శాసనసభలో బీసీలు తలెత్తుకునేలా చేద్దాం
చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే ముందుకు రండి..
బీసీలపై చంద్రబాబు కారుస్తున్నవి మొసలి కన్నీళ్లే
అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఏం చేశారు బాబూ?
గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ 100 సీట్లు ఇస్తామన్నారు
కానీ ఇచ్చింది 47 టికెట్లే.. అదీ మీ చరిత్ర.. మీ నైజం
అదే ఎన్నికల్లో బీసీలకు వైఎస్‌ఆర్ 67 టికెట్లు ఇచ్చారు
వంద టికెట్లు కాదు.. బీసీలకు 100 సీట్లిద్దాం రండి
బీసీ జనాభాను బట్టి వంద నియోజకవర్గాలను లాటరీతో నిర్ణయిద్దాం.. ఆ సీట్లలో బీసీలను మాత్రమే నిలబెడదాం
మాతోపాటు టీడీపీ కూడా ముందుకొస్తే.. మిగతా పార్టీలూ అదే బాటలో నడిచే అవకాశముంది..
బాబూ! మీరు సబ్సిడీలు ఉండరాదన్నారు.. సేద్యం దండగన్నారు
బీసీలను దగా చేసి.. కులవృత్తులను ధ్వంసం చేశారు
ఎన్టీఆర్ జనతా వస్త్రాల పథకాన్ని మీరు రద్దు చేశారు
పిల్లల చదువుల గురించి ఏనాడైనా ఆలోచించారా?
అనారోగ్యం పాలైనప్పుడు ప్రజలను ఆదుకున్నారా?
ప్రభుత్వాస్పత్రుల్లోనూ యూజర్ చార్జీలు వడ్డించారు
నిరుపేదలకు గూడు కల్పించాలన్న ఆలోచన చేశారా?
‘‘వైఎస్ జగన్ మాటగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. బీసీలకు వంద టికెట్లు ఇవ్వటం కాదు.. అసెంబ్లీలో 100 సీట్లు వారికి కేటాయిద్దాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలను, ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటిలో బీసీల జనాభా 25 వేలకు పైనే ఉంటుంది. రండి.. మన రెండు పార్టీలూ కూర్చుందాం. బీసీల జనాభా ప్రాతిపదికన 100 అసెంబ్లీ స్థానాలను లాటరీ ద్వారా నిర్ణయిద్దాం. ఆ సీట్లలో బీసీ అభ్యర్థులను మాత్రమే నిలబెడదాం. ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అలాంటి నిర్ణయానికి సిద్ధపడితే.. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. మీకు నిజాయతీ ఉందనుకుంటే.. బీసీలకు మేలు చేసే ఉద్దేశమే ఉంటే.. మా ప్రతిపాదనను అంగీకరించండి.’’
హైదరాబాద్, న్యూస్‌లైన్: వెనుకబడిన తరగతుల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశం, చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరఫున వంద టికెట్లు ఇవ్వటం కాదు.. అసెంబ్లీలో వంద సీట్లు ఇవ్వటానికి సిద్ధం కావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సవాల్ విసిరారు. బీసీల విషయమై చంద్రబాబు చెప్తున్న మాటలు నిజమే అయితే తమ ప్రతిపాదనను అంగీకరించాలన్నారు. విజయమ్మ ఈ మేరకు ఆదివారం చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. జరగని పనికి ఢిల్లీ వెళ్లి డ్రామా ఆడే కంటే శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని బాబుకు ఆమె సూచించారు. విజయమ్మ రాసిన లేఖను పార్టీ బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, సీఈసీ సభ్యులు రాజ్‌సింగ్‌ఠాకూర్, బి.శివకుమార్‌లు విలేకరుల సమావేశంలో విడుదల చేశారు.
లేఖ పూర్తిపాఠం...
‘‘చంద్రబాబు గారూ...
