YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 24 June 2012

చంద్రబాల కాల్ లిస్ట్ మాకిచ్చింది జగన్ అభిమానులు.. సాక్షికి సంబంధం లేదు

లక్ష్మీనారాయణ తీరు తొలినుంచీ అనుమానాస్పదమే
ఆయన ఫోన్ కాల్స్ జాబితా పబ్లిక్ డాక్యుమెంటే
వాటిపై రాష్ట్రపతి, ప్రధానులకు ఫిర్యాదు చేస్తాం
చంద్రబాల కాల్ లిస్ట్ మాకిచ్చింది జగన్ అభిమానులు.. సాక్షికి సంబంధం లేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తులో సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వ్యవహార శైలి తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉందని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనను తక్షణం విచారణ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జేడీ ఎలా వ్యవహరిస్తున్నారన్నది ఆయన ఫోన్‌కాల్స్ జాబితా చూశాక బయట పడిందని చెప్పారు. లీడ్ ఇండియా ముసుగులో జగన్‌పై కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కూడా తమకున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై విచారణ జరిపించాలని కోరారు. లక్ష్మీనారాయణ ఫోన్ కాల్స్ జాబితా విషయమై తాము త్వరలో రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

రాధాకృష్ణకు ఏడాదిగా చంద్రబాల ఫోన్లు

లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి చంద్రబాల అనే మహిళకు కొన్ని వందలసార్లు ఎందుకు ఫోన్లు వెళ్తున్నాయని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ‘‘వారిద్దరికీ పరస్పరం చాలాసార్లు కాల్స్, ఎస్సెమ్మెస్‌లు వెళ్తున్నాయి, వస్తున్నాయి. దాంతో మా అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. అదే చంద్రబాల నుంచి జగన్ బద్ధ శత్రువైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఫోన్లు వెళ్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందంటూ మేం కొన్ని అనుమానాలు లేవనెత్తాం. వాస్తవానికి మేం జేడీ ఫోన్ కాల్స్ జాబితాను విడుదల చేసినప్పుడు చంద్రబాల ఎవరనే అనుమానాలను మాత్రమే వ్యక్తం చేశాం తప్ప ఆమెకు ఎలాంటి దురుద్దేశాలూ ఆపాదించలేదు. తన చానల్ ద్వారా చంద్రబాలను బయటకు తెచ్చి, ఆమె ఎవరో బహిరంగంగా తెలియజెప్పి బట్టబయలు చేసింది రాధాకృష్ణే. 

అంతేకాదు, ఈ ఏడాది మార్చి నుంచే తాను లీడ్ ఇండియా కార్యక్రమాలకు సంబంధించి రాధాకృష్ణతో మాట్లాడుతున్నానని చంద్రబాల చెబుతున్నది కూడా నిజం కాదు. రాధాకృష్ణతో ఆమె 2011 జూన్ నుంచే మాట్లాడుతున్నారని, ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారని మా వద్ద సమాచారముంది. ఇవన్నీ చూశాక.. జగన్‌పై కుట్ర జరుగుతోందన్న మా అనుమానాలు మరింత బలపడ్డాయి. అందుకు సమాధానం చెప్పాల్సింది పోయి, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. జగన్‌పై జరుగుతున్న కుట్రను జేడీ కాల్స్ జాబితా ఆధారంగా మేం ప్రశ్నిస్తూంటే.. ఒక వర్గం మీడియా, కొన్ని పత్రికలు మాత్రం దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయి. 

