YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 27 August 2012

ముఖ్యమంత్రిగా జగన్‌కే ఓటు!

మధ్యంతర ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్‌కు 21 లోక్‌సభ స్థానాలు
టీఆర్‌ఎస్‌కు 10.. కాంగ్రెస్‌కు 9 నామరూపాల్లేని టీడీపీ
మాకు అస్త్రాలు, ఎత్తుగడలున్నాయి: మొయిలీ
కాంగ్రెస్ అస్త్రం... సీబీఐనా? వైఎస్ భారతి ప్రశ్న

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని ఎన్‌డీటీవీ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం.. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో 48 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీఎం కావాలని 18 శాతం ప్రజలు కోరుకుంటే.. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు సీఎం కావాలని 17 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని 11 శాతం మంది.. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి సీఎం కావాలని 6 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జగన్ సీఎం కావాలని కోరుకుంటున్న వారు 62 శాతం మంది ఉంటే.. ఆ సంఖ్య తెలంగాణలో 19 శాతంగా ఉంది. తెలంగాణలో 43 శాతం మంది ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటుండగా.. మిగతా ప్రాంతంలో ఆ సంఖ్య 4 శాతంగా ఉంది. 

ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాల్లో 21 సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఇటీవల ఇండియాటుడే సర్వేలో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ 23 నుంచి 27 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైన విషయం తెలిసిందే. తాజా ఎన్‌డీటీవీ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 10 ఎంపీ సీట్లు, కాంగ్రెస్‌కు 9 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడైంది. రెండు స్థానాలు ఇతరులకు వస్తాయని తేలింది. మజ్లిస్‌కు ఒక స్థానం పోతే మిగిలిన ఒక స్థానంలోనే టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ సర్దుకోవాల్సి వస్తుందని ఈ సర్వేతో తేలిపోయింది. అలాగే.. జగన్ అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని ఆంధ్ర, రాయలసీమల్లోని 56 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య తెలంగాణలో 26 శాతంగా ఉంది. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందేనని తెలంగాణలో 86% మంది చెప్తుండగా.. మిగతా ప్రాంతాల్లో దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య 24 శాతంగా ఉంది. 

ఆ అస్త్రం సీబీఐ కావచ్చు: వైఎస్ భారతి
‘‘కాంగ్రెస్‌కు అస్త్రాలున్నాయని వీరప్పమొయిలీ చెప్తున్నారు.. ఆ అస్త్రం సీబీఐ కావొచ్చు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వై.ఎస్.భారతి వ్యాఖ్యానించారు. సర్వే ఫలితాల ప్రసారం సందర్భంగా ఎన్‌డీటీవీ వ్యాఖ్యాత ప్రణయ్‌రాయ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల ప్రజాదరణకు భయపడిన కాంగ్రెస్ సీబీఐని అస్త్రంగా వాడుకుంటున్నది. ఇప్పటిదాకా ఏ నాయకుడి పట్ల వ్యవహరించనంత అమానుషంగా జగన్ మీద సీబీఐ వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ అస్త్రాల్లో సీబీఐ కూడా ఒకటి కావచ్చు. ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన మంచి పరిపాలనాదక్షుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అందుకే రెండోసారి కూడా ప్రజలు ఆదరించి, అధికారాన్ని అప్పగించారు. వైఎస్ చేసిన మంచిని మరచిన కాంగ్రెస్ పార్టీ జగన్ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ అస్త్రమే ఆ పార్టీకి బూమరాంగ్ అవుతున్నట్లుంది. రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. ఆ రెండు ప్రాంతాల ప్రజలు జగన్‌ను తమ సోదరుడిగా, తమ కుమారుడిగా ఆదరిస్తున్నారు. తెలంగాణలో జగన్ ఇంకా పూర్తిస్థాయిలో పర్యటించలేదు. జగన్ పర్యటిస్తే తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరు. ఈ విషయాన్ని జగన్ చాలా స్పష్టంగా చెప్పారు’’ అని భారతి స్పష్టం చేశారు.

మా అస్త్రాలు మాకున్నాయి: మొయిలీ
‘‘రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదరణ నిజమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ అంగీకరించారు. ‘నేను ఆంధ్రప్రదేశ్‌కు 2009 ఎన్నికల్లో ఇన్‌చార్జిగా ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీకి ఐదు లోక్‌సభ సీట్లకు మించి రావన్నారు. అసెంబ్లీలో 25 సీట్లు దాటవన్నారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ 33 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయముంది. అప్పటి దాకా ప్రజల్లో బలం పెంచుకోవడానికి మా అస్త్రాలు మాకున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలున్నట్లుగానే సాధారణ ఎన్నికల ఫలితాలు ఉండవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరనేది ఇప్పుడే ప్రకటించం. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు నాయకుని ఎన్నిక ఉంటుంది. ఈ పద్ధతి ఆ రాష్ట్రంలోని పరిస్థితిని బట్టి ఉంటుంది. రాష్ట్రంలో జగన్‌కు అనుకూలంగా రాజకీయ పరిస్థితులుంటే కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతిస్తుందా లేదా అనే విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించబోను’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ ఎన్‌డీటీవీ చర్చలో మాట్లాడుతూ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!