తే అయిదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచబోమని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో రైతాంగానికి ఉచిత విద్యుత్‌తోపాటు చార్జీలు పెంచబోమంటూ వాగ్దానం చేశారు. 

అధికారంలోకొచ్చాక దాన్ని ఆచరణలో చేసి చూపించారు. అంతేకాదు, రైతులకు రోజుకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించడం, మరో అయిదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచకపోవడం అనే రెండే హామీలతో ఆయన 2009 ఎన్నికల బరిలో దిగారు. ప్రజలు వైఎస్ మాటలు విశ్వసించి ఆయనకే మరోసారి పట్టంగట్టారు. అయితే, వైఎస్ కనుమరుగైన తర్వాత ఆయన ప్రకటించిన పథకాలు, ఇచ్చిన హామీలు మావేనని తరచు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు హామీలకూ తూట్లు పొడిచింది. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ మాట అలా ఉంచి, ఇస్తున్నామని చెబుతున్న విద్యుత్‌ను కూడా సరిగా అందజేయలేక ప్రభుత్వం తల్లకిందులవుతోంది. ఇటు విద్యుత్ చార్జీలపైనా ఇదే తీరు. మొదట రోశయ్య ప్రభుత్వం, అటుపై కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం అరడజనుసార్లు జనంపై చార్జీల భారాన్ని మోపాయి. 
ఈ ఏడాది జనవరినుంచే ప్రభుత్వం చార్జీల బాదుడును ప్రారంభించింది. ఆ నెలలో ఇంధన చార్జీల సర్దుబాటు పేరిట రాష్ట్ర ప్రజలపై రూ.3,038 కోట్లు భారాన్ని మోపారు. 

ఎన్నడో 2008-09లో వినియోగదారులు వాడిన విద్యుత్‌కు రూ.3,141.96 కోట్లు వసూలు చేయడానికి అనుమతించమని అప్పట్లో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కోరగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) దయదలిచి రూ.1,638.82 కోట్లు వసూలు చేసుకోమని ఆ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సంవత్సరానికి సాధారణ గృహ వినియోగదారులపై పడే భారాన్ని తామే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై పడిన భారం అంతిమంగా జనానికే బదిలీ అవుతుందని ఎవరికీ తెలియనిది? వాస్తవానికి ఎలాంటి సర్దుబాటు ప్రతిపాదనలనైనా డిస్కంలు ఆ ఆర్ధిక సంవత్సరం పూర్తయిన 30 రోజుల వ్యవధిలో మాత్రమే సమర్పించాలన్న నిబంధన ఉంది. కానీ, ఈఆర్‌సీ దాన్ని పట్టించుకోకుండా వారికి ఉదారంగా అనుమతులిచ్చింది. అప్పట్లో ఇలా సర్‌చార్జి మోతమోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్‌లను స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు ఈఆర్‌సీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ప్రతిపాదనలు తీసుకురావడంలో అంతులేని జాప్యం ఉన్నా డిస్కంలకు ఎలా అనుమతినిచ్చారంటూ ప్రశ్నించింది. దీనిపై డిస్కంలన్నీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నాయి. 


సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం ఇంకా వెలువడవలసే ఉంది. ఈలోగా డిస్కంలు 2009-10 నాటి సర్దుబాటు చార్జీలను వసూలు చేయడానికి తయారయ్యాయి. ఈఆర్‌సీ ఇచ్చిన సలహాను సైతం తోసిరాజన్నాయి. అంతకు ముందు సంవత్సరంనాటి సర్దుబాటు చార్జీలపై సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేంతవరకూ హైకోర్టు నిర్ణయమే అమల్లో ఉంటుందన్న కనీస అవగాహన కూడా డిస్కంలకు కొరవడింది. జూలై నెలనుంచే ఆదరా బాదరాగా జనం నెత్తిన రూ.1481 కోట్ల భారాన్ని మోపడం మొదలెట్టాయి. ఇప్పుడు హైకోర్టు ఈ నిర్ణయాన్నే తప్పుబట్టింది. ఇప్పటికే వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులు భవిష్యత్తులో చెల్లించే బిల్లుల్లో సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. న్యాయపరమైన చెల్లుబాటు, నిబంధనల ఉల్లంఘన వగైరాల సంగతి పక్కనబెడితే... ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట అసలు వినియోగదారుల జేబులు కొల్లగొట్టడంలోని హేతుబద్ధత ఏమిటో బుర్రబద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు. ఎన్నడో రెండేళ్లక్రితమో, మూడేళ్లక్రితమో ఎవరో ఆ ఇంట్లో వాడుకున్న కరెంటుకు ఇప్పుడు కొత్తగా అద్దెకు దిగినవారు ఎందుకు చెల్లించాలో ప్రభుత్వాధి నేతలు చెప్పగలుగుతారా? ఏదో ఒక పేరు పెట్టి, జనాన్ని గందరగోళంలో ముంచెత్తి ఖజానాకు డబ్బులు రాబట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదని స్పష్టంగానే తెలుస్తోంది. 

ఇదంతా సర్దుబాటు చార్జీల గొడవ. ఇదిగాక మొన్న ఏప్రిల్ నెలనుంచి సర్కారు రూ. 4,442 కోట్ల మేర చార్జీలు పెంచింది. కిరణ్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇలా చార్జీలు పెరగడం రెండోసారి. అంతకుముందు రెండుసార్లు చార్జీలు పెంచిన రోశయ్య ప్రభుత్వం గృహవినియోగదారులను వదిలేశామని చెబుతూ పారిశ్రామిక, వాణిజ్య రంగాలపై గణనీయంగానే వడ్డించింది. ఇలా చార్జీలు, సర్‌చార్జీలు మాత్రమే కాదు...ఈ ప్రభుత్వాలు వైఎస్ ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ ఉచిత విద్యుత్‌పై కూడా కన్నేశాయి. 2009-10లో రూ.5,000 కోట్లున్న విద్యుత్ సబ్సిడీని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తున్నారు. అలాగే, వ్యవసాయ కనెక్షన్ల సర్వీస్ చార్జీలపెంపు ద్వారా రైతుల నుంచి ఏటా అదనంగా మరో రూ.50 కోట్లు వసూలుచేస్తోంది. వీటన్నిటికీ కారణం పెరుగుతున్న విద్యుత్ డిమాండేనని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతోంది. ఏటికేడాదీ మితిమీరిన కరెంటు కోతలతో కాలక్షేపం చేస్తున్న సర్కారు ఇలాంటి కారణం చెప్పడం వింతే. రకరకాల పేర్లు పెట్టి వసూలు చేస్తున్న ఈ తరహా వసూళ్లకు హైకోర్టు కళ్లెం వేయడం సామాన్య జనానికి ఊరట కలిగించే విషయం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!