YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 7 October 2012

ఇది పోరాడే సమయం...ధైర్యంగా ముందుకు నడిచే సమయం(sakshi)

ప్రజల కోసం, ప్రజలలో ఒకడిగా తిరిగే నాయకుడిని ఎక్కువకాలం ప్రజల నుండి దూరం చేయలేరు. బంతిని కిందకు ఎంత బలంగా కొడితే అంతకంటే బలంగా అది పైకి లేస్తుంది. చరిత్ర చూపిన సత్యం అది. ఎంత అణచివేస్తారో అంత పైకి లేస్తాడు జగన్.

నిన్న జడ్జిమెంట్ విని మేమంతా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. తాత్కాలికంగానైనా అన్యాయానికి, అక్రమానికి విజయం వచ్చిందే... దాన్ని దేవుడు కూడా అనుమతించాడే అని చాలా బాధ అనిపించింది. జడ్జిమెంట్ వచ్చినప్పుడు నేను, షర్మిల జగన్ దగ్గర ఉన్నాం. జగన్ మాకు చెప్పాడు - ‘ఇది బాధపడే సమయం కాదు. పోరాడే సమయం. మనసు గట్టి చేసుకుని, ధైర్యంగా ముందుకు నడిచే సమయం. అన్యాయం, అక్రమం పెరిగినప్పుడే మనం పోరాడాల్సింది. సమాజంలో చెడిపోయిన వాటిని మనం బాగు చెయ్యాలి, పడిపోయిన వాటిని మనం నిలబెట్టాలి, భ్రష్టుపట్టిన వాటిని మనం బాగు చెయ్యాలి’ అని చెప్పాడు. ‘మనమే అధైర్యపడితే నాన్నను ప్రేమించి, మనలను తమ కుటుంబంగా భావిస్తున్న ప్రజలు ఏమౌతారు’ అన్నాడు.

అత్తమ్మ, పిల్లలు, బంధువులు, మిత్రులు ఏడ్చారు. వేచి వున్న కోట్లమంది ప్రజలు నివ్వెరపోయారు. కానీ ఇది జగన్ అన్నట్టు బాధపడే సమయం కాదు. ఇది పోరాట సమయం. మన రాష్ట్రానికి వైయస్సార్ సువర్ణ పాలన తెచ్చుకునే పోరాట సమయం. జగన్ మొదలుపెట్టిన పనిని, జగన్ బయటకు వచ్చేవరకు ముందుకు నడపాల్సిన బాధ్యత వైయస్సార్‌ను ప్రేమించే మనందరి మీదా వుంది. ప్రజల కోసం, ప్రజలలో ఒకడిగా తిరిగే నాయకుడిని ఎక్కువకాలం ప్రజల నుండి దూరం చేయలేరు. బంతిని కిందకు ఎంత బలంగా కొడితే అంతకంటే బలంగా అది పైకి లేస్తుంది. చరిత్ర చూపిన సత్యం అది. ఎంత అణచివేస్తారో అంత పైకి లేస్తాడు జగన్.

కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలని సీబీఐ ఆడుతున్న అబద్ధాలను, వాటిని పుంఖానుపుంఖాలుగా రాస్తున్న ఎల్లో గ్యాంగ్‌ను, నోటికి హద్దులు లేకుండా అబద్ధాలను ప్రచారం చేసే నాయకులను నోరు మూయించే సమయం తప్పక వస్తుంది.

కొంతమంది జీవితాన్ని పదవులతో, ఆస్తులతో కొలుస్తారు. మరికొంతమంది ఆస్తులు, పదవులను తృణప్రాయంగా ఎంచి ఎలా బ్రతుకుతున్నాం అనే కొలబద్దతో కొలుస్తారు. పదవుల కంటే విశ్వసనీయతకు, ఆస్తుల కంటే ప్రజాభిమానానికి విలువనిస్తారు. ఆజాద్‌గారు అన్నట్టు జగన్ పదవిని వదులుకున్నా విశ్వసనీయతను వదులుకోలేదు. ఆస్తులను జప్తు చేస్తున్నారని, చేస్తారని ప్రజాభిమానాన్ని పణంగా పెట్టలేదు. ఒక మనిషి జీవితానికి విలువ పలికేది పదవి కాదు... ఆ మనిషియొక్క ప్రవర్తన, నడవడిక అని నమ్మే జగన్‌కు భార్యగా ఉండడం నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాను.

మామగారు మా మధ్య నుండి వెళ్లిపోయిన తరువాత జగన్‌ను గానీ, మా కుటుంబాన్ని కానీ ఆదరించి నడిపించింది రాష్ట్రంలోని ప్రతి అవ్వ, తాత, అక్క, చెల్లి, అన్న, తమ్ముడుల ప్రేమ అభిమానాలే. జగన్‌ను ఒక నాయకునిగా చేసింది ఆ ప్రజల అండదండలే. ఇప్పుడు జైలులో ఉన్న జగన్‌ను, మా కుటుంబాన్ని ఆ ప్రేమాభిమానాలే ముందుకు నడుపుతాయి. జగన్‌ను నాయకుడిని చేసిన ప్రజలే జగన్ నాయకత్వాన్ని బలపరుస్తారని నమ్ముతూ చేతులు జోడించి, శిరసు వంచి పేరుపేరునా ప్రతిఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇంతవరకు మమ్మల్ని నడిపించి, మాకు తోడుగా వుండి విజయం ఇచ్చిన దేవుడు, ఈ కష్టసమయంలో కూడా మాకు తోడుగా వుండి, మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడని నమ్ముతున్నాను.


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!