YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 21 June 2012

సానుభూతి మీకు రాలేదే బాబూ