‘కిరణ్ కుమార్ రెడ్డిలో ఏం చూసి ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిందో కాంగ్రెస్ అధిష్టానం?!’- ఈ అనుమానం మీకో నాకో వస్తే అందులో విశేషం లేదు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నెగ్గుకొస్తున్న ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డికే ఇలాంటి అనుమానం తలెత్తడం కన్నా విడ్డూరమేముంది? కిరణ్ కుమార్ రెడ్డి గొప్ప రాజనీతిజ్ఞుడా? కాదు! పరిపాలనా దక్షుడా? కానేకాదు! రాష్ట్ర రాజకీయాలను ఔపోసన పట్టేసిన అభినవ అగస్త్యుడా? ఎబ్బే, ఎంతమాత్రం కాదు. కనీసం ఒక్క భాషలోనయినా, శ్రోతలను ఆకట్టుకునేలా మాట్లాడగల వక్తా? అంటే అదీ కాదు. పోనీ, కన్నుమూసి తెరిచేలోగా తలకాయలు మార్చిపారేయగల జాదూగరా? ఆయన శత్రువులు కూడా అనలేని మాట అది! మరేం చూసి కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం కట్టబెట్టారో? కాంగ్రెస్ కురువృద్ధుడు పురుషోత్తమరెడ్డికి ఎదురయిన ధర్మ సంకటమే మనకూ తప్పలేదు!
అయినా, పురుషోత్తమరెడ్డి గారు పెద్దవారు. ఆయనకో చిన్న సామెత తెలిసే ఉంటుంది- ‘అందమన్నది చూసేవారి కళ్లలో ఉంటుంది!’ మీకూ, నాకూ, పురుషోత్తమరెడ్డిగారికీ కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ ప్రత్యేకతా కనిపించి ఉండకపోవచ్చు. అసలు నిజంగానే మన ముఖ్యమంత్రిలో ఏ ప్రత్యేకతా లేకపోనూ వచ్చు. కానీ, ఆయన్ను ఆ పదవిలో కూర్చోపెట్టిన అధిష్టానమ్మ ఉందే, ఆమెకు కిరణ్ కుమార్ రెడ్డిలో ఏ విశిష్టత కనిపించిందో? మన దృష్టి కన్నా, ఆమె దృష్టికి ఎక్కువ ప్రాముఖ్యం ఉందన్న వాస్తవాన్ని సవినయంగా అంగీకరించాల్సిందే!
ఇంతకీ, సదరు అధిష్టానమ్మ ఎంపిక చేసి, కిరణ్ కుమార్ రెడ్డికి పదవి కట్టబెట్టిన అనంతరం, మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో పురుషోత్తమరెడ్డి శుక్రవారం నాడు -అగస్ట్ 24న- విలేకరుల సమావేశంలో సవివరంగా పేర్కొన్నారు. ‘రాష్ర్టంలో ఏ ప్రాంతంలోనూ కరెంటు ఉండడం లేదు- గుక్కెడు మంచినీళ్లక్కూడా దిక్కులేదు- ఇక సాగు నీరు విషయం మాట్లాడ్డమే అనవసరం- పేదలు కడుపుకింత కూడుదినే పరిస్థితులు కూడా లేవు- కూరగాయల ధరలు నింగినంటాయి- ఇవీ నేటి పరిస్థితులు!’ అన్నారు పురుషోత్తమరెడ్డి. ఆయనతో విభేదించడం కష్టం. ఎందుకంటే ఆయన చెప్పిందంతా పచ్చి నిజం!
ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడి ఉన్న నేపథ్యంలో మన సీఎంగారూ, ఆయనకు సరిజోడునని అనుకుంటున్న పీసీసీ అధ్యక్షుడూ, వారికి సహచరులయిన మంత్రులూ, ఆశించిన పదవులు దొరక్క పరాయి ప్రాంతాలకు పారిపోయిన పెద్దలూ ఏం చేస్తున్నారు? అధిష్టానమ్మకు అడుగడుగు దండాలు అర్పించుకుంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకరిమీద మరొకరు చాడీలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వమనే పదార్థం ప్రబంధాంగనల నడుములాగా -అస్తినాస్తి విచికిత్సా హేతువుగా- పరిణమించింది! కాంగ్రెస్ కురువృద్ధుడు పురుషోత్తమరెడ్డి ఈ పరిణామాలపట్ల తీవ్ర ంగా మండిపడడంలో వింతే ముంది?
అటు ఢిల్లీలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఏర్పడి ఉన్న పరిస్థితుల మధ్య ఓ సామ్యం చూపించారు పురుషోత్తమరెడ్డి . ఢిల్లీలో అధిష్టానమ్మ సోనియా గాంధీ, తోలుబొమ్మ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇద్దరూ చేస్తున్న పనే ఇక్కడ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డీ, బొత్స సత్యనారాయణా కూడా చేస్తున్నారు. ఇంతకీ అక్కడా ఇక్కడా ఈ కాంగ్రెస్ మహాశయులు చేస్తున్న ఘనకార్యమేమిటి? ‘అవినీతిపరులయిన మంత్రులను వెంటబెట్టుకుని కాంగ్రెస్ పరువు బజారుకీడ్చడమే’నని పురుషోత్తమరెడ్డి తేల్చేశారు. ‘రాష్ట్రంలో కరువు కాటకాలు ఇంతకు ముందెప్పుడూ రాలేదా? అప్పటి నాయకులు ఇలాగే చేశారా? మన పాలకులకు బొత్తిగా సంకల్ప శుద్ధి లేదు. పదవి ఉంటుందా ఊడుతుందా అనే యావతప్పితే ప్రజలను గురించి వారికి పట్టదు!’ అని జాడించేశారు పురుషోత్తమరెడ్డి.
కిరణ్ కుమార్ రెడ్డి లక్షణమేమిటో తానెన్నడో కనిపెట్టి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పానని పురుషోత్తమరెడ్డి వెల్లడించారు. ‘అతివినయం ధూర్త లక్షణమ్’ అన్న పెద్దల మాట కిరణ్ విషయంలో నూరుశాతం నిజమయిందన్నారు పురుషోత్తమరెడ్డి. ‘నాడు వైఎస్ అడుగులకు మడుగులొత్తిన కిరణ్ నేడు ఆయన ఫొటోనే మాయం చెయ్యాలనుకుంటున్నాడు. అయితే, మహానేత బొమ్మ జనహృదయాల్లో స్థిరపడిపోయింది. వందమంది కిరణ్ కుమార్‌లూ, వెయ్యిమంది సోనియమ్మలూ కూడబలుక్కున్నా ఆ బొమ్మను ఏం చెయ్యలేరు’ అన్నారు పురుషోత్తమరెడ్డి.
ఇవన్నీ విన్న తర్వాత పురుషోత్తమరెడ్డిగారికి వచ్చిన సందేహం తొలగకపోగా మరింత బలపడుతోంది. అవునూ, కాంగ్రెస్ అధిష్టానమ్మ కిరణ్ కుమార్ రెడ్డిలో ఏంచూసి ఆయనకా పదవి ప్రసాదించింది? అసలు ఆయనకు అంత అదృష్టంపట్టడానికి దారితీసిన కారణాలేమిటి? ఆలోచించగా, చించగా ఈ మధ్య తయారయిన ఓ సినిమా టైటిల్ గుర్తుకొచ్చింది. దాని పేరు ‘సుడిగాడు!’.
ఇంతకుమించిన తర్కమేదీ తోచడం లేదు మరి!
No comments:
Post a Comment