YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 3 August 2012

రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండిచేయి

కొత్తగా 4,000 కి.మీ.కు జాతీయ హోదా
కానీ మన ప్రతిపాదనలన్నీ బుట్టదాఖలే
ఎంపీల అనైక్యత, విభేదాలే కారణం
సీఎం సిఫార్సునూ పట్టించుకోని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: జాతీయ రహదారుల గుర్తింపులో మన రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగింది. మిగతా రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం, మన రాష్ట్రానికి మాత్రం మొండిచేయి చూపింది. కేంద్ర ఉపరితల రవాణా, రహదారి మంత్రి సీపీ జోషీ నేతృత్వంలో గురువారం జరిగిన భేటీలో దేశంలో కొత్తగా 4,000 కి.మీ. రోడ్లకు జాతీయ హోదా కల్పించారు. పంజాబ్, హర్యానా, కర్ణాటక, గుజరాత్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే 4,500 కి.మీ. రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించగా, మిగతా రాష్ట్రాల ప్రతిపాదనలను కూడా క్లియర్ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఈ జాబితాలో రాష్ట్ర ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదు. ప్రాంతీయ అసమానతలను సాకుగా చూపి మన జాబితాను అటకెక్కించింది. ఎంపీల్లో అనైక్యత, ప్రాంతాలవారీగా విభజన రేఖ ఏర్పడడంతో మన రోడ్డు ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది. ఇతర రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఎగరేసుకుపోతుంటే మనకు మాత్రం రిక్తహస్తమే మిగులుతోంది.

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్‌హెచ్‌ల ప్రతిపాదనలపై ఎంపీలు ప్రాంతాలవారీగా విడిపోవడంతో పరిష్కార బాధ్యతను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు కేంద్రం అప్పగించింది. 

ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన 1,981.77 కి.మీ. నిడివితో కూడిన 11 రోడ్లలో మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యమిస్తూ 1,100 కి.మీ.ను ఎన్‌హెచ్‌లుగా ప్రకటిస్తామని ఉపరితల రవాణా, ర హదారి శాఖ గతంలోనే హామీ ఇచ్చింది. దాంతో రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర భేటీలో మన ప్రతిపాదనలను ఆమోదిస్తారని ఆశిస్తే నిరాశే ఎదురైంది. దాంతో కిరణ్, రోడ్లు, భవనాల మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా మంత్రి జోషీతో ఫోన్‌లో మాట్లాడినా.. ఆజాద్ చెబితే తప్ప రాష్ట్ర ప్రాజెక్టులను క్లియర్ చేయలేమని ఆయన తేల్చిచెప్పినట్టు సమాచారం. అజాద్ విదేశీ పర్యటనలో ఉన్నారు గనుక ఆయన అనుమతిచ్చిన వాటికైనా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేసినా కుదరదన్నారాయన. అసలు మనకు కేటాయించిన ప్రాజెక్టులను కూడా ఇతరులు తన్నుకుపోయారని అధికారులు మాత్రం అనుమానిస్తున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా 10,000 కి.మీ.లను మాత్రమే ఎన్‌హెచ్‌లుగా గుర్తిస్తామని, రాష్ట్ర ప్రతిపాదనలను 2,000 కి.మీ.కి కుదించాలని కేంద్రం ఆదేశించింది. ఆ మేరకు జాబితాను సవరించి పంపినా, రోడ్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆ ప్రాంత ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. చివరికి రాష్ట్ర ప్రతిపాదనలను పక్కన పెట్టారు. రోడ్ల కేటాయింపులో ప్రాంతాలవారీ సమతుల్యత పాటిస్తూ 1,100 కి.మీ.లను ఓకే చేస్తూ ఆజాద్ నెరిపిన మధ్యవర్తిత్వాన్నీ జోషీ పట్టించుకోలేదు.

నాలుగేళ్లుగా నాన్చుడే: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత చాలా తక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న 70 వేల కి.మీ. రోడ్లలో రాష్ట్రంలో 4,730 కి.మీ. మాత్రమే ఉన్నాయి. అందుకే 6,571 కి.మీ. మేరకు 23 రోడ్లకు జాతీయ హోదా కోసం నాలుగేళ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదనలు పంపారు. కానీ ఆయన మరణంతో అవి కాస్తా పక్కదారి పట్టాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!