YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 25 June 2012

పైపై డ్రామాలా చంద్రబాబు!

ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు: వాసిరెడ్డి పద్మ
ధర్నాల పేరుతో బాబు, లగడపాటి వీధినాటకాలు
రైతుల పక్షాన పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీయే

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘విత్తనాల కొరత, ఎరువుల ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలతో రైతులు తీవ్రంగా సతమతమవుతున్నారు. కానీ వారి తరపున నిలబడి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన విపక్ష నేత చంద్రబాబు మాత్రం పైపై డ్రామాలాడటంతోనే సరిపెట్టుకుంటున్నారు. రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితిలో ఉంటే.. విజయవాడలో ఫ్లైఓవర్ నిర్మాణంపై బాబు, కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇద్దరూ ధర్నాల పేరుతో వీధినాటకం నడిపారు. వారి తీరు డ్రామా కంపెనీలను కూడా తలదన్నేలా సాగింది’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ ‘నువ్వు నన్నేదో అన్నట్టు.. నేను నిన్నేదో తిట్టినట్టు..’ నటిద్దామనే అవగాహనతో పని చేస్తున్నాయని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను పట్టించుకోనందుకే తాజా ఉప ఎన్నికల్లో వారు కాంగ్రెస్‌ను ఓడించారని గుర్తు చేశారు. తమ పక్షాన నిలబడనందుకు టీడీపీని కూడా అధికారపక్షం సరసనే నిలబెట్టారని ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీ నిజమైన ప్రతిపక్షమే అయితే.. ఒక్కటంటే ఒక్క సమస్యనైనా పోరాడి పరిష్కరించిందేమో చెప్పాలి. 876 కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. వాటిలో ఇంతవరకూ సహాయక చర్యలే చేపట్టలేదు. అయినా ప్రతిపక్షం దానిపై పోరాడదు. ప్రభుత్వాన్ని నిలదీయదు’ అంటూ ధ్వజమెత్తారు. రైతుల పక్షాన పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. వారి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తెస్తూ, ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ ధర్నాలు చేసిందని తెలిపారు.

రెండేళ్లుగా రైతులకు కష్టాలు: రాష్ట్రంలో రెండేళ్లుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని పద్మ ఆవేదన వెలిబుచ్చారు. 

‘‘ఏడాది కాలంలోనే ఎరువుల ధరలు 12 సార్లు పెరిగాయి. బీటీ విత్తనాల ధరలూ అమాంతం చుక్కలనంటాయి. బీటీ విత్తనాల డిమాండ్‌ను వ్యవసాయ మంత్రితో ప్రస్తావిస్తే, ‘రైతులు మహికో విత్తనాల మాయలో ఉన్నా’రంటూ వారిని అవమానించేలా మాట్లాడటం దారుణం. ఈ ఇక్కట్ల నేపథ్యంలో రైతులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. వారి బాధలు తెలుసు గనకే వారి కరెంటు బకాయీలన్నీ ఆయన రద్దు చేశారు. ఉచితంగా విద్యుత్ ఇచ్చారు. బీటీ విత్తనాల ధరలు తగ్గించారు. వైఎస్ పాలనలో ఎరువుల ధరలు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాదిలోనే రైతులపై ఏకంగా రూ.1,000 కోట్ల భారం పడింది. సాగుకు 9 గంటల పాటు ఉచిత విద్యుతిస్తామన్న వైఎస్ 2009 ఎన్నికల హామీకి ఇప్పటికీ దిక్కు లేదు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే రైతుల సమస్యలపై దీక్షలు చేశారు. వారిని ఆదుకోవాలంటూ ప్రధానికీ, కేంద్ర ఆహార మంత్రికీ లేఖలు రాశారు. రైతుల తరపున ఢిల్లీలో వారికి వినతిపత్రాలిచ్చారు’’ అని గుర్తు చేశారు. మద్దతు ధర సమస్య పరిష్కారానికి రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలన్న జగన్ చేసిన సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆమె తప్పుబట్టారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!