YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 24 December 2012

జగన్ అరెస్ట్‌పై సీబీఐ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు

వాన్‌పిక్ కేసులో మాత్రమే జగన్‌ను అరెస్ట్ చేశారనటం సరికాదు
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లో అరెస్ట్ చేశారు
రిమాండ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది 
సాంకేతిక కారణాలతో చట్టబద్ధ బెయిల్ పిటిషన్ కొట్టివేత 
సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
జగన్‌మోహన్‌రెడ్డి వాదనను సమర్థించిన జస్టిస్ శేషశయనారెడ్డి 
సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద జగన్ జ్యుడీషియల్ కస్టడీలో లేరు
అందుకే ఆయనకు ఆ సెక్షన్ కింద బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు

సాక్షి, హైదరాబాద్: కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ చేస్తున్న వాదనల్లో పసలేదని హైకోర్టు తేల్చింది. జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనంటూ సీబీఐ గత కొద్ది రోజులుగా చేస్తున్న వాదనను హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఆ వాదనల్లో అర్థం లేదని స్పష్టం చేసింది. జగన్‌ను కేవలం వాన్‌పిక్‌లో మాత్రమే కాదని, ఆయనను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లో అరెస్ట్ చేసిందని హైకోర్టు తేల్చి చెప్పింది. తద్వారా తన అరెస్ట్ విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి వాదనను హైకోర్టు సమర్థించినట్లయింది. ఇదే సందర్భంలో జగన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సాంకేతిక కారణాలతో కొట్టివేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు చట్టబద్ధ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. 

సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విని గతవారం తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి.. సోమవారం ఉదయం తన నిర్ణయాన్ని వెలువరించారు. 14.8.12 తరువాత సీబీఐ అధికారులు జగన్ కస్టడీని పొడిగించాలని కోరలేదని, కాబట్టి ఆయన కస్టడీలో లేనట్లేనని, కస్టడీలో లేని వ్యక్తికి బెయిల్ మంజూరు ప్రశ్న తలెత్తదని, అందువల్ల సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయటం సాధ్యం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జగన్ బెయిల్ పిటిషన్‌కు సంబంధించి న్యాయమూర్తి ప్రధానంగా రెండు అంశాల గురించి చర్చించారు. 28.5.12న జగన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లోనా..? లేక వాన్‌పిక్ కేసులో మాత్రమేనా..? అన్న ప్రశ్నతో పాటు జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద విచారణార్హమా..? అన్న మరో ప్రశ్న గురించి తన తీర్పులో ప్రముఖంగా చర్చించారు. 

ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ.. ‘జగన్ తన అరెస్ట్ అక్రమంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సమయంలో ఇదే హైకోర్టు సింగిల్ జడ్జి.. జగన్ రిమాండ్ ఎందులో జరిగిందనే విషయంపై పూర్తిస్థాయిలో చర్చించారు. ఇరుపక్షాలు కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాయి. వాదనల అనంతరం జగన్‌ను అన్ని అంశాల్లో రిమాండ్‌కు పంపారని సింగిల్ జడ్జి స్పష్టంగా చెప్పారు. అంతేకాక చట్టం నిర్దేశించిన గడువు లోపు తుది చార్జిషీట్ దాఖలు చేయకుంటే, జగన్ సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద చట్టబద్ధ బెయిల్ పొందవచ్చునని కూడా సింగిల్ జడ్జి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. 

జగన్‌ను అరెస్ట్ చేసిన మరుసటి రోజు అంటే 28.5.12న సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ చాలా సమగ్రంగా ఉంది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు దోహదం చేసిన అంశాలన్నింటినీ కూడా ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కానీ సీబీఐ ఈ రిమాండ్ రిపోర్ట్ కేవలం వాన్‌పిక్‌కు మాత్రమే సంబంధించిందని, మిగిలిన అంశాలకు సంబంధించినది కాదని చెప్తోంది. ఈ వాదనలో అర్థం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాల్లో దర్యాప్తు నిమిత్తం జగన్ పోలీస్ కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. నా ఉద్దేశం ప్రకారం జగన్‌ను 27.5.12న అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమే కాదు.. మిగిలిన అన్ని అంశాల్లో కూడా’ అంటూ మొదటి ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇక రెండో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘సీఆర్‌పీసీ సెక్షన్ 167(1) మరియు (2)లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దర్యాప్తు నిమిత్తం పోలీసుల అదుపులో ఉండాలి. సెక్షన్ 167(2) ఇందుకోసమే ఉద్దేశించింది. అయితే ఇందుకు చట్టం ఓ నిర్దిష్ట గడువును నిర్దేశించింది. ఆ గడువు పూర్తయిన తరువాత కూడా ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచుకోవటం చట్టవిరుద్ధం. కాబట్టి నిర్దిష్ట గడువు తరువాత ఆ వ్యక్తి బెయిల్ పొందేందుకు అర్హుడవుతాడు. 167(2) కింద బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండి తీరాలి. 


ఇక ప్రస్తుత కేసు విషయానికొస్తే, 27.5.12న అరెస్టయిన జగన్‌కు కోర్టు 28న జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎప్పటికప్పుడు దానిని సీబీఐ కోర్టు పొడిగిస్తూ వచ్చింది. 14.8.12 తరువాత అంటే సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత ఆ కస్టడీని సీబీఐ కోర్టు సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద మార్చింది (సీబీఐ కూడా జగన్ కస్టడీని పొడిగించాలని కోరలేదు). ఫార్మా కంపెనీలకు లబ్ధి వ్యవహారంలో 26.8.12 వరకు తాను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నానన్నది జగన్ అభిప్రాయం. అయితే నా ముందున్న రికార్డులను పరిశీలిస్తే వాస్తవం మరోలా ఉంది. 14.8.12 నాటికి జగన్ కస్టడీని సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద మార్చటం జరిగింది. కాబట్టి రికార్డులోని అంశాలు జగన్ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి జగన్ 167(2) కింద జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ఉంటే.. అతను బెయిల్ పొందేందుకు అర్హుడై ఉండేవారు. అయితే 14.8.12 నుంచి ఇప్పటి వరకు జగన్ కస్టడీని కోర్టు సెక్షన్ 309 కింద మార్చింది. 167(2) కింద జగన్ జుడీషియల్ కస్టడీలో లేనప్పుడు.. అదే సెక్షన్ కింద అతనికి చట్టబద్ధ బెయిల్ మంజూరు చేసే అంశమే ఉత్పన్నం కాదు. కాబట్టి 167(2) జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదు’ అని జస్టిస్ శేషశయనారెడ్డి పేర్కొన్నారు. 

ఇక సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు.. సుప్రీంకోర్టు 167(2) కింద బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకుందా..? లేదా..? అన్న విషయాన్ని ప్రస్తుతం పరిశీలించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాక 167(2) కింద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లోని వాస్తవాల ఆధారంగా ఈ కోర్టు తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు భావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సాధారణ బెయిల్‌పై 26న విచారణ...

ఇదిలావుంటే.. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తుది చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా, సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేదని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి విచారించారు. ఇరుపక్షాల వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!