YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 29 May 2012

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనలు

జగన్ అరెస్టును ఖండిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుపై నిరసనలు వెల్లువెత్తాయి. మంగళవారం కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాల్లో ప్రదర్శనలు చేపట్టారు. ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 

సోనియాగాంధీ, సీబీఐ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని ప్రదర్శనలు చేశారు. బైక్, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. హోమం నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుమ్మక్కై ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా జగన్‌ను అడ్డుకోవడానికే అరెస్టు చేయించాయని వారు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రిలే నిరాహార దీక్షల శిబిరానికి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అలాగే, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి కూడా శిబిరానికి హాజరై సంఘీభావం తెలిపారు. 

జగ్గంపేట పోలీసుస్టేషన్ ఎదుట మూడు గ్రామాలకు చెందిన కార్యకర్తలు, స్థానికులు జైల్‌భరో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో లిడ్‌క్యాప్ మాజీ డెరైక్టర్ త లారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరభద్రాపురంలో 19 స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులు భారీ ప్రదర్శన చేశారు. ఇదే మండలం కొండాపూర్‌లో 200 మంది ఉపాధికూలీలు పనులు బహిష్కరించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో జగన్ అరెస్టును నిరసిస్తూ ఐదువేల మంది సంతకం చేశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం తోటపల్లె, సామిరెడ్డి పల్లె గ్రామస్తులు సోమవారం రాత్రంతా చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై బైఠాయించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో మౌన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్‌ఆర్ జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు జరిగాయి.

నిర్దోషిగా బయటకు రావాలంటూ పూజలు 

జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో పూజలు చేశారు. ఖమ్మం రూరల్ మండలం మద్దివారిగూడెంలో 101 బిందెలతో ఆంజనేయస్వామికి జలాభిషేకం చేసి, అనంతరం 101 టెంకాయలు కొట్టారు. తల్లాడలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హోమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మారెమ్మగుడిలో 101 కొబ్బరికాయలు సమర్పించారు. జగన్ త్వరగా విడుదల కావాలని కోరుతూ కర్ణాటకలోని బళ్లారి నగర ఆదిదేవత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101 టెంకాయలు కొట్టారు. అక్కడి నుంచి వందలాది మంది ర్యాలీ చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. 

జగన్ అరెస్టుపై విదేశాల్లోనూ నిరసన

జగన్ అరెస్టును నిరసిస్తూ ప్రవాస భారతీయులు సైతం నిరసనలు చేపట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ ఈ వివరాలను వెల్లడించారు. అమెరికాలోని డెట్రాయిట్, సెయింట్‌లూయిస్, అట్లాంటా, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, గల్ఫ్‌లోని కువైట్ తదితర ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. డెట్రాయిట్‌లో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో యుగంధర్ భుమిరెడ్డి, శ్రీధర్ తిప్పిరెడ్డి, వినోద్ ఆత్మకూర్, శ్రీనివాస్ చిత్తలూరి, పురుషోత్తం కూకటి, సునీల్ మదుటి, పిడపర్తి శ్రీనివాస్, శివరాం యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. సెయింట్‌లూయీస్‌లో జరిగిన నిరసనలో గోపాల్ తాటిపర్తి, సుమ, దినేష్ బత్తుల, తాటిపర్తి శ్రీనివాసరెడ్డి, దీప్తి, లింగారెడ్డి స్వప్న, కిరణ్ ములుపూడి, సోనీ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!