YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 7 October 2012

డీఎల్‌ఎఫ్ చెప్పినవన్నీ అర్ధసత్యాలు, అసత్యాలు: కేజ్రీవాల్

డీఎల్‌ఎఫ్ చెప్పినవన్నీ అర్ధసత్యాలు, అసత్యాలు: సామాజిక కార్యకర్త కేజ్రీవాల్ 

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌తో గల సంబంధాలపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సమాధానం చెప్పలేదని సామాజిక కార్యకర్త, ఇండియా అగెనైస్ట్ కరప్షన్ (ఐఏసీ) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు. వాద్రాతో జరిపిన లావాదేవీలపై డీఎల్‌ఎఫ్ తన వివరణలో చెప్పినవన్నీ అర్ధసత్యాలు, అసత్యాలేనని ఆయన ఆరోపించారు. డీఎల్‌ఎఫ్ చాలా సమాచారాన్ని తొక్కిపెట్టిందని అన్నారు. వాద్రా చెబుతున్నట్లుగా చౌకబారు ప్రచారం కోసం లేదా ఆయనపై బురదచల్లేందుకు ఈ ఆరోపణలు చేయడం లేదన్నారు. 

వాద్రా తమ ఉద్దేశాలను ప్రశ్నించారే తప్ప తాము లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వలేదని చెప్పారు. పైసా పెట్టుబడి లేకుండా డీఎల్‌ఎఫ్ ద్వారా వాద్రా రూ.300 కోట్ల మేరకు ఆస్తులను కూడగట్టుకున్నట్లు కేజ్రీవాల్‌తో పాటు ప్రముఖ న్యాయవాదులు శాంతిభూషణ్, ప్రశాంత్‌భూషణ్‌లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాద్రాకు డీఎల్‌ఎఫ్ ఎలాంటి వడ్డీ, పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చిందని, ఆ మొత్తంతోనే ఆయన డీఎల్‌ఎఫ్ నుంచి కారుచౌకగా ఆస్తులు కొనుగోలు చేశారని, ఇందుకు ప్రతిఫలంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు డీఎల్‌ఎఫ్‌కు ‘క్విడ్ ప్రో కో’ పద్ధతిన లబ్ధి కలిగించాయని వారు ఆరోపించారు. 

అయితే, డీఎల్‌ఎఫ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, శనివారం వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాద్రాతో వ్యక్తిగత స్థాయిలోనే లావాదేవీలు జరిపామని, అవన్నీ పూర్తిగా పారదర్శకంగా జరిగాయని డీఎల్‌ఎఫ్ తన వివరణలో వెల్లడించింది. డీఎల్‌ఎఫ్ వివరణలో చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలేనని కేజ్రీవాల్ ఆరోపించారు. డీఎల్‌ఎఫ్ వివరణకే వాద్రా కట్టుబడి ఉంటారా, లేకుంటే ఆయన దీనిపై వేరే వాదనను వినిపిస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. వాద్రా తన వాదనను వినిపిస్తే సంతోషిస్తానని చెప్పారు. డీఎల్‌ఎఫ్, కాంగ్రెస్‌ల వెనుక దాక్కున్న వాద్రా ఈ అంశంలో తమ ఉద్దేశాలను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. డీఎల్‌ఎఫ్ ప్రతిస్పందనలోని అంశాలపై తమ బృందం అధ్యయనం చేస్తోందని, సోమవారం పూర్తి వివరాలతో స్పందిస్తానని అన్నారు. 

http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=464991&Categoryid=1&subCatId=32

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!