YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 22 June 2012

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించిన 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం మధ్యాహ్నం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పార్టీ శాసనసభా పక్షం నాయకురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలందరూ ఒక ప్రత్యేక బస్సులో 12.10 గంటలకు అసెంబ్లీ ఆవరణలోకి చేరుకున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన చాంబర్‌లో 12.25 గంటలకు ఒక్కొక్కరితో ప్రమాణం చేయించారు. తొలుత గడికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి) ప్రమాణం చేయగా చివర్లో మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు) పదవీ స్వీకారం చేశారు. 

ఆకేపాటి అమరనాథరెడ్డి (రాజంపేట), గొల్ల బాబూరావు (పాయకరావుపేట), చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు), టి.బాలరాజు (పోలవరం), బి.గురునాథరెడ్డి (అనంతపురం), భూమన కరుణాకర్‌రెడ్డి (తిరుపతి), ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ), బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), కె.శ్రీనివాసులు (కోడూరు) విడివిడిగా ప్రమాణం చేశారు. అనంతరం స్పీకర్ వారికి శాసనసభ నిబంధనల పుస్తకాలను అందజేశారు. అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించారు. సుమారు అరగంటసేపు జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, నాయకులు హాజరయ్యారు. 


కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, విజయనగరం జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ హెచ్.ఏ.రెహ్మాన్‌తో సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.

అసలైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం

రైతుల పక్షాన నిలబడ్డ ఎమ్మెల్యేలను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వైఎస్ విజయమ్మ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాము అసలైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటామని ప్రకటించారు. జగన్ నిర్దోషి అని ప్రజాకోర్టులో తీర్పునిచ్చారనీ, త్వరలో ఆయన బయటకు వస్తారనీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు 11 గంటలకు ఎమ్మెల్యేలు విజయమ్మ నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అక్కడినుంచి 11.30 గంటలకు అసెంబ్లీకి బస్సులో బయలుదేరారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారంతా పరకాలనుంచి పోటీ చేసి ఓటమి పాలైన పార్టీ నాయకురాలు కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. అక్కడ సుమారు గంటసేపు గడిపిన ఎమ్మెల్యేలు సురేఖకు నైతిక మద్దతు ప్రకటించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!