YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 27 August 2012

బాబుకు, జేడీకి మధ్య ఒప్పందమేంటి?

గతంలో వనరులు లేవంటూ తప్పుకున్నారు
బాబుకు, జేడీకి మధ్య ఒప్పందమేంటి?
ఇప్పటికైనా ఐఎంజీకి భూములపై సమగ్ర విచారణ జరపాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: భారత సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ద్వంద్వనీతి మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున నామమాత్రపు ధరకే ఐఎంజీ భారత అనే దిక్కూదివానం లేని సంస్థకు 850 ఎకరాలు కేటాయించారు. ఈ అవకతవకలపై విచారణ చే యాల్సిందిగా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి గతంలోనే కోరితే ప్రస్తుతం ఉన్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వనరులు లేవంటూ తప్పుకున్నారు. 

అయితే జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో మాత్రం కోర్టు ఆదేశాలే తడవుగా 24 గంటల్లో ఇతర రాష్ట్రాలనుంచి 80 టీంలు రప్పించారు. జగన్ ఇంటిపై ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లపై దాడులు చేస్తూ రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించారు. చంద్రబాబుపై దర్యాప్తు చేయడానికి జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ ద్వంద్వ నీతి ఏంటి? ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందమేంటి?’’ అని శ్రీనివాసులు నిలదీశారు. లక్ష్మీనారాయణ తీరు ఒక దర్యాప్తు అధికారిలా లేదని, తానో రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబుపై ఆయనకు ప్రేమ ఉంటే ఆపార్టీలో చేరాలని సూచించారు. అలాగే జగన్‌పై వ్యక్తిగత కక్ష ఉంటే జేడీ పదవికి రాజీనామా చేసి చంద్రబాబుతో కలిసి నేరుగా ఢీకొనాలని చెప్పారు. లక్ష్మీనారాయణకు నిజాయతీ ఉంటే చేసే ఉద్యోగాన్ని చిత్తశుద్ధితో చేయాలన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినందున ఇప్పటికైనా ఐఎంజీ భారత భూబాగోతంపై సమగ్ర విచారణ జరపాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!