కాల్స్ వ్యవహారంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న ఏబీఎన్ చానల్.. చంద్రబాల నుంచి రాధాకృష్ణకు వచ్చిన కాల్స్ గురించి మాట్లాడటం లేదెందుకు? గుమ్మడికాయల దొంగంటే భుజాలెందుకు తడుముకుంటున్నారు?‘’ అని ఎమ్మెల్యేలు నిలదీశారు. జేడీ చేసిన కాల్స్‌కు సమాధానం చెప్పమంటే, అసలు ఆ జాబితాను ఎవరు, ఎలా బయట పెట్టారనే వాదనతో ప్రజల దృష్టిని మళ్లించజూస్తున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి కాల్స్ జాబితాను సంపాదించడం ఈ రోజుల్లో అంత కష్టమా అని ప్రశ్నించారు. జేడీ కాల్స్ జాబితా తమకు సాక్షి పత్రిక నుంచి అందిందనే ది పూర్తిగా తప్పుడు ప్రచారమని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ‘‘సాక్షికి, జేడీ కాల్స్ జాబితాకు సంబంధమేంటి? మాకెన్నో మార్గాలున్నాయి. జగన్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. జేడీ తన హోదాను అడ్డం పెట్టుకుని జగన్‌పై చేస్తున్న కుట్రను భరించలేని అభిమానులు మాకీ సమాచారాన్ని అందించి ఉండొచ్చు’’ అని వివరించారు. అసలు లక్ష్మీనారాయణ కాల్స్ జాబితాను ఎవరో ఇప్పటికే కోర్టుకు సమర్పించారని, ఇప్పుడదో పబ్లిక్ డాక్యుమెంటని వారన్నారు. కొందరు జగన్ అభిమానులు తమకందజేసిన సమాచారాన్ని దానికి జత చేశామని చెప్పారు. ‘లక్ష్మీనారాయణ ఏమీ కింది స్థాయి అధికారి కాదు. ఉన్నత హోదా ఉన్న వ్యక్తి. ఆయన ఎవరితో మాట్లాడాలనే విషయమై కొన్ని హద్దులుంటాయి’ అని వారన్నారు.

కొందరు రిపోర్టర్లకే ఫోన్లెందుకో?

క్రైం రిపోర్టర్లను తామేదో ఇరకాటంలో పెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని, అదెంత మాత్రమూ నిజం కాదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ‘‘క్రైం రిపోర్టర్లు జేడీకి ఫోన్ చేయడాన్ని మేం తప్పుబట్టడం లేదు. పైగా అభినందిస్తాం కూడా. కానీ జేడీ తాను ఎంపిక చేసుకున్న కొందరు క్రైం రిపోర్టర్లకు మాత్రమే ఫోన్ చేయడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం. రిపోర్టర్లతో తాను మాట్లాడటం లేదని జేడీ కోర్టు ముందు చెప్పారు.కానీ జరిగిందేమిటి? జగన్ కేసుల దర్యాప్తు విషయంలో జేడీ తొలి నుంచీ చాలా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తి ప్రాణాలకు హాని కలిగించే నార్కో అనాలసిస్ నిర్వహించడం సరికాదని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పులిచ్చింది. విజయసాయిరెడ్డి విషయంలో కూడా ఈ పరీక్షలకు సీబీఐ కోర్టు అనుమతినివ్వలేదు. 

అయినా జగన్‌కు ఇలాంటి హాని కలిగించే పరీక్షలు చేయాలని సీబీఐ మళ్లీ పిటిషన్ వేయడం కుట్రలో భాగం కాదా? జగన్ కేసులో ఎవరిని అరెస్టు చేయనున్నారో, ఎవరిని, ఎలా విచారిస్తారో కొన్ని పత్రికల్లోనూ, చానళ్లలోనూ ముందుగానే వస్తోంది. నిందితులను, సాక్షులను సీబీఐ అధికారులు విచారణలో ఏమేం ప్రశ్నిస్తున్నది కూడా కొన్ని పత్రికల్లో పూసగుచ్చినట్టు వస్తోంది. మా పార్టీ నాయకుడు అంబటి రాంబాబును వారేం ప్రశ్నించారో ఆ మర్నాడే కొన్ని పత్రికల్లో సవివరంగా వచ్చింది. జగన్‌ను అరెస్టు చేశాక ఆయనను ఏ మాత్రం రక్షణ లేని సాధారణ వాహనంలో జైలు నుంచి కోర్టుకు తీసుకు రావడం, సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, జైలు నుంచి జగన్‌ను ఏ దారిలో తీసుకొస్తారో కూడా కొన్ని చానళ్లలో ముందుగానే వస్తుండటం.. ఇదంతా దేనికి సూచిక? సీబీఐ విచారణ వివరాలన్నిటినీ మీడియాకు లీక్ చేస్తున్నారని ఇంతకాలంగా మేం వ్యక్తం చేస్తూ వచ్చిన అనుమానాలు జేడీ కాల్స్ జాబితాతో నిజమయ్యాయి’’ అని ఎమ్మెల్యేలు చెప్పారు. లక్ష్మీనారాయణ దర్యాప్తులో జగన్‌కు న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం లేదన్నారు. 

వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించిందెవరు?

తాము చంద్రబాల వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించామని గగ్గోలు పెడుతున్న చానల్, ఈ ప్రశ్నలకు బదులివ్వగలదాఅని ఎమ్మెల్యేలు నిలదీశారు.
వ్యక్తిగత జీవితాలను తన చానల్ ద్వారా, పత్రిక ద్వారా ప్రస్తావనకు తెస్తున్న రాధాకృష్ణా..! గవర్నర్ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించిన నీచమైన చరిత్ర ఎవరిది?
విజయవాడలో ఓ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు వస్తే.. సదరు మహిళను కెమెరాల ముందు పెట్టి, ఆ అధికారిని టార్గెట్ చేసి, దాన్ని వెలికి తీసిన విలేకరిని ప్రశంసించారు. అసలాయన ప్రైవేటు జీవితంలోకి వెళ్లాల్సిన అవసరం మీకేమొచ్చింది? అలా వెలికి తెచ్చిన విలేకరిపై విచారణ జరపాలని కోరలేదేం? ఏం.. ఆయన ఐపీఎస్ అధికారి కాదా! ఒక్క లక్ష్మీనారాయణే ఐపీఎస్ అధికారా?
ఓ మహిళ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించాలని చూసిన మీకు.. అది నీచాతినీచమని అనిపించలేదా? అంబటిది వ్యక్తిగత జీవితం కాదా! ఒక్క లక్ష్మీనారాయణకు మాత్రమే వ్యక్తిగత జీవితం ఉంటుందా?
తారాచౌదరి వ్యవహారం వెలుగులోకి వచ్చినపుడు ఆమె కాల్స్ జాబితాను రాధాకృష్ణ చానల్‌తో పాటు పలు చానళ్లు బయట పెట్టలేదా? ఆ మాట కొస్తే తారా చౌదరి కాల్స్ జాబితాను బయటపెట్టడం తప్పు కాదా? చంద్రబాల కాల్స్ జాబితాను బయట పెడితే మాత్రం తప్పయిందా?

భానుకిరణ్ ఎవరెవరితో మాట్లాడిందీ కాల్ లిస్టు తమ వద్ద ఉందంటూ, ఆయన సంభాషణలు తమ వద్ద ఉన్నాయంటూ ఈ చానళ్లు హల్‌చల్ చేయలేదా? అతని కాల్ లిస్టును బయట పెట్టలేదా? మరి అది తప్పు కాదా?

ఒక కుట్రనో, నేరాన్నో, అక్రమాన్నో వెలికి తీసినపుడు దానిని చర్చించాలే తప్ప, దాన్ని వెలికి తీసిన వారి గురించి చర్చిస్తారా?

ఇంతకుముందు జరిగిన అన్ని సంఘటనల్లోనూ కుట్రను గురించే చర్చించిన వాళ్లు.. ఇప్పుడెందుకు కుట్రను వెలికి తీసినవారిని లక్ష్యంగా చేసుకున్నారు? ఆ కుట్రలో వాళ్లూ భాగస్వామిగా ఉన్నందుకేనా?

చంద్రబాల నుంచి తనకు వచ్చిన కాల్స్ గురించి రాధాకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదు? అవన్నీ బయటకు రావనుకుంటున్నారా?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!