YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 19 August 2012

కరెంటు కోతలతో రాష్ట్రం అతలాకుతలం

పరిశ్రమల్లో లైట్లు వేసుకునేందుకూ కరెంటివ్వలేమన్న విద్యుత్ సంస్థలు.. మంగళవారం వరకు నో పవర్
4 రోజుల్లో 14 లక్షల పరిశ్రమలకు రూ.600 కోట్ల నష్టం
- వ్యవసాయానికి కరెంటు రెండు, మూడు గంటలే
- 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 7 గంటల విద్యుత్ మిథ్యే
- విద్యుత్ సరఫరా మెరుగునకు కనీస ప్రయుత్నాలు కరువు
- కేంద్రం నుంచి అదనపు విద్యుత్ పొందేందుకు చర్యల్లేవు 
- ఆర్-ఎల్‌ఎన్‌జీ కొనుగోలు చేస్తున్నట్టు గత నెలలో సీఎంవో ప్రకటన.. ఇప్పటికీ అతీగతీ లేదు..
- రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్
హైదరాబాద్, న్యూస్‌లైన్:హైదరాబాద్, న్యూస్‌లైన్: పరిశ్రమను చూస్తే.. పరిశ్రమల్లో కనీసం లైట్లు వేసుకునేందుకు కూడా కరెంటివ్వలేని దుస్థితి. ఇప్పటికే వారానికి నాలుగు రోజుల చొప్పున విద్యుత్ కోతలతో మూసివేత దశకు చేరుకున్న పరిశ్రమలపై మరో పిడుగు పడింది. శనివారం నుంచి అన్ని పరిశ్రమలకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిపేశారు. మంగళవారం వరకు పరిశ్రమలకు ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఇవ్వలేమని విద్యుత్ సంస్థలు చేతులెత్తేశాయి. కొత్తగా ఏ మేరకు కోతలు విధించాలనే విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటిస్తామని చెబుతున్నాయి. అంటే ఈ నాలుగు రోజులు పరిశ్రమలకు కరెంటు పూర్తిగా ఉండదన్నమాట! దీని ప్రభావంతో రాష్ట్రంలోని 14 లక్షల పరిశ్రమలు మూతపడనున్నాయి. ఇవన్నీ రోజుకు రూ.150 కోట్ల చొప్పున నాలుగు రోజుకు సుమారు 600 కోట్లు నష్టపోనున్నట్లు అంచనా!!

పొలానికి వెళ్తే... రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లలో 20 లక్షల కనెక్షన్లకు ఏడు గంటల ఉచిత విద్యుత్ మిథ్యగానే మిగిలిపోయింది! రోజుకు 2, 3 గంటలకు మించి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కావడం లేదు. ఒకవైపు వర్షాల్లేక, మరోవైపు కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. 

ఆరుగాలం కష్టపడ్డా కళ్లముందే పంట ఎండిపోతుంటే రైతన్న గుండె మండుతోంది!!
పల్లెను పలకరిస్తే.. గ్రామాలకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాత్రిళ్లూ విచ్చలవిడిగా కోతలు అమలవుతున్నాయి. ఉక్కపోతతో పల్లెలు అల్లాడుతున్నాయి. పొద్దంతా కష్టపడి రాత్రి సమయంలో పడుకుందామంటే కరెంటు లేక జాగారం చేయాల్సి వస్తోంది. అనేక గ్రామాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. కరెంటు లేకపోవడంతో కొళాయిల్లో నీరు రావడం లేదు. జనం దాహంతో అలమటిస్తున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో చీకటి రాజ్యమేలుతోంది! రాత్రనక, పగలనక ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంతటి క్లిష్ట పరిస్థితులల్లోనూ బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలుకు కానీ, కేంద్రం నుంచి అదనపు విద్యుత్ పొందేందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడం లేదు. గ్యాసు సరఫరా తగ్గిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) కొంటామని ప్రకటించిన ప్రభుత్వం... ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయకుండా మిన్నకుండిపోయింది!

సీఎంవో ప్రకటన ఉత్తిదేనా..?
రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు గ్యాసు సరఫరా తక్కువ కావడంతో కేవలం 28 శాతం ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాసుకు ప్రత్యామ్నాయంగా రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్‌ఎన్‌జీ) ఉపయోగించి అదనపు విద్యుత్ పొందే అవకాశం ఉంది. తద్వారా 1000 మెగావాట్ల వరకూ (24 మిలియన్ యూనిట్లు) అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. అయితే యూనిట్ విద్యుత్ ధర ఏకంగా 9 రూపాయలకుపైగానే ఉంటుంది.

