YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 8 October 2012

అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా?


వస్తున్నా.. మీకోసం అంటూ తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గ్యాస్ ధర, ఉచిత విద్యుత్, వికలాంగుల పెన్షన్ల విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. అంబటి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రూ.180 మాత్రమే ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇపుడు రూ.414కు పెరిగిందని బాబు చెప్పుకోవడం పెద్ద అబద్ధమన్నారు. ‘‘1994లో కాంగ్రెస్ అధికారంలో నుంచి దిగిపోయేటపుడు సిలిండర్ ధర రూ.115 ఉండేది. 2004లో బాబు పాలన ముగిసేటప్పటికి అది రూ.305కు పెరిగింది. వైఎస్ ఐదేళ్ల పాలనలో ఒక్క పైసాకూడా పెరగలేదు. 2008లో కేంద్రం సిలిండర్‌పై రూ.50 పెంచినా.. ఆ భారాన్ని కూడా రాష్ట్రమే భరించేలా చర్యలు తీసుకుని రూ. 305కు మించనీయని ఘనత వైఎస్‌దే’’ అని చెప్పారు. బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో గ్యాస్ ధర పెరిగినపుడల్లా తనకేం సంబంధం లేదనీ, పెంచింది కేంద్రమేనని నెట్టేశారని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు బాబు ఇచ్చిన పెన్షన్ కేవలం 75 రూపాయలే. అది కూడా రాష్ట్రం మొత్తం మీద 19 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. 

ఇప్పుడేమో తాను మళ్లీ అధికారంలోకి వస్తే రూ.1500 ఇస్తానని చెప్పడం దౌర్భాగ్యం. నిజాలు చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే మునీశ్వరుడి శాపం చంద్రబాబుకు ఉందని దివంగత వైఎస్సార్ పదే పదే చెప్పేవారు. అందుకే బాబు ఒక్క నిజమూ చెప్పరు’’ అని అంబటి దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో వికలాంగులకు రూ.500, మిగతా వారికి రూ.200 చొప్పున మొత్తం 69 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని గుర్తుచేశారు. తన హయాంలో తీవ్రమైన దుర్భిక్షానికిలోనైన అనంతపురం జిల్లాలో గంజి కేంద్రాలు నడుపుతుంటే వద్దన్న చంద్రబాబు ఇప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటానంటూ రావడాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘బాబు ఎన్నడైనా పసిపిల్లలను ఎత్తుకున్నారా? వృద్ధులను కౌగలించుకున్నారా? మహిళలను దగ్గరకు తీసుకున్నారా? ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ దెబ్బకు అవన్నీ చేయడం లేదా? జగన్ దెబ్బకు వేలాది కిలోమీటర్లు పాదయాత్రకు వెళ్లడం లేదా? తన శైలినే మార్చి వేసి రెండు వేళ్లు ఊపడానికి బదులు, రెండు చేతులు జోడించి ప్రజలకు దండాలు పెట్టడం లేదా?’’ అని అంబటి ఎద్దేవా చేశారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=465347&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!