YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 22 June 2012

'జగన్ రెండేళ్ల పోరాట ఫలితమిది'

వైఎస్ పథకాలకు నేటి పాలకులు తూట్లు పొడుస్తున్నారు
జగన్‌ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు
సమస్యలపై పోరాడకనే టీడీపీ ప్రజల నమ్మకం పోగొట్టుకుంది
ప్రధాన ప్రతిపక్షం ఎలా ఉండాలో వైఎస్సార్‌సీపీ చూపిస్తుంది
జగన్‌పై సాగుతున్న కుట్రలపై ఢిల్లీ స్థాయిలో పోరాడతాం


హైదరాబాద్, న్యూస్‌లైన్:‘‘రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పోరాట ఫలితంగానే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటి నీ ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. వారి పాలనలో ఏ వర్గానికీ మేలు జరగడం లేదు. మళ్లీ వైఎస్ నాటి సువర్ణయుగం రావాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్ పథకాలను జగన్ బాబే ముందుకు తీసుకెళ్లగలరనే నమ్మకం వారికి కలిగింది. అందుకే ఒకసారి జగన్ బాబును సీఎం చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. వారి ముఖాల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తే, 2014లో జగన్ సీఎం అవుతారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ స్థానాలనూ వైఎస్సార్ కాంగ్రెసే దక్కించుకునేది. కానీ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కవడం వల్లే మూడు స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అవెంతగా కలిసి పోయాయంటే.. కొన్నిచోట్ల ఒకరికొకరు ఓట్లు మళ్లించుకొని డిపాజిట్లు కూడా కోల్పోయారు’’అని విజయమ్మ గుర్తు చేశారు.

వైఎస్ వంటి నేతలేరీ..?: వైఎస్ సంక్షేమ పథకాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారని విజయమ్మ దుయ్యబట్టారు. వైఎస్ సీఎంగా మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ ఫైలు మీదే చేశారని గుర్తు చేశారు. ‘‘అంతేకాదు, అంతకుముందు రైతుల బకాయిలను వైఎస్ రద్దు చేశారు. ఆయన హయాంలో ఎన్నడూ ఎరువుల ధరలు పెరగలేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరీ బీటీ పత్తి విత్తనాల ధరను రూ.1,800 నుంచి రూ.750కి తగ్గించగలిగారు. పైగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల రుణాలను కూడా రద్దు చేయించారు. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారు నిరుత్సాహ పడకుండా ఉండేందుకు ఆయనే ధైర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేలు ఇప్పించారు. ఇప్పుడు రైతులకు అలాంటి భరోసా ఇచ్చే నేతలే కరువయ్యారు. కరెంటే సరిగా రాదు. విత్తనాలు, ఎరువులు సక్రమంగా సరఫరా చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎరువుల ధరలు రెట్టింపైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పాలకుల మద్దతు లేకనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులు పంట విరామం ప్రకటించారు. వారెంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది. 2004కు ముందు భారీగా చోటుచేసుకున్న రైతుల ఆత్మహత్యలు మళ్లీ ప్రస్తుతం పునరావృతం అవుతున్నాయి’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయారని విమర్శించారు. 

ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరించి ఎంతసేపూ వైఎస్‌ను తిట్టడం, జగన్‌ను దూషించడానికే సమయం వెచ్చిస్తోందని మండిపడ్డారు. ‘‘సమస్యలపై పోరాటాలు చేయకపోవడం వల్లే టీడీపీపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. 30 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ఆ పార్టీకి ఉప ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటూ దక్కలేదు’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల విషయమై ప్రభుత్వంపై ఎలా పోరాడాలో జగన్ నాయకత్వంలో చేసి తమ పార్టీ ఆచరణలో చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీ స్థాయిలో పోరాడుతాం

జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలియజేస్తామని విజయమ్మ ప్రకటించారు. ‘‘నల్లకాల్వ దగ్గర ప్రజలకిచ్చిన మాటకు జగన్ కట్టుబడినప్పటి నుంచీ ఆయనపై కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ను వీడాక అవి రెట్టింపయ్యాయి. సాక్షి మీద దాడులు, ఎన్నికల సందర్భంగా జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం వంటివన్నీ అందులో భాగమే. వీటిపై ప్రధానికి రెండుసార్లు లేఖలు రాసినప్పటికీ కుట్రలు ఆగడం లేదు. అందుకే త్వరలో మా పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష నేతలందరినీ కలిసి వివరిస్తాం. మరోసారి ప్రధానిని కలిసి వివరించాలనుకుంటున్నాం’’ అని వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!