YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

బూత్‌ల వారీగా ఓటింగ్ సరళితో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు బట్టబయలు

రామచంద్రపురంలో 41 బూత్‌లలో టీడీపీకి పది ఓట్లు కూడా లేవు
సత్యవాడ గ్రామంలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటూ రాని వైనం
రైల్వే కోడూరు, నరసాపురం నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి 
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు టీడీపీకి క్రాస్
చిరు స్వగ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికే మెజారిటీ ఓట్లు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అత్యంత పకడ్బందీగా జరిగినట్టు ఆ రెండు పార్టీల నేతలు నిర్థారణకొచ్చారు. ముందస్తు అవగాహన మేరకు కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగిందన్న దానిపై నేతలు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. ఓటింగ్ సరళిని బట్టి ముఖ్యంగా రామచంద్రపురం, నరసాపురం, ప్రత్తిపాడు, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పరస్పర అవగాహన సక్సెస్ అయినట్టు పార్టీ నేతలు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. 

తాజాగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల్లోని బూత్‌ల వారీగా వెల్లడించిన ఓట్ల వివరాలు కూడా ఇరు పార్టీల మధ్య క్రాస్ ఓటింగ్ పథకం విజయవంతమైనట్టుగా స్పష్టమవుతోంది. రామచంద్రపురం, నరసాపురం, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో టీడీపీ తన ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థులకు వేయించినట్టు స్థానిక నేతలు ఇప్పటికే పార్టీ నాయకత్వాలకు నివేదించారు. అలాగే ప్రత్తిపాడు, పోలవరం నియోజకవర్గాల్లో పలు చోట్ల కాంగ్రెస్ తన ఓట్లను టీడీపీకి వేయించిందన్న సమాచారం కూడా అందుతోంది. 

ఓటింగ్ తీరుతో తేటతెల్లం... 

కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలుపొందిన రామచంద్రపురం నియోజకవర్గంలో మొత్తం 205 పోలింగ్ బూత్‌లు ఉండగా.. 41 పోలింగ్ బూత్‌లలో టీడీపీకి రెండంకెల ఓట్లు కూడా రాలేదు. ఈ 41 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి బూత్‌లో టీడీపీకి తొమ్మిది ఓట్లకంటే తక్కువ పోలయ్యాయి. గతంలో ఈ బూత్‌లలో టీడీపీకి బాగానే ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెప్పారు. మరో మూడు బూత్‌లలో టీడీపీకి ఒకే ఒక్క ఓటు రాగా, సత్యవాడ గ్రామంలోని ఒక బూత్‌లో మొత్తం 552 ఓట్లు పోలవగా టీడీపీకి ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. మొత్తం బూత్‌లలో కేవలం ఏడు చోట్ల మాత్రమే ఆ పార్టీ వందకు పైగా ఓట్లను తెచ్చుకోగలిగింది. స్థానికంగా ఇరు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ చాలా పకడ్బందీగా జరిగిందనటానికి ఇదే నిదర్శనమని, తమ పార్టీ నాయకత్వానికి పంపిన నివేదికల్లోనూ ఈ విషయం చెప్పామని ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చెప్పారు. నరసాపురం నియోజకవర్గంలోనూ మొత్తం 161 పోలింగ్ బూత్‌లు ఉండగా.. వాటిలో కేవలం 20 బూత్‌లలో మాత్రమే టీ డీపీకి వందకు పైగా ఓట్లు వచ్చాయి. 

రెండు చోట్ల పది లోపే ఓట్లు వచ్చాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ మొత్తం 215 పోలింగ్ బూత్‌లకు గాను 35 చోట్ల టీడీపీకి పది లోపే ఓట్లు పోలయ్యాయి. శేషక్కగారిపల్లి గ్రామంలో మొత్తం 361 ఓట్లు పోలవగా.. టీడీపీకి ఒక్క ఓటూ రాలేదు. కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యాయని ప్రచారం జరుగుతున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం 235 పోలింగ్ బూత్‌లు ఉండగా అధికార పార్టీకి 29 చోట్ల పది లోపే ఓట్లు పడ్డాయి. ఆయా నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్నామని, లోతుగా అధ్యయనం చేసిన తర్వాత క్రాస్ ఓటింగ్‌పై నివేదిక రూపొందిస్తామని టీడీపీ రాష్ట్ర నాయకుడొకరు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.

85 బూత్‌లలో సురేఖకే మెజారిటీ...

పరకాలలో ముక్కోణపు పోటీయే టీఆర్‌ఎస్ పార్టీని గట్టెక్కించింది. సగం బూత్‌లలో మాత్రమే టీఆర్‌ఎస్ మెజారిటీని దక్కించుకోగలిగింది. 228 బూత్‌లు ఉండగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన మొగులూరి భిక్షపతికి కేవలం 113 బూత్‌లలో మాత్రమే మెజారిటీ దక్కింది. 85 బూత్‌లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కొండా సురేఖకు, 30 చోట్ల టీడీపీ తరఫున పోటీ చేసిన చల్లా ధర్మారెడ్డికి మెజారిటీ వచ్చింది. 

నరసన్నపేట నియోజకవర్గంలో అన్నదమ్ములు ధర్మాన కృష్ణదాసు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ధర్మాన రాందాసు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. వీరి సొంతూరు మబగాంలో కాంగ్రెస్‌కే మెజారిటీ వచ్చింది. గ్రామంలోని 4 పోలింగ్‌బూత్‌లలో 2,282 ఓట్లు నమోదవగా, కాంగ్రెస్‌కు 1,172 ఓట్లు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 705 ఓట్లు వచ్చాయి. 

మాచర్ల నియోజకవర్గం నుంచి బాబాయి- అబ్బాయిలు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడ్డారు. వారి సొంత గ్రామం కండ్లకుంటలోని మూడు బూత్‌లలో 2,030 ఓట్లు పోలయ్యాయి. వాటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన రామకృష్ణారెడ్డికి 1,123 ఓట్లు, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన లక్ష్మారెడ్డికి 516 ఓట్లు వచ్చాయి. 

నరసాపురం నియోజకవర్గంలోని చిరంజీవి సొంత గ్రామం మొగల్తూరులో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి 4,381 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 3,829 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు గెలుపొందారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!