గడచిన కొన్ని రోజులుగా మీరు చేస్తున్న ప్రకటనలు చూస్తూంటే ఈ రాష్ట్ర ప్రజలను తేలిగ్గా వంచించవచ్చని, తొమ్మిదేళ్ల పాలనలో మీ నిర్వాకాలన్నీ వారికి ఏ మాత్రం గుర్తులేవని మీరు భావిస్తున్నట్లుగా ఉంది. సబ్సిడీలు ఉండరాదని, వ్యవసాయం దండగని ప్రకటించిన మీరు.. మీ హయాంలో రైతులు, నేతన్నలు, మత్స్యకారులు, గీత కార్మికులు, రజకులు, క్షురకులు, కుమ్మర్లు, కమ్మర్లు.. ఇలా ఏ వృత్తిని ఎంచుకున్న వారికైనా పల్లెల్లో జీవించే అవకాశమే లేకుండా చేసిన మాట వాస్తవం కాదా? అలాంటి మీకు అసలు బీసీల గురించి మాట్లాడే హక్కుందా? అధికారంలో ఉండగా ఏనాడైనా మీరు బీసీల గురించి నిజాయతీగా ఆలోచన చేశారా?
అండగా నిలవాలన్న ఆలోచనా చేయలేదే...
బీసీల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న మీరు.. వారి కోసం ఏం చేశారంటే.. ప్రజలెన్నుకున్న సీఎం ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన జనతా వస్త్రాల స్కీమును, ఆయనకు వెన్నుపోటు పొడిచి రద్దు చేశారు. బీసీలకు పెన్షన్లు ఇవ్వాలని, ఒక పూట అయినా భోజనం దొరికేలా చేయాలని మీ మొత్తం జీవితంలో ఏనాడైనా ఆలోచన చేశారా? నాలుగు జతల దుస్తులు స్కూలు పిల్లలకు ఇవ్వాలని, తద్వారా నేతన్నలకు మంచి చేయాలని మీరు అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడూ మీకు అనిపించలేదే! బీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు పెట్టి వారికి అండగా నిలవాలని కూడా ఏనాడూ ఆలోచన రాలేదే! తమరు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క కాలేజీకైనా వెళ్లి విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో తెలుసుకోవాలని, ఆ చదువుల కోసం పిల్లల తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారో గుర్తించి వాటిని పరిష్కరించాలని ఎప్పుడూ అనిపించలేదు.
మీ చరిత్ర అంతా అబద్ధాలమయమే...
మీ పాలనలో పేదలకు ఏ విషయంలో భరోసా లభించింది కనుక? విద్య, వైద్యం, కూడు, గూడు.. ఇలా ఏది చూసినా అప్పట్లో పేదలందరికీ మిగిలినది నిరాశ మాత్రమే. వైద్యం ఖర్చు భరించలేక పేదలు సర్వం అమ్ముకుని తల తాకట్టు పెట్టి అప్పుల పాలవుతున్నా మీ గుండె కరగలేదు. పేదల వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా నేనున్నానని భరోసా ఇచ్చే మంచి అన్నలా ఉండాలని ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీకు ఏనాడూ అనిపించలేదు. సర్కారీ ఆసుపత్రులకు వచ్చేది నిరుపేద ప్రజలన్న నిజాన్ని కూడా గుర్తించకుండా దారుణంగా యూజర్ చార్జీలు వడ్డించారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలని, అలా ఓ గూడును ఏర్పాటు చేయటంలో కులాలు, మతాలు, పార్టీలు అడ్డు రాకూడదని మీరేనాడూ భావించలేదు. ఆదరణ పథకం అంటూ పాల క్యాన్లు, ఇస్త్రీ పెట్టెలు, జాలరి వలలు వంటివి బీసీలకు ఇచ్చాం అంటూ పనికిరాని సామాను కొద్దిగా పంచి.. కాగితాల మీద అప్పట్లోనే మీరు లెక్క రాసుకున్నది అక్షరాలా రూ. 700 కోట్లు. ఈ సొమ్ములో బీసీలకు కనీసం రూ. కోటి అయినా దక్కిందా? మిగిలినదంతా మీ పార్టీ ఫైనాన్షియర్ల జేబుల్లోకి చేరటం నిజం కాదా? ఏదో తూతూ మంత్రంలా కొద్దో గొప్పో చేస్తే సరిపోతుందిలే అనే భావంతో బీసీల అభివృద్ధి అంటూ మోసం చేశారే తప్ప వారికి మీరు ఏనాడూ మంచి చేయలేదు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నది మీ మూడున్నర దశాబ్దాల చరిత్ర. పదవి కోసం ఎంతటి అబద్ధాన్నయినా కన్నార్పకుండా చెప్పే నైజం మీది. ఇప్పుడు కూడా మీరు చెపుతున్న అబద్ధం బీసీల మీద మీకున్న ప్రేమ.
