YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 25 June 2012

విత్తనాలు దొరక్క.. ఎరువులు అందక రైతుల విలవిల

బ్లాక్ మార్కెట్‌లో నిలువుదోపిడీకి గురవుతున్న కష్టజీవి
వ్యాపారులకు అండగా నిలుస్తున్న వ్యవసాయాధికారులు
నల్లబజారులో రూ.300 కోట్లు కోల్పోయిన రైతులు
పుచ్చు, చచ్చు వేరుశనగ విత్తనాలను సరఫరా చేస్తున్న సర్కారు
చివరికి ఆముదం విత్తనాలూ బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న దుస్థితి... ఆకాశానికి చేరిన సోయాబీన్ విత్తన రేట్లు
జీలుగ విత్తనాల ధర ఒకేసారి రూ.713 పెంపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏరువాక జోరందుకున్నా విత్తనాలు దొరకవు.. అదను దాటిపోతున్నా ఎరువులు అందవు.. న ల్ల బజారులో రైతన్న నిలువుదోపిడీకి గురవుతున్నా పాలకులకు పట్టదు! ప్రతి యేటా ప్రతి సీజన్‌లో రైతన్నకు ఇవే కష్టాలు.. అవే కన్నీళ్లు!! ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విత్తన కష్టాలు తప్పడం లేదు. ఖరీఫ్‌లో 2.20 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయ శాఖ.. అన్ని పంటలకు కలిపి 40.86 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని నిర్ధారించింది. వరి, వేరుశనగ, సోయాబీన్, కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్నలు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఆముదం, నువ్వులు, జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు కలిపి 14.92 లక్షల క్వింటాళ్లను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఖరీఫ్ మొదలై నెల కావస్తున్నా రైతులు ఇప్పటికి 5.88 లక్షల క్వింటాళ్ల విత్తనాలనే కొనుగోలు చేశారు. సర్కారు విత్తనాలపై నాణ్యత సందేహాలు ఉండడంతో రైతులు కొనుగోలు చేసేందుకు ముందుకురావడం లేదు. ఇదే అదనుగా కంపెనీలు రెట్టింపు ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నాయి. ఈ అక్రమాలను నిరోధించాల్సిన వ్యవసాయ శాఖ వ్యాపారులకే అండగా నిలుస్తోంది. రైతులు విత్తనాల కోసం ప్రయత్నించినప్పుడే వీలైనంత దోచుకునేందుకు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు తెగబడ్డారు. అమాయక రైతుల అవసరాలను సొమ్ముచేసుకుంటున్నారు.

విత్తుతోనే చిత్తయిన పత్తి రైతు...

పత్తి రైతు మూడేళ్లుగా దోపిడీకి గురవుతూనే ఉన్నాడు. బీటీ పత్తి విత్తనాలు వచ్చాక రైతులు ఏటా ప్రైవేటు కంపెనీల నుంచే విత్తనాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా మహికోతోపాటు మరో రెండు కంపెనీలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. సర్కారు నిర్ణయించిన విత్తనాల ఎంఆర్‌పీ రేట్లను ప్రైవేటు కంపెనీలు ఏమాత్రం ఖాతరు చేడయడంలేదు. ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ నిర్ధారించింది. 36 కంపెనీలు సరఫరా చేసే 1.27 కోట్ల పత్తి విత్తన డబ్బాలు/ప్యాకెట్లు(450 గ్రాములు) సరిపోతాయని లెక్కగట్టింది. రైతులు ఎక్కువగా డిమాండ్ చేసే మహికో కంపెనీ.. 5 లక్షల డబ్బాల విత్తనాలే సరఫరా చేస్తామని చెప్పినట్లు వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఉన్నతాధికారులు రైతులకు ఎక్కడా చెప్పలేదు. కంపెనీ 10 లక్షల డబ్బాలు ఇస్తుందని తప్పుడు ప్రచారం చేయడంతో రైతులు ఈ విత్తనాల కోసం డిమాండ్ చేశారు. దీన్ని మహికో కంపెనీ, డీలర్లు బ్లాక్ మార్కెట్‌తో బాగా సొమ్ము చేసుకున్నారు. రూ.930 ఎంఆర్‌పీ ఉన్న ఈ విత్తనాలను రైతులకు రూ.2 వేల చొప్పున బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించాల్సిన విత్తనాలను మహికో కంపెనీ మహారాష్ట్రకు తరలించింది. అక్రమ దందా రుచి మరిగిన మరో నాలుగు కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. సర్కారు అండతో జరుగుతున్న కంపెనీల బ్లాక్ మార్కెటింగ్‌తో పత్తి రైతులు ఈ ఖరీఫ్‌లోనే రూ.300 కోట్ల వరకు దోపిడీకి గురయ్యారు.