రైతులు ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ధర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న సంగతిని ప్రభుత్వం గుర్తించడం లేదు. వాస్తవానికి రోజుకు 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎండీ) ఆర్-ఎల్‌ఎన్‌జీ ఇచ్చేందుకు గెయిల్ సంస్థ ముందుకొచ్చింది. గెయిల్ నుంచి ఆర్-ఎల్‌ఎన్‌జీ తీసుకుంటున్నట్టు సీఎం కార్యాలయం కూడా గత నెలలో ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రయత్నం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అంటే ప్రభుత్వం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని అర్థమవుతోంది. సీఎంవో ఉత్తుత్తి ప్రకటన జారీచేసిందని తెలుస్తోంది. ఆర్-ఎల్‌ఎన్‌జీని దీర్ఘకాలానికి కాకపోయినా... ప్రస్తుతం పంటలు ఎండిపోతున్న నేపథ్యంలోనైనా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏడు గంటల కరెంటు ఎక్కడ..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వ్యవసాయ ఫీడర్లు 9,363 ఉన్నాయి. ఇందులో 3,416 ఫీడర్లకు విద్యుత్ సరఫరా ఏడు గంటల కంటే తక్కువగా ఉందని విద్యుత్ సంస్థలే అధికారికంగా ప్రకటిస్తున్నాయి. అంటే 36 శాతానికి పైగా ఫీడర్లకు ఏడు గంటల కరెంటు అందడం లేదన్నది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవసాయ పంపుసెట్ల సంఖ్య 30 లక్షలు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో 11 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఏడు గంటల విద్యుత్ అందడం లేదన్న విషయం తెలుస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు ఇంతకన్నా దారుణంగా ఉన్నాయి. మొత్తమ్మీద సుమారు 20 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఏడు గంటల ఉచిత విద్యుత్ అందడం లేదని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 

అదేకాకుండా మరో 1633 ఫీడర్లకు ఏడు గంటల విద్యుత్‌ను మూడు, నాలుగు విడతలుగా సరఫరా చేస్తున్నామని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. వాస్తవానికి 3, 4 విడతలుగా కరెంటు పోరు రావడంతో మొదట తడిపిన మడినే మళ్లీ మళ్లీ తడపాల్సి వస్తోంది. దీంతో పంట చివరి మడికి నీరు అందడం లేదు. ఫలితంగా నీరందని పంటచేనంతా కళ్లముందే ఎండిపోతోంది. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని రైతన్నలు వాపోతున్నారు. రోజుకు 2, 3 గంటలు మాత్రమే త్రీ ఫేజు (ఫుల్ కరెంటు) కరెంటు ఉంటోందని చెబుతున్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే... కనీసం మోటారుతోనైనా నడిపిద్దామనుకుంటే కరెంటు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహనం కోల్పోయిన రైతన్నలు ఎక్కడికక్కడా సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న అరకొర చేతిపంపులు సరిగ్గా పనిచేయడం లేదు. దీనికితోడు కరెంటు లేక కుళాయిల్లో నీరు రావడం లేదు. దీంతో గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.

పరిశ్రమల్లో చిమ్మచీకట్లు..
ప్రస్తుతం పరిశ్రమలకు వారంలో మూడు రోజులు విద్యుత్ కోతలు అవులవుతున్నాయి. వీక్లీ ఆఫ్‌తో కలుపుకుంటే నాలుగు రోజుల కోతలున్నాయి. ఇప్పుడు ఈ కోతలు కూడా అదుపు తప్పాయి. కోతలున్నా పరిశ్రమల్లో లైట్లు వేసుకునేందుకు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. తాజాగా లైట్లకూ కరెంటు కట్ చేశారు. అంతేకాదు.. బుధవారం వరకు పరిశ్రమలకు కరెంటును సరఫరా చేయలేమని ట్రాన్స్‌కో అధికారులు తేల్చిచెప్పారు. బుధవారం తర్వాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోతలను ప్రకటిస్తామని అంటున్నారు. అంటే అప్పటివరకు పరిశ్రమలు పూర్తిగా మూసేసుకోవాల్సిందేనన్నమాట! 

వామ్మో... డిమాండ్!
రాష్ర్టంలో విద్యుత్ డిమాండ్ చుక్కలనంటుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలోనూ డిమాండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. శనివారం (ఈ నెల 18న) రాష్ట్రంలో 271 మిలియన్ యూనిట్ల (ఎంయూ) డిమాండ్ నమోదైంది. సరఫరా మాత్రం 206 ఎంయూ మాత్రమే ఉంది. అంటే లోటు 65 ఎంయూలు. వర్షాకాలంలో ఇంతస్థాయిలో విద్యుత్ లోటు ఏర్పడటం ఇదే తొలిసారి. గతేడాది ఇదే రోజున 241 ఎంయూల డిమాండ్ ఉండగా.. 238 ఎంయూల మేరకు విద్యుత్‌ను సరఫరా చేశారు. అంటే అప్పుడు లోటు కేవలం 3 ఎంయూలు మాత్రమే ఉంది! 

సాగుకు కరెంటు సరఫరా పరిస్థితి ఇదీ
- నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్‌లోని తిరుపురం సబ్‌స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎన్‌పురం వ్యవసాయ ఫీడరుకు శనివారం కేవలం గంటా 50 నిమిషాలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యింది.
- నల్గొండ జిల్లాలోని దామరచర్ల సబ్‌స్టేషన్ నుంచి నర్సాపురం వ్యవసాయ ఫీడరుకు కేవలం 2 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారు.
- కాకినాడ డివిజన్ పరిధిలోని చేబ్రోలు, ఇంజారం, లింగంపర్తి ఫీడర్లకు కేవలం నాలుగు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేశారు.
- తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ రంగాపురం, పులగుర్త, తుంగపాడు తదితర ఫీడర్లకు కేవలం మూడు గంటల 50 నిమిషాలు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. రాష్ట్రమంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!