YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 20 August 2012

వైద్యానికి వచ్చి ఏడాదిలో 22 వేల మంది చిన్నారుల మృతి


ప్రభుత్వాస్పత్రుల్లో రోజూ 60 మంది శిశువుల మృత్యువాత
వైద్యానికి వచ్చి ఏడాదిలో 22 వేల మంది చిన్నారుల మృతి
రాష్ట్రంలో శిశు మరణాలపై యూనిసెఫ్ నివేదిక 
వైద్యులు, సదుపాయాల కొరతే ప్రధాన కారణం 
వైద్యుల్లో పీడియాట్రిక్ డాక్టర్లు కేవలం 5 శాతమే 
పిల్లల వార్డుల్లో నర్సుల కొరత
ప్రభుత్వ, బోధనాస్పత్రులన్నిటా వెంటిలేటర్లు, రేడియంట్ వార్మర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత 
ఉన్న పరికరాల్లోనూ పనిచేసేవి సగానికి సగమే 
నివేదిక ఇచ్చి మూడు నెలలైనా చలించని సర్కారు

తిరుపతి రుయా ఆస్పత్రిలో మూడు మాసాల్లో 130 మంది శిశువుల మృతి!
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏడు మాసాల్లో 365 మంది పసిపిల్లలు మృత్యువాత! 
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో ఏడాదిలో ఏడు వేల మందికి పైగా చిన్నారుల మరణం! 

రాష్ట్రంలో ప్రధాన ఆస్పత్రుల్లో శిశు హననం కొనసాగుతూనే ఉంది. ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీరనే లేదు. వెంటిలేటర్లు ఏర్పాటు జరగనే లేదు. వైద్యులు, నర్సుల కొరత ఏళ్లతరబడి కొనసాగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బోధనాస్పత్రుల్లో పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. ఏటికేటికీ శిశు మరణాల సంఖ్య తగ్గాల్సింది పోయి పెరుగుతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. బరువు తక్కువగా పుట్టిన శిశువుల్లో 90 శాతం మరణిస్తున్నారు. చిన్నారులకు కామెర్లు సోకి ఆస్పత్రికి వెళితే.. ప్రాణాలతో తిరిగివస్తారన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 63 శాతం రేడియంట్ వార్మర్స్ పనిచేయటంలేదని.. దీనివల్ల వేలాది మంది శిశువులు మృతి చెందుతున్నారని స్పష్టమైంది. రాష్ట్రంలో ఏటా 14 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వచ్చి మృతి చెందుతున్న వారి సంఖ్య 22 వేలకు పైనే ఉన్నట్టు యూనిసెఫ్ నివేదికలే చెప్తున్నాయి. 

హైదరాబాద్ (న్యూస్‌లైన్): ‘తల్లులు పోషకాహారం కొరత వల్లే బరువు తక్కువ బిడ్డలను కంటారు. క్లిష్ట సమయాల్లోనే తమ బిడ్డలను ప్రభుత్వాస్పత్రులకు తీసుకొస్తారు. కానీ.. అందుబాటులో వైద్యులు లేక.. ఆక్సిజన్ అందించలేక.. కామెర్ల జబ్బుకు వార్మర్స్ లేక.. ఇతరత్రా వైద్య సదుపాయాలు లేక.. ఆ శిశువులు మరణిస్తున్నారు...’ - రాష్ట్రంలో శిశు మరణాలపై అంతర్జాతీయ శిశు నిధి సంస్థ యూనిసెఫ్ చెప్పిన అక్షర సత్యాలు ఇవి. మూడు నెలల కిందట రాష్ట్ర పరిస్థితులపై యూనిసెఫ్ ఒళ్లు గగుర్పొడిచే నిజాలను బయటపెట్టింది. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో వైద్యం కోసం వచ్చిన 22 వేల మంది శిశువులు మరణించారని యూనిసెఫ్ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అంతా డొల్ల అనీ, ఎక్కడా ప్రమాణాలు లేవని, రోగి బతికి బయటపడితే అదృష్టమేనని వ్యాఖ్యానించింది. యూనిసెఫ్ దేశంలోని 13 మంది నిపుణుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో అధ్యయనం చేసింది. 

