YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 26 June 2012

భూమన దీక్షకు పెరుగుతున్న మద్దతు

తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చేపట్టిన నిరశన దీక్ష మూడోరోజుకు చేరుకుంది. ఆయన దీక్షకు వివిధ వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. దీక్ష చేపట్టి మూడురోజులు కావడంతో భూమన బాగా నీరసించారు. 


భూమన దీక్షకు మద్దతుగా తిరుచానూర్‌ హైవేపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. ప్రజల కోరిక మేరకు తిరుపతిని మద్యరహిత నగరంగా తీర్చిదిద్దాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై మహిళలు మానవహారంగా ఏర్పడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆందోళనకు దిగుతున్నారని ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెప్పారు.


మద్యం షాపులను, లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతమైంది. లాటరీ నిర్వహించే కేంద్రాల వద్ద నిరసన తెలిపిన బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం వద్దు మంచినీళ్లు కావాలంటూ మెదక్‌ మహిళలు ఆందోళన చేపట్టారు. సీపీఐ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసు వాహనంపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మహిళలపై లాఠీచార్జ్‌ చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో నలుగురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.

వరంగల్‌ జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాల కేటాయింపులను నిరసిస్తూ ప్రజాసంఘాలు ఉద్యమించాయి. వారికి టీడీపీతోపాటు ఇతర పార్టీలు తోడయ్యాయి. లాటరీ తీస్తున్న భవనం ముందు ఆందోళనకు దిగాయి. లోపలికి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్‌ చేశారు. సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. 

నూతన మద్యం విధానాన్ని రద్దుచేయాలంటూ ఆదిలాబాద్‌లో వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీపీఐ, ఏపీ మహిళా సమాఖ్య, సిపిఐఎంఎల్, టిడిపి, ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తున్న కెఆర్ జి గార్డెన్‌ను ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లిన పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు.



హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు లాటరీ మొదలైంది. పలు చోట్ల మహిళా సంఘాల నేతలు ఈ లాటరీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రాలలో లాటరీ నిర్వహించే కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. మద్యం దుకాణం ఎవరికి దక్కుతుంది అన్న ఉత్కంఠకు తెరపడనుంది. లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుందో ఈ రాత్రికి తెలిసిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,596 మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల జారీ కోసం లాటరీ తీస్తున్నారు. 30వేలపై చిలుకు దరఖాస్తుల్లో అదృష్టవంతులను ఎంపిక చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఖైరతాబాద్‌లో లాటరీ తీస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఖైరతాబాద్ లోని శ్రీధర్ ఫంక్షన్ హాల్ లో లాటరీ ప్రారంభమైంది. ఇక్కడ ఆందోళన చేస్తున్న మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడ ఆందోళనలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ మధులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
కరీంనగర్ లో మద్యం లాటరీలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బిజెపి కార్యకర్తలు 30 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ లో మద్యం టెండర్లను అడ్డుకున్న మహిళా సంఘం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 
ఖమ్మం బైపాస్ రోడ్డులోని కృష్ణా ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడ మద్యం లాటరీలను సీపీఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీపీఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. సీపీఐ ఎమ్మెల్యే చంద్రావతిని అరెస్ట్ చేశారు. 

ఒంగోలు పోలీసు కళ్యాణ మండపం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మద్యం లాటరీలను అడ్డుకునేందుకు సీపీఐ కార్యకర్తలు ప్రయత్నించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసు కళ్యాణ మండపం వద్ద ఆయన బైఠాయించారు. 

నల్గొండ టౌన్ హాల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మద్యం లాటీరీలను సీపీఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీపీఐ ఎమ్మెల్యే యాదగిరిరావు, మహిళ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. విశాఖపట్నం రామా టాకీస్ జంక్షన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మద్యం లాటరీలను అడ్డుకున్న ఆందోళనకారుల అరెస్ట్ చేశారు. కర్నూలు జెడ్పీ ఆఫీసు వద్ద మద్యం లాటరీలను ప్రజాసంఘాలు అడ్డుకున్నాయి. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరులో మద్యం టెండర్ల కేంద్రం వద్ద ఉ సీపీఐ, టీడీపీ, లోక్ సత్తా ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. శ్రీకాకుళం పెద్దపాడు కళ్యాణమండపం వద్ద మద్యం లాటరీలను బీజేపీ, సీపీఐ, లోకసత్తా కార్యకర్తలు అడ్డుకున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!