హైదరాబాద్, న్యూస్‌లైన్: వెనుకబడిన వర్గాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర శాసనసభలో బీసీలకు వంద స్థానాలు ఇవ్వాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రతిపాదనను స్వాగతించాలని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావులు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోకుండా వారి కులవృత్తులను ధ్వంసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబని మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ మాయమాటలతో బీసీలను మోసం చేశారని గోవర్ధన్ ధ్వజమెత్తారు. 2007లో వరంగల్‌లో టీడీపీ బీసీ గర్జన సభలో 100 సీట్లిస్తానని చెప్పి మోసం చేశారని గుర్తుచేశారు. అందుకే చంద్రబాబుకు బీసీలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు చేసే నాటకాల్ని ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితిలేదని చెప్పారు. బీసీలకు దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే లబ్ధి చేకూరిందన్నారు. అందుకే వైఎస్‌కు బీసీలు ఆత్మబంధువులుగా ఉన్నారని, ఆయన మరణించి మూడేళ్లు అవుతున్నా మరిచిపోలేకపోతున్నారని తెలిపారు. బీసీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే ప్రతినిధి అని గోవర్ధన్ చెప్పారు.
చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది: గట్టు
బలహీన వర్గాలకు చెందిన 100 మందిని ఎమ్మెల్యేలను చేయాలని విజయమ్మ చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు మిన్నకుండిపోవడంతో ఆయన నిజస్వరూపం బయటపడిందని గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. విజయమ్మ చేసిన ప్రతిపాదనకు బీసీ సంఘాలు, టీడీపీలోని పేద బీసీ నేతలు హర్షిస్తుంటే చంద్రబాబు మాత్రం తేలు కుట్టిన దొంగ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయమ్మ లేఖతో చంద్రబాబుకు దిమ్మ తిరిగిందన్నారు. ఎన్టీఆర్ హయాంలో సహకార రంగంలో సభ్యత్వ రుసుము రూ.11 ఉంటే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని రూ.300లకు పెంచారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్‌లను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో బీసీలిచ్చిన తీర్పుతో చంద్రబాబు దిమ్మతిరిగి డిక్లరేషన్ అంటూ దొంగ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. విజయమ్మ చేసిన ప్రతిపాదనపై బీసీ కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 24న బీసీ నేతలతో సమావేశం కానున్నట్లు గట్టు వెల్లడించారు. చంద్రబాబు మాటలు నమ్మి శాలువాలు కప్పిన బీసీ నేతలు వైఎస్‌ఆర్ సీపీ చేసిన ప్రతిపాదనకు ఆయన్ని ఒప్పించాలని గట్టు సూచించారు.
No comments:
Post a Comment