ఈ అధ్యయనం ఆధారంగా బోధనాస్పత్రులపై 132 పేజీలతో నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించింది. ‘న్యూస్‌లైన్’కు లభించిన ఈ నివేదిక పరిశీలించగా కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. 2011 మే నుంచి 2102 ఏప్రిల్ మధ్య 12 మాసాల్లో 22 వేల మంది శిశువులు ఆస్పత్రులకు వైద్యానికి వచ్చి మృతి చెందినట్టు స్పష్టమైంది. అంటే సగటున ప్రతిరోజూ 60 మంది శిశువులు మృతి చెందుతున్నారు. అత్యధికంగా కర్నూలులో ప్రతి 100 అడ్మిషన్లకు 34 శాతం మంది శిశువులు మృతి చెందారు. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రతి వంద అడ్మిషన్లలో 29.4 శాతం శిశువులు వివిధ కారణాల వల్ల మృతి చెందారు. నీలోఫర్ ఆస్పత్రిలో ఒక్క ఏడాదిలో 7 వేల మంది శిశువులు మృతిచెందినట్టు తేలింది. అయితే మిగతా ఆస్పత్రులతో పోలిస్తే నీలోఫర్ వైద్యం ఫరవాలేదని యూనిసెఫ్ పేర్కొంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, బరువు తక్కువ కారణంగా ఎక్కువ మంది శిశువులు మృతి చెందినట్టు వెల్లడైంది. 

అధ్వానం... అలసత్వం... 

రాష్ట్రంలో బోధనాస్పత్రుల్లో అత్యంత అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయన్నది యూనిసెఫ్ నివేదిక సారాంశం. వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. చాలా ఆస్పత్రుల్లో నవజాత శిశువులకు కామెర్లు సోకితే చికిత్స అందించాల్సిన రేడియంట్ వార్మర్స్ లేవు. చాలా చోట్ల ఉన్నా కూడా అవి పనిచేయటం లేదు. నవజాత శిశువులకు వైద్యం అందించటంలో డాక్టర్లకు కానీ, నర్సులకు కానీ ఎవరికీ సరైన శిక్షణ లేదు. ఫొటోథెరపీ యూనిట్లు పనిచేయటం లేదు. ఎక్కడ చూసినా అలసత్వమే. రుయా లాంటి ఆస్పత్రుల్లో ప్రసవం అనంతరం వైద్యులు చేతులు శుభ్రం చేసుకునేందుకు వాష్ బేసిన్‌లు కూడా లేవు. ప్రతి చోటా పడకల సంఖ్యకు మించి పేషెంట్లు వస్తున్నా ఎక్కడా అదనపు సౌకర్యాలు సమకూర్చిన దాఖలాలు లేవు. విజయవాడ సిద్ధార్థ ఆస్పత్రిలో 20 శాతం, నీలోఫర్‌లో 23 శాతం, కాకినాడ రంగరాయ కళాశాలలో 25 శాతం, వైజాగ్‌లో 28 శాతం, గాంధీలో 52 శాతం, గుంటూరులో 50 శాతం, వరంగల్ ఎంజీఎంలో 51 శాతం పరికరాలు మాత్రమే పనిచేస్తున్నట్టు అధ్యయనంలో తేటతెల్లమైంది. రాష్ట్రంలో బయోమెడికల్ ఇంజనీర్లు లేరు. ఏ పరికరానికీ నిర్వహణ లేక కోట్లాది రూపాయల పరికరాలు మూలనపడి ఉన్నాయి.

వేధిస్తోన్న వైద్యుల కొరత

రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో మొత్తం 2,200 మంది వైద్యులున్నారు. ఇందులో కనీసం పది శాతం మంది చిన్నపిల్లల వైద్యులుండాలి. కానీ ఐదు శాతం కూడా లేరు. ప్రతి ఆస్పత్రిలోనూ పీడియాట్రిక్ డాక్టర్ల కొరతే. ఇక వైద్యవిధాన పరిషత్‌లోని 17 జిల్లా ఆస్పత్రుల్లో 90 మంది పీడియాట్రిక్ వైద్యుల కొరత ఉంది. మరో 77 మంది అనస్థీషియన్ల లోటు ఉంది. నీలోఫర్ లాంటి ప్రధాన శిశు వైద్య ఆస్పత్రుల్లోనే పీడియాట్రిక్ డాక్టర్ల కొరత ఉందంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. మొత్తం పీడియాట్రిక్ వార్డుల్లోనే 600 మంది నర్సుల కొరత ఉందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎన్‌సీయూ (సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్) పరిస్థితి అధ్వానంగా ఉందని, వీటిని తక్షణమే పునరుద్ధరించాలని ఆరు మాసాల కిందట డీఎంఈ నివేదిక ఇచ్చినా వాటిని గురించి పట్టించుకోలేదు. 

ఇదేనా ఆస్పత్రుల పనితీరు?

రాష్ట్రంలోని ఆస్పత్రుల స్థితిగతులపై యూనిసెఫ్ తీవ్ర విమర్శలు చేసింది. పర్యవేక్షణ, పనితీరు లోపభూయిష్టంగా ఉందని చెప్పింది.

