YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 20 October 2012

ఉదయించే సూర్యుడిని ఆపలేరు

జగనన్నను బయటికి రాకుండా ఆపలేరు
ఆరోజు త్వరలోనే వస్తుంది 
కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘ఒక రోజు వస్తుంది. ఎలాగైతే ఎగిసే కెరటాన్ని, ఉదయించే సూర్యుడిని ఆపలేరో.. అలాగే జగనన్ననూ ఆపలేరు. ఆరోజు ఆ దేవుడే జగనన్నను బయటకు తెస్తాడు. ఆ రోజు ఈ కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదు. ఆ రోజు మన రాజన్న రాజ్యం దిశగా నడుస్తాం. రాజన్న ప్రతి ఆశయాన్ని జగనన్న నెరవేరుస్తాడు. అలాంటి రోజు కోసం ఎదురు చూద్దాం. ఆరోజున మీరంతా ఆ పార్టీలకు బుద్ధిచెప్పాలి..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకూ నిరసనగా చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో మూడో రోజు శనివారం షర్మిల పులివెందుల బహిరంగ సభలో మాట్లాడారు. 

‘మీ రాజన్న గురించి, మీ జగనన్న గురించి నేను మీకు చెప్పాల్సిన పనిలేదు. మంచి మనసు, మాట మీద నిలబడే నైజం వారిద్దరిది. జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. నేను రాజన్న పాదాన్ని. జగనన్న విడిచిన బాణాన్ని. కాంగ్రెస్, టీడీపీలు జగనన్నను మన మధ్యకు రానివ్వలేని పరిస్థితి సృష్టించడంతో మీకు ధైర్యం చెప్పమని అన్న నన్ను పంపించాడు. 30 ఏళ్లు కాంగ్రెస్‌కు విశ్వాసంతో సేవ చేస్తే, ప్రతి పథకానికి వాళ్ల పేర్లే పెడితే వారిచ్చిన బహుమతి ఎఫ్‌ఐఆర్‌లో నాన్న పేరు చేర్చడం. నాన్న చనిపోయినప్పుడు 600 మంది గుండె ఆగితే వారిని ఓదార్చాలన్న కనీస బాధ్యత ఆ పార్టీకి గుర్తుకు రాలేదు. ఓదారుస్తానని ఇచ్చిన మాట కోసం కట్టుబడిన జగనన్నను కక్ష గట్టి జైల్లో పెట్టారు. కాంగ్రెస్‌లోనే ఉంటే సీఎం కూడా అయ్యేవారని ఆజాద్ చెబుతున్నారు. అంటే ఇది కక్ష కాక మరేంటి?’ అని ప్రశ్నించారు.

ప్రతి పథకానికి తూట్లు..

‘‘రాజన్న రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతును విస్మరించింది. విద్యార్థులకు మొండిచేయి చూపింది. ఆరోగ్యశ్రీని కట్టిపడేసింది. రాజన్న తెచ్చిన ప్రతి పథకానికి తూట్లు పొడిచింది. మూడేళ్లలో మూడు సార్లు విద్యుత్తు చార్జీలు పెంచింది. గడిచిన సంవత్సరాలకు చెందినవాటిపై సర్‌చార్జీల పేరుతో వేల కోట్ల భారం మోపింది. ఇది అన్యాయం కదా అని నిలదీయాల్సిన టీడీపీ చోద్యం చూస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి నిద్రపోతున్నారనుకుంటే చంద్రబాబు కూడా నిద్రపోతున్నారు. వ్యవసాయం దండగ అంటారు. ప్రాజెక్టులు కడితే రాష్ట్రానికి నష్టం అంటారు. ఉచిత విద్యుత్తు వద్దంటారు. ఆనాడు రైతులు కరువుతో విలవిల్లాడుతూ వలస పోతుంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రజల మైండ్ సెట్ మారాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కంపెనీగా మార్చి తానే సీఈవోనని అన్నారు. ప్రజల అవసరాలు అర్థం చేసుకుని వాటిని తీర్చే నాయకుడు కావాలా? లేక పాలనను వ్యాపార దృష్టితో ఆలోచించే నాయకుడు కావాలా? తన మైండ్‌సెట్ మార్చుకుని ప్రజల గురించే ఆలోచించే నాయకుడు కావాలా? ప్రజల మైండ్‌సెట్ మారాలనే హిట్లర్‌లాంటి నాయకుడు కావాలా? ఆలోచించండి’’ అని షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు.

ఊరంతా ఫ్లెక్సీలు..ట్రాక్టర్ల నిండా పూలు

పాదయాత్ర మూడో రోజు శనివారం షర్మిల మొత్తం 15 కిలోమీటర్ల మేర నడిచారు. ఉదయం 9.45కు వేములలో ప్రారంభమైన యాత్ర రోజంతా చినుకులు పడుతున్నా భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులతో వడివడిగా ముందుకు సాగింది. పులివెందుల సభలో వర్షం కురిసినా జనం కట్టుకదల్లేదు. యాత్రలో వేముల, భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లి, కోట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి షర్మిలకు స్వాగతం పలికారు. వేల్పుల గ్రామమైతే జాతరను తలపించింది. ఓ వైపు ఈటెల కవాతు, కళాకారుల ప్రదర్శనలు, 500 మంది మహిళల మంగళహారతులతో వేల్పుల గ్రామం ఘనస్వాగతం పలికింది. ఆ ఊళ్లో 1,500 మంది ఓటర్లు ఉంటే 1,300 మంది దాకా స్వాగత ఫ్లెక్సీలు కట్టారు. 4 కిలోమీటర్ల మేర రెండు ట్రాక్టర్లతో పూలవర్షం కురిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం కోసం వేల్పుల సమీపంలోని బీసీ కాలనీ వద్ద షర్మిల విశ్రాంతి తీసుకున్నారు. 4 గంటలకు మళ్లీ యాత్ర ప్రారంభమవగా షర్మిల సమీప కాలనీకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత పంట చేలల్లో రైతులతో మాట్లాడారు. మార్గం మధ్యలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం ఆమెను కలిసి.. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని కోరింది. బెస్తవారిపల్లిలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 6.15కు పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్న రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. భారీ సంఖ్యలో జనం వెంటరాగా రాత్రి 7.20కి పులివెందుల చేరుకున్న షర్మిల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో షర్మిల, విజయమ్మ ప్రసంగించి రాత్రి 8.45కు మూడో రోజు బస ప్రాంతమైన రాజీవ్‌నగర్ కాలనీకి చేరుకున్నారు.

పాదయాత్రలో విజయమ్మ, భారతి

మూడో రోజు పాదయాత్రలో షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ, జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి పాల్గొన్నారు. వేముల నుంచి పులివెందుల వరకు పాదయాత్ర చేశారు. బెస్తవారిపల్లి నుంచి పులివెందుల బహిరంగ సభ వరకు నాలుగు కిలోమీటర్ల వరకు షర్మిల కుమార్తె కూడా పాదయాత్రలో నడిచారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!