YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 7 October 2012

చంద్రబాబు పాదయాత్రలో విచ్చలవిడిగా నకిలీ మద్యం

నకిలీ మద్యం పోసి ‘యాత్ర’కు ప్రజల తరలింపు
‘అనంత’ టీడీపీ నేత శ్రీనివాసులు ఫాంహౌస్‌పై ఎక్సైజ్ పోలీసుల దాడి 
నేల మాళిగల్లో భారీ స్థాయి నకిలీ మద్యం డంపు గుర్తింపు 
171 కేసుల నకిలీ మద్యం సీసాలను స్వాధీనం 
మరో వెయ్యికి పైగా కేసుల మద్యం ఇప్పటికే పంపిణీ 
ప్రత్యేక సుమో ద్వారా బాబు యాత్రలో పంపిణీ 
టీడీపీ కార్యకర్తల సమాచారంతోనే గుట్టురట్టు 
జిల్లా టీడీపీ నాయకులు శ్రీనివాసులు, దాల్‌మిల్ సూరి అరెస్ట్ 
కేసును నీరుగార్చేందుకు టీడీపీ అగ్రనేతల ప్రయత్నం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘వస్తున్నా-మీ కోసం’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేస్తున్న పాదయాత్రలో నకిలీ మద్యం పొంగి పొర్లుతోంది. యాత్రకు జనాన్ని సమీకరించేందుకు నకిలీ మద్యాన్ని నిల్వచేసి, పంపిణీ చేస్తున్న టీడీపీ అనంతపురం జిల్లా నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఎక్సైజ్ అధికారులకు దొరికిపోయారు. ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో శనివారం అర్ధరాత్రి టీడీపీ జిల్లా నాయకుడి ఫాంహౌస్‌పై దాడి చేసి భారీ ఎత్తున నిల్వ ఉంచిన నకిలీ మద్యం సీసాలను సీజ్ చేశారు. టీడీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి సలక్కగారి శ్రీనివాసులు, జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి సురేష్ అలియాస్ దాల్‌మిల్ సూరిని అరెస్టు చేశారు. 

మద్యం రుచిలో తేడా ఉండటంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలే ఎక్సైజ్ అధికారులకు ఉప్పందించినట్లు సమాచారం. నిజానికి పాదయాత్రలో నకిలీ మద్యం పంచుతున్నారనే విషయాన్ని సోమందేపల్లి గ్రామంలోనే రమాదేవి అనే మహిళ నేరుగా చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఆయనమాత్రం.. పాలక పక్షం విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు తెరవటంతోనే సమస్య ఉత్పన్నం అవుతోందని, తమ ప్రభుత్వం రాగానే వాటిని తీసివేస్తానంటూ చెప్పి అసలు విషయం పక్కదారి పట్టించారని స్థానికులు అంటున్నారు. ఎక్సైజ్ దాడిలో గుట్టు రట్టవటంతో ప్రజల్లో పలుచన అవుతామనే ఆలోచనతో స్వయంగా ‘అధినాయకుడే’ కేసును నీరుగార్చేందుకు విశ్వప్రయత్నాలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఢిల్లీ స్థాయి నాయకులను రంగంలోకి దించి దీన్ని సాధారణ మద్యంగానే కేసు నమోదు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించిన ‘వస్తున్నా-మీకోసం’ యాత్రకు జనాన్ని తరలించే బాధ్యత జిల్లా నాయకత్వానికి అప్పగించారు. ఒక్కో వ్యక్తికి రూ. 100 నోటుతో పాటు క్వార్టర్ బాటిల్ మద్యం సీసా ఇచ్చి పరిసర గ్రామాల నుంచి ప్రజలను గంపగుత్తగా లారీలు ఎక్కిస్తున్నారు. అగ్రనాయకుడు ఆదేశిస్తున్నాడు కానీ.. చిల్లిగవ్వ కూడా చేతికి ఇవ్వటం లేదనే ఆలోచనతో జిల్లా నాయకులు అడ్డదారి ఎంచుకున్నారు. మద్యం కొనుగోళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయటం ఎందుకనే ఆలోచనతో.. నకిలీ మద్యం పంచాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతను సలక్కగారి శ్రీనివాసులు, దాల్‌మిల్ సూరిలకు అప్పగించారు. ఎవరికీ అనుమానం రాకుండా యాత్ర రూట్ మ్యాప్‌లో లేని కొత్తచెరువు మండల కేంద్రాన్ని నకిలీ మద్యం రవాణాకు అడ్డాగా ఎంచుకున్నారు. మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనివాసులుకు చెందిన ఫాంహౌస్‌లో ప్రత్యేకంగా తవ్వించిన నేల మాళిగల్లో నకిలీ మద్యం సీసాలు దాచిపెట్టారు. 

అక్కడి నుంచి సుమోలో ప్రతిరోజూ యాత్ర సాగే గ్రామాలకు నకిలీ మద్యం సీసాలను సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల పరిశోధనలో తేలింది. నిందితుల నుంచి సేకరించిన వివరాలతో పాటు క్షేత్రస్థాయిలో ఎక్సైజ్ అధికారులకు లభించిన ఆధారాల ప్రకారం వెయ్యికి పైగా మద్యం కేసులు ఇప్పటికే పంపిణీ చేసినట్లు తేలింది. యాత్ర మొదటి రోజు నుంచే వీటిని పంపిణీ చేసినట్లు భావిస్తున్నారు. యాత్ర సాగిన గ్రామాల్లో తాగిపడేసిన మద్యం సీసాలు, శ్రీనివాసులుకు చెందిన ఫాంహౌస్‌లో దొరికిన నకిలీ మద్యం సీసాలు ఒకటే కావటంతో ఎక్సైజ్ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. శ్రీనివాసులుకు చెందిన ఫాంహౌస్‌లో 171 నకిలీ మద్యం కేసులను సీజ్ చేశారు. వీటిలో 67 పెట్టెల రియల్ హీరో విస్కీ, 66 పెట్టెల హైవార్డ్స్ ఫైన్ విస్కీ, 38 పెట్టెల మెక్‌డోవల్ బ్రాందీ ఉంది. లోచెర్ల అనే గ్రామంలో 48 క్వార్టర్లు హైవార్డ్స్ ఫైన్ విస్కీ, తాలమర్ల అనే గ్రామంలో మరో 48 క్వార్టర్లు హైవార్ట్స్ ఫైన్ వీస్కీ సీసాలను పట్టుకున్నారు. వీటిని టాటా ఐచర్ వాహనంతో పాటు ఒక ప్రత్యేక సుమో వాహనంతో తరలిస్తున్నారని పేరు చెప్పటానికి ఇష్టపడని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు.

నకిలీ మద్యం తయారీ ఇలా... 

వివిధ పరిశ్రమల నుంచి అక్రమంగా భారీ ఎత్తున రెక్టిఫైడ్ స్పిరిట్‌ను కొనుగోలు చేస్తారు. అందులో నీళ్లు కలిపి పలుచన చేస్తారు. బ్రాందీ, విస్కీ రంగులు రావటానికి సంబంధిత రంగులు కలుపుతారు. వాటిని క్వార్టర్ బాటిల్ సీసాల్లో పోసి బ్రాండ్ల పేర్లతో తయారు చేసిన లేబుళ్లు అతికిస్తారు. నకిలీ మద్యం తాగినవారు తీవ్ర అనారోగ్యం పాలవటమే కాదు.. ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=464783&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!