YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 20 August 2012

ఆరోగ్యశ్రీ భవన్‌కు వైఎస్సార్ పేరు తొలగింపు.గుమ్మంలో ఉన్న నిలువెత్తు వైఎస్ ఫొటో కూడా

గుమ్మంలో ఉన్న నిలువెత్తు వైఎస్ ఫొటో కూడా తీసేశారు
చిరునామాలో కూడా ఆయన పేరు కనపడకూడదని ఆదేశాలు
ఓపీ, డయాగ్నస్టిక్ స్లిప్‌లలోనూ ఆయన బొమ్మను దూరం చేసిన సర్కారు
బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా తీసేశారని ఉద్యోగుల ఆవేదన

హైదరాబాద్, న్యూస్‌లైన్: కోట్లాదిమంది గుండెల్లో కొలువైన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను తొలగించడం, ఆయన పేరును తలచుకోకుండా చేయడమే సర్కారు లక్ష్యమని మరోసారి స్పష్టమైంది. పేద ప్రజల ఆరోగ్యం కోసం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆయన పేరును, ఫొటోను దూరం చేసి సర్కారు తన వైఖరిని వెల్లడించింది. కోట్లాదిమందికి పునర్జన్మనివ్వడమేకాకుండా ఇతర రాష్ట్రాలకూ, ఇతర దేశాలకూ రోల్‌మోడల్‌గా నిలిచిన ఈ పథకాన్ని ఓవైపు నిర్వీర్యం చేస్తూనే, మరోవైపు రూపకర్త పేరును, బొమ్మను కూడా ఆరోగ్యశ్రీ పథకం నుంచి చెరిపివేసింది. ఇందులో భాగంగా తాజాగా జూబ్లీహిల్స్‌లోని వైఎస్సార్ భవన్ (ఆరోగ్యశ్రీ భవన్) నుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాదు భవన్‌లోకి వెళ్లగానే దర్శనమిచ్చే నిలువెత్తు వైఎస్సార్ బొమ్మను కూడా అక్కడ్నుంచి తొలగించారు. ఆ స్థానంలో రేపోమాపో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 

2009 సెప్టెంబర్ 2న రాజశేఖరరెడ్డి మరణించిన మరుసటి రోజే ట్రస్ట్‌భవన్ ఉద్యోగులు సంతాప సభ ఏర్పాటు చేశారు. దీంతోపాటే ఈ భవన్‌కు వైఎస్సార్ భవన్‌గా పేరు పెట్టాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.సత్యనారాయణ ఈ తీర్మానాన్ని ఓకే చేశారు. అప్పటినుంచి ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, వైఎస్సార్ భవన్‌గా చలామణీ అవుతోంది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లోగానీ, కార్డ్‌లలోగానీ ఓవైపు సీఎం ఫొటో, మరోవైపు వైఎస్ ఫొటో ఉండేది. ఇప్పుడు కేవలం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో మాత్రమే పెట్టారు. అంతేకాదు డయాగ్నస్టిక్స్ స్లిప్‌లు, ఓపీ స్లిప్‌లు, కేస్ షీట్ స్లిప్పుల్లోనూ వైఎస్ ఫొటో తీసేశారు.

చిరునామాలోనూ వైఎస్ పేరు రాయవద్దు: ఇకపై ఆరోగ్యశ్రీ భవన్‌కు వచ్చే ఉత్తరాల్లోగానీ, ఇక్కడ నుంచి పంపే లెటర్‌లలోగానీ, లెటర్ హెడ్‌లలోగానీ, చిరునామాలో గానీ ఎక్కడా వైఎస్సార్ భవన్ అనే పేరు కనిపించకూడదని ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, వైఎస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎదురుగా, జూబ్లీహిల్స్ అనే చిరునామా ఉండేది. ఇప్పుడు వైఎస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రెండు పేర్లనూ తొలగించారు. ఆ స్థానంలో ఆ భవనానికి ఉన్న డోర్ నంబర్ వాడుతున్నారు. వైఎస్ పేరు, ఆయన ఫొటోను తీసేసేందుకు 3 నెలలుగా యత్నిస్తున్నారని, ఎలాంటి బోర్డుమీటింగ్ లేకుండా ఉన్నఫళంగా సర్క్యు లర్ పంపించారని అక్కడున్న కొందరు ఉద్యోగులు వాపోయారు. రాజీవ్ మరణించినా ఆయన పేరుమీద ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతోందని, మరి రాజశేఖరరెడ్డికి ఈ విధా నం ఎందుకు వర్తించదని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై ఆరోగ్యశ్రీ సీఈవో శ్రీకాంత్‌ను సంప్రదించేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!