YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 20 August 2012

ఎదురు తన్నిన బీసీ ఎత్తు (andhrabhoomi)

http://www.andhrabhoomi.net/content/bc-strategy-misfires


హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో బీసీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ‘వంద టికెట్లు కాదు, బీసీలకు వంద సీట్లు’ అనే ప్రతిపాదనను బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆహ్వానించారు. కానీ టిడిపి నేతలు మాత్రం జరుగుతున్న పరిణామాలపై మండిపడుతున్నారు. ‘మేం వంద అంటే మీరు 105 అనండి పరవాలేదు. కానీ లేఖ ఏమిటి? దాన్ని ఉప సంహరించుకోండి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నారు. టిడిపి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించి ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా హడావుడికి శ్రీకారం చుట్టింది. వివిధ కుల సంఘాల నేతలను ఎన్టీఆర్ భవన్‌కు తీసుకొచ్చి బాబును సత్కరించే బాధ్యతను జిల్లా నేతలకు పార్టీ నాయకత్వం అప్పగించింది. బీసీల నుంచి రోజూ ఒక కులం నాయకులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి బాబును అభినందించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ హడావుడి కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా బీసీ రాజకీయం మొదలైంది. ‘వంద టికెట్లు కాదు, వంద సీట్లు కేటాయిద్దాం’ అంటూ వైఎస్ విజయమ్మ చంద్రబాబుకు రాసిన లేఖ టిడిపిని ఇరకాటంలో పెట్టింది. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ వాదంపై పేటెంట్ హక్కుగా భావిస్తున్న స్థాయిలో బీసీ అంశానికి పేటెంట్ హక్కు మాదేననే స్థాయిలో టిడిపి ప్రచారం సాగించాలని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బీసీ టికెట్లపై మీ అభిప్రాయం చెప్పాలి అని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను టిడిపి డిమాండ్ చేసింది. తీరా వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త మెలిక పెట్టడంతో లేఖను ఉపసంహరించుకోవాలని టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. టిడిపి బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే, మీరు 105 అని చెప్పండి. అంతే తప్ప ఇదేంటి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. మరో ప్రధాన కార్యదర్శి అనురాధ ఇతర నేతలు సైతం ఇదేవిధంగా విమర్శించారు.
గత ఎన్నికల్లో హామీ ఇచ్చి బీసీలకు వంద సీట్లు ఇవ్వలేకపోయినప్పటికీ, ఈసారి మాత్రం బాబు కచ్చితంగా వంద సీట్లు ఇవ్వాలనే నిర్ణయంతోనే ఉన్నారని టిడిపి సీనియర్ నాయకులు తెలిపారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం లేదని తెలిపారు. వంద మందికి టికెట్లు ఇవ్వడం కాదు, అసెంబ్లీకి పంపిద్దాం అంటూ ఆ పార్టీ చేసిన సూచన మంచిదే కానీ ఒకవేళ మేం దాన్ని ఆమోదిస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం తప్ప మాకొచ్చే ప్రయోజనం ఏముందని టిడిపి నాయకులు ప్రశ్నించారు. మెజారిటీ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. వీటిలో వంద నియోజక వర్గాలను బీసీ నియోజక వర్గాలుగా గుర్తించి కేటాయించేందుకు ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ టిడిపి అలా చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌ను అనుసరించినట్టు అవుతుందని టిడిపి నాయకులు తెలిపారు. అంతేకాదు ఇబ్బంది లేని వంద నియోజక వర్గాలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయించడం వేరు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలను గుర్తించి టికెట్ ఇవ్వాలంటే ఇంతకాలం ఆ నియోజక వర్గంపై ఆశలు పెట్టుకొని, ఖర్చు భరిస్తున్న టిడిపి నాయకుల నుంచి తిరుగుబాటు వస్తుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇంకా అభ్యర్థుల ఖరారు చేసే పరిస్థితి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ వెళ్లలేదు కాబట్టి వాళ్లు ఉత్సాహంగా వంద టికెట్లు కాదు వంద సీట్లు ఇద్దామని ప్రతిపాదన చేస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించారు. బీసీలకు తాము టికెట్ ఇచ్చినా ఇతర పార్టీల నాయకులు అగ్రవర్ణాలకు ఇవ్వడం వల్ల సమ ఉజ్జీల మధ్య పోటీ లేక బీసీ అభ్యర్థులు ఓడిపోతారని 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకటనలను పత్రికల నుంచి సేకరించారు. తమ ప్రతిపాదన పట్ల చంద్రబాబు స్పందన వెలువడిన తరువాత ఈ ప్రకటనల గురించి ప్రస్తావిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మాట మీరే అన్నారు కాబట్టి ఇద్దరం బీసీలకే టికెట్ ఇద్దాం. ఈ ప్రతిపాదనకు మీరు ముందుకు రావాలి అని డిమాండ్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఆశ్చర్యపోయా!
విజయమ్మ లేఖ చూసి ఆశ్చర్యపోయానని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. గత చరిత్ర మరిచిపోయి ఆమె లేఖ రాశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన విశ్వకర్మ సమావేశంలో, తిరుపతిలో ఇదే విషయం మాట్లాడారు. వందమందిని అసెంబ్లీకి పంపేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా మేం వంద సీట్లు ఇస్తామంటే మీరు 150 సీట్లు ఇవ్వండి అంతేగాని లేఖరాయడం ఏమిటని ప్రశ్నించారు. టిడిపి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో వైఎస్‌ఆర్ పార్టీకి వణుకుపుట్టిందని అన్నారు. వంద నియోజక వర్గాలను గుర్తించి వాటిని రెండు పార్టీలు బిసిలకే కేటాయించాలి అనే ప్రతిపాదన పట్ల చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయలేదు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!