వంద టికెట్లు కాదు.. వంద సీట్లిద్దాం...
ఈ బహిరంగ లేఖ ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి మాటగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. మీరు కేవలం వంద టికెట్లు ఇస్తామంటున్నారు. దాని వల్ల బీసీలకు ఒరిగేది ఎంతో అందరికీ తెలుసు. మేం చెపుతున్నాం.. వంద టికెట్లు కాదు, అసెంబ్లీలో 100 సీట్లు వారికి కేటాయిద్దామని. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరుగుతున్నప్పుడు కూడా జగన్‌బాబు ఒక ప్రతిపాదన చేశారు. ఉన్నవి నాలుగు ప్రధాన పార్టీలు కాబట్టి అందరం కలిసి కూర్చుని జనరల్ స్థానాల్లో నుంచి 33 శాతాన్ని మనమే లాటరీ ద్వారా ఎంపిక చేసి, అక్కడ అందరం బీసీలనే పోటీ పెట్టాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ మీద కోర్టు కేసులు వాటి దారిన అవి జరుగుతున్నాయి కాబట్టి.. ఈలోగా స్వచ్ఛందంగా మనమే చేద్దామన్నారు. ఆ ప్రతిపాదన మీద మీరు కనీసం స్పందించలేదు. అంతే కాదు... మీరు 2009 ఎన్నికల్లో ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజు ఎన్నికల్లో బీసీలను మోసం చేయాలన్న కుట్ర పూరిత ఆలోచనతోనే కదా మీరు 100 టికెట్లు ఇస్తామన్నారు? తీరా మీరు ఎన్నికల్లో ఇచ్చిన టికెట్లు 47 మాత్రమే. మరి వైఎస్‌ఆర్ గారు ఇచ్చినది అక్షరాలా 67. ఇదీ మీ మాటకున్న విలువ! ఇదీ మీ బీసీ ప్రేమ! ఇదీ మీ నైజం!
ఇదిగో జగన్‌బాబు ప్రతిపాదన...
ఇప్పుడు కూడా నేను జగన్‌బాబు చేసిన మరో ప్రతిపాదనను మీ ముందుకు తీసుకు వస్తున్నాను. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలను మైనారిటీ ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను మినహాయిస్తే.. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లన్నింటిలో బీసీల జనాభా 25 వేల పైనే ఉంటుంది. రండి.. మన రెండు పార్టీలూ కూర్చుందాం. బీసీల జనాభా ప్రాతిపదికన ఏ 100 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు తప్ప వేరెవరికీ టికెట్లు ఇవ్వరాదో లాటరీ ద్వారా నిర్ణయిద్దాం. ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అలాంటి నిర్ణయానికి సిద్ధపడితే.. కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది.
ప్రేమను చేతల్లో చూపే పార్టీ మాది...
బీసీల మీద మాటలు మాత్రమే కాదు.. చేతల్లో కూడా ప్రేమ చూపే పార్టీ మాది. కాబట్టే ఈ ప్రతిపాదన మరోసారి చేస్తున్నాం. మీకు నిజాయతీ ఉందనుకుంటే.. బీసీలకు మేలు చేసే ఉద్దేశమే ఉంటే మా ప్రతిపాదనను అంగీకరించండి. ఊరికే ఢిల్లీ వెళ్లి జరగని పనికి మీరు డ్రామా ఆడేకంటే, శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం రండి. మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు.. అన్ని పార్టీల తరఫునా కనీసం వంద మంది బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తలెత్తుకు నిలబడేలా ఉండాలి.’’
-వై.ఎస్.విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు
No comments:
Post a Comment