YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 8 October 2012

ఏడోరోజుకే ఫ్లాప్ షో! పలచబడిన పాదయాత్ర

జనం లేక చంద్రబాబు డీలా 
అందరూ తనతో నడవాలని వేడుకోలు

చంద్రబాబు పాదయాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: చంద్రబాబు 117 రోజుల పాదయాత్ర ఏడో రోజుకే పలచబడింది. హిందూపురం నుంచి రాప్తాడు నియోజకవర్గ పరిధివరకు ఆరు రోజులూ ఎలాగోలా జనసమీకరణ చేసి ‘యాత్ర’ నడిపించిన తమ్ముళ్లు ఏడో రోజున చతికిలపడ్డారు. అయితే చిత్తూరుజిల్లా పలమనేరు నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొనడంతో ఊపిరి పీల్చుకోగలిగారు. సోమవారం కంబదూరు మండలంలోని కుర్లపల్లి క్రాస్ నుంచి మొదలైన పాదయాత్ర నారాయణపురం క్రాస్ వరకు 23 కిలోమీటర్లు కొనసాగింది. బోయలపల్లిలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. యాత్రలో ప్రజలు పాల్గొనకపోవడం, కార్యకర్తలు కూడా తక్కువగా రావడంతో చంద్రబాబు ఆయా గ్రామాల్లో ప్రసంగించేటప్పుడు అందరూ తనతో పాటు తర్వాతి గ్రామం వరకు రావాలని పదేపదే వేడుకున్నారు. అయినా ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయనలో నిస్తేజం ఆవహించింది. కదిరిదేవరపల్లిలో పరిస్థితిని గమనించిన ఓ కార్యకర్త ‘‘సార్.. ఉచిత కరెంటు, రుణ మాఫీ చేస్తామని ప్రకటిస్తేనే మనం గెలుస్తాం. లేదంటే కష్టమే’’ అని కుండబద్దలు కొట్టారు. దీనికి ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

అప్పుడు అన్నీ ఇవ్వాలనుకున్నా...

‘‘నేను అధికారంలో ఉన్నప్పుడు పల్లెలకు 24 గంటలు కరెంటు ఇవ్వాలనుకున్నా. పిల్లలను బాగా చదివించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని, మహిళలను ఉన్నతంగా చూడాలని... ఇలా ఎన్నో అనుకున్నా. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పిన కాంగ్రెసోళ్లు భిక్షాధికారులను చేశారు. అధికారంలోకి వచ్చాక రూ.లక్షతో పేదలకు ఇళ్లు నిర్మిస్తా. వికలాంగ పింఛన్ రూ.1,500కు పెంచుతా. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతా. పీజీ వరకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత బస్సు పాసులు... ఇలా అన్నీ చేస్తా’’ అని చంద్రబాబు వరాలు గుప్పించారు. పరిటాల రవిని కాంగ్రెస్ ప్రభుత్వమే ఓ పథకం ప్రకారం హత్య చేసిందని ఆరోపించారు. తాను అన్ని పదవులూ అనుభవించాననీ, ప్రజలకోసమే పాదయాత్ర చేస్తున్నాననీ చెప్పారు. పాదయాత్రలో ఎంపీ సీఎం రమేశ్‌నాయుడు, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.

పలమనేరు తాత్కాలిక ఇన్‌చార్జిగా మాజీ మంత్రి సుబ్బయ్య

చిత్తూరు జిల్లా పలమనేరు తాత్కాలిక నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి సుబ్బయ్యను చంద్రబాబు నియమించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసినందుకు నిరసనగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర కోసం కార్యకర్తలు రూ.1,11,116 చంద్రబాబుకు విరాళంగా అందజేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!