సర్కారు విత్తుకు నాణ్యత కరువు... 

రాష్ట్రంలో 44 లక్షల ఎకరాల్లో సాగు చేసే వేరుశనగ విషయంలోనే నాసిరకం సమస్య ఎక్కువగా ఉంది. గత ఏడాది కరువుతో ఎక్కువగా నష్టపోయిన వేరుశనగ రైతులను ఆదుకోవాల్సిన సర్కారు ఈ పంట విత్తనాల ధరలను పెంచింది. ఏడాది క్రితం క్వింటాల్‌కు రూ.3,600 ఉన్న వేరుశనగ విత్తనాల ధర ను రూ.3,950కి పెంచింది. ఏపీ సీడ్స్ విత్తనాలు ఉత్పత్తి చేయకపోవడంతో ప్రైవేటు వారి నుంచి సేకరించి ఇచ్చింది. 8 లక్షల వేరుశనగ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించి జిల్లాలకు తరలించింది. అయితే విత్తనాలు పుచ్చిపోయి ఉండడంతో రైతులు కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రాసెస్ కూడా సరిగా చేయకపోవడంతో కొనుగోలు చేసిన రైతులు బస్తాలు విప్పి చూసే సరికి ప్రతిబస్తాలో 6 కిలోలు విత్తుకు పనికి రాని తాలు కాయలు ఉంటున్నాయి. 

ఆముదం.. 5 లక్షల ఎకరాలకు లక్ష క్వింటాళ్లే!

రాష్ట్రంలో సాగు చేసే 5 లక్షల ఎకరాలకు సరిపడా ఆముదం విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాల్సిన సర్కారు కేవలం లక్షల క్వింటాళ్లే సేకరించి చేతులు దులుపుకుంది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.5 వేలు ధర ఉండగా 50 శాతం సబ్సిడీ ఇచ్చింది. దీంతో రైతులకు రూ.2,500కే విత్తనాలు దొరికాయి. ఈ ఏడాది ధరను రూ.5,200 పెంచిన సర్కారు సబ్సిడీని రూ.1,200లకు తగ్గించింది. దీంతో రైతులపై క్వింటాల్‌కు రూ.3 వేలకు కొనుక్కోవాల్సి వస్తోంది. సర్కారే ధర పెంచినందున తాము పెంచితే తప్పేంటనే ఉద్దేశంతో కంపెనీలు ఆముదం విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. రూ.400 ఉండే 3 కిలోల ఆముదం విత్తనాల ప్యాకెట్‌ను మహబూబ్‌నగర్, రంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో కంపెనీలు రూ.700ల చొప్పున అమ్ముతున్నారు.

సోయాబీన్.. రేట్లు ఆకాశంలో

గత ఖరీఫ్‌తో పోల్చితే సోయాబీన్ విత్తనాల ధరను సర్కారు క్వింటాల్‌కు రూ.1,140 పెంచింది. నిరుడు క్వింటాల్ సోయాబీన్ విత్తనాలను రైతులకు రూ.1,540కి పంపిణీ చేయగా ఇప్పుడు రూ.2,680కి పెంచారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల్లో సాగుకు సరిపడా సోయాబీన్ విత్తనాలను సేకరించాల్సిన వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ సకాలంలో ఆ పని చేయలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సోయాబీన్ విత్తనాల సేకరణ ఖర్చు రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం ఆ భారాన్ని రైతులపై వేసింది. ఇంతటితో ఆగకుండా సోయాబీన్ విత్తనాలను గత ఖరీఫ్‌లో 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేయగా ఇప్పుడు దీన్ని 33 శాతానికి తగ్గించారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.

రూ.713 పెరిగిన జీలుగ విత్తనాలు

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వీలైనంత ఎక్కువ సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయాల్సిన సర్కారు జీలుగ విత్తనాల ధరలను పెంచింది. గత ఏడాది జీలుగ విత్తనాల ధర క్వింటాల్‌కు రూ.1487 ఉండగా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.2200 పెంచుతూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీలుగ విత్తనాలపై ఒకేసారి రూ.713 పెంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఇన్‌పుట్ సబ్సిడీ ఎక్కడ..?
గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు రూ.1,816 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తామని చెప్పిన సర్కారు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఎక్కడా కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. పాత ఎరువులను బాహాటంగా కొత్త ధరలకు అమ్ముతున్నారు. పైగా దుకాణాలు మూసివేస్తామంటూ వ్యాపారులే సర్కారును బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే వారితో ప్రభుత్వ లాలూచీతనం బయటపడుతోంది. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరే కారణం. రైతుల పట్ల సర్కారుకు శ్రద్ధ లేదు.
- కె.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!