YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 21 June 2012

భాను, దంతులూరి కృష్ణతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు

- పాలమూరు జిల్లాలో 25 ఎకరాలు హాంఫట్
- భూ యజమానురాలిని బెదిరించి రిజిస్ట్రేషన్
- టీడీపీ ఎమ్మెల్యే పాత్రపై సీఐడీ ఆరా
- తాజాగా కేసు నమోదుచేసిన సీఐడీ అధికారులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో తెలుగుదేశం పార్టీ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. భాను, దంతులూరి కృష్ణతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు చేసిన వ్యవహారం వెలుగుచూసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన రేవంత్‌రెడ్డికి భాను ముఠాతో సంబంధాలు ఉన్నాయని గడచిన కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ఇప్పుడు సీఐడీ నిర్ధారించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ భూ దందాలో భాను, కృష్ణలకు రేవంత్‌రెడ్డి సహకరించినట్లు తేల్చింది.

మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం చెల్లంపల్లి గ్రామం, తకరాజుగూడ శివారులో 25 ఎకరాల వ్యవసాయ భూమిని.. విదేశాలలో ఉంటున్న యాజమానురాలికి తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో సొంతం చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పాత్రకూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో సీఐడీ అధికారులు కేసు (క్రైం నంబర్. 45/2012) నమోదుచేశారు. రేవంత్‌తో పాటు భానుకిరణ్, దంతులూరి కృష్ణ, పోరెడ్డి ప్రభాకరరెడ్డి, న్యాయవాది ఈడిగ శ్రీకాంత్ గౌడ్, మరికొంతమంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

కేసు వివరాలివీ..
పాలమూరు జిల్లా తలకొండపల్లి మండలం చెల్లంపల్లి గ్రామానికి చెందిన టి.సునీత వర్జీనియాలో నివాసముంటున్నారు. చెల్లంపల్లిలోని 29/ఏ, 30/ఏ, 36/ఏ సర్వే నంబర్‌లలో ఆమెకు 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి యజమానురాలు విదేశాల్లో ఉంటున్న విషయాన్ని పసిగట్టి ఆ భూమిని స్వాహా చేసేందుకు పథక రచన చేశారు. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్ పుస్తకాలను సృష్టించారు. వేరొక మహిళను సునీతగా చూపించి.. 2006 డిసెంబర్‌లో దంతులూరి కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు భూ యజమానురాలు సునీతకు సమాచారం అందడంతో ఆమె హుటాహుటిన వర్జీనియా నుంచి చెల్లంపల్లికి వచ్చారు. 

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో తెలుగుదేశం యువ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రంగప్రవేశం చేశారు. భానుకిరణ్, మంగలి కృష్ణకు వత్తాసు పలికారు. ఆమెను నయానా భయానా బెదిరించి.. కొంత డబ్బు ఇప్పించి పరిష్కారం చేయడంతో 2007 ఏప్రిల్‌లో భానుకిరణ్, దంతులూరి కృష్ణ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 

మంచిరేవుల భూ దందా గతంలోనే వెలుగులోకి
భానుకిరణ్ గ్యాంగ్‌తో కలసి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలలో భూ దందాలకు పాల్పడిన వ్యవహారం గతంలోనే వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం యువ ఎమ్మెల్యేతోపాటు ప్రభుత్వంలో అత్యంత సీనియర్ మంత్రిగా పేరున్న ఒక నేత కుమారుడు కూడా భానుకిరణ్ భూ దందాలకు స్నేహ హస్తం అందించినట్లు సీఐడీ విచారణలో వెలుగుచూసింది. అధికార, ప్రతిపక్ష నేతలతో కలసి చేసిన భూ దందాల వివరాలను సీఐడీ కస్టడీ సమయంలో భానుకిరణ్ పూసగుచ్చినట్లు వెల్లడించాడు.

రంగారెడ్డి జిల్లా గండిపేట సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో రూ.50 కోట్ల విలువచేసే 26.36 ఎకరాల భూమి సెటిల్‌మెంట్‌లో రేవంత్‌రెడ్డితో పాటు సీనియర్ మంత్రి కుమారుడు కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ విచారణలో వివరించాడు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భానుచేసిన భూ దందాలలోనూ వారిద్దరి పాత్ర ఉన్నట్లు తేలింది. రాజధాని శివార్లలో భూ దందాలు, సెటిల్‌మెంట్‌లకు భానుకిరణ్‌ను వారు ఉపయోగించుకున్నట్లు కూడా బయటపడింది. దీంతో భానుకిరణ్‌తో రాజకీయ నేతల సంబంధాలపై సీఐడీ పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!