తిరుపతి రుయా: వెంటిలేటర్లు పనిచేయటం లేదు. సరైన నీటి సౌకర్యం లేదు. 16 మంది పీడియాట్రిక్ వైద్యులు అవసరమైతే 10 మందే ఉన్నారు. రికార్డుల నిర్వహణ లేదు. ప్రతి వంద అడ్మిషన్లకూ 15 మంది చనిపోతున్నారు. 
కాకినాడ రంగరాయ: ఇక్కడ ఆక్సిజన్ సౌకర్యం కొరత వేధిస్తోంది. వైద్యుల కొరత కూడా ఉంది. మరణాల రేటు చాలా ఎక్కువ. 
గుంటూరు జీజీహెచ్: వెంటిలేటర్లు లేవు. రేడియంట్ వార్మర్స్ పనిచేయటం లేదు. ల్యాబొరేటరీ అత్యంత అధ్వానంగా ఉంది. 24 గంటలూ వైద్యం అనేది ఇక్కడ అందని ద్రాక్షే. ఇక్కడికి వైద్యానికి వస్తున్న నెలలోపు శిశువుల్లో ప్రతి వంద మందికీ 30 మంది మరణిస్తున్నారు.

హైదరాబాద్ గాంధీ: ఇక్కడ నియోనేటాలజీ వార్డే లేకపోవడం విచిత్రం. ఒక రూము నుంచి పేషెంటును మరో రూమ్‌కు షిఫ్ట్ చేసే సౌకర్యం లేదు. పరికరాలు పడకేశాయి. ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. నెలకు 750 మంది డెలివరీ అవుతున్నా కనీస వసతులు లేవు.
హైదరాబాద్ నీలోఫర్: శిశువులకు కామెర్లు సోకితే అంతే. 80 రేడియంట్ వార్మర్స్ ఉంటే 20 మాత్రమే పనిచేస్తున్నాయి. ఫొటోథెరపీ యూనిట్లు పనిచేయటం లేదు. పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా సౌకర్యాల్లేవు. 

విజయవాడ సిద్ధార్థ: నియోనేటాలజీ వార్డే లేదు. సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం లేదు. ఏటా 4 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నా సౌకర్యాలు లేవు. ప్రతి వంద ప్రసవాలకూ 18 మంది మృతి చెందుతున్నారు. 
కర్నూలు జీజీహెచ్: ఆక్సిజన్ సిలిండర్లు లేవు. రక్తపరీక్షలు సరిగా జరగటం లేదు. 24 గంటలూ వైద్యం అందదు. ఆస్పత్రిలో లైట్లు కూడా లేని పరిస్థితి. ప్రతి వందమంది శిశువుల్లో 34.5 మంది మృతి చెందుతున్నారు. 
విశాఖ కేజీహెచ్: కింగ్ జార్జి ఆస్పత్రి పిల్లల వార్డులో ప్రతి రోజూ కనిష్టంగా రెండు మూడు, గరిష్టంగా ఐదారు మరణాలు సంభవిస్తుంటాయి. వైద్యుల కొరత వల్ల రాత్రి వేళల్లో ఎక్కువగా పీజీలే విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఆస్పత్రుల నిర్వహణపై యూనిసెఫ్ సూచనలు... 
తక్షణమే నియోనేటాలజీ యూనిట్లు ఏర్పాటు చేయాలి

ఎస్‌ఎన్‌సీయూ (సిక్ నియోనేటల్ కేర్ యూనిట్)లను పునరుద్ధరించాలి విద్యుత్ సరిగా లేకపోవటం వల్ల పరికరాలు పాడవుతున్నాయి. పవర్ ఆడిట్ ఉండాలి శిశువులను వార్డులకు మార్చే సౌకర్యాన్ని మెరుగుపరచాలి 24 గంటలూ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులోకి తేవాలి ఎస్‌ఎన్‌సీయూలలో అగ్నిప్రమాద రహిత సౌకర్యం కల్పించాలి పరికరాలు కొన్నాక కనీసం ఐదేళ్లయినా నిర్వహణ ఉండాలి పేషెంట్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని పరికరాల సామర్థ్యం పెంచాలి స్టాఫ్ నర్సులకు తక్షణమే శిక్షణ కల్పించాలి శిశువుల జనన, మరణ వివరాలకు రికార్డులు నిర్వహించాలి కేంద్ర నిధులు సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి.

24 గంటలూ వైద్య సేవలు అందిస్తున్నాం 

నీలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. పేషెంటు పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నా అడ్మిషన్ ఇస్తున్నాం. వైద్యసేవలు అందిస్తూనే ఉన్నాం. వైద్యులందరూ 24 గంటలూ సేవలు అందిస్తూనే ఉన్నారు. కానీ శిశువులు ఇక్కడికొచ్చే సరికే చాలా ఆందోళనకర పరిస్థితిలో ఉంటున్నారు. దీంతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. 
-డా.డి.రంగనాథ్, సూపరింటెండెంట్, నీలోఫర్ ఆస్పత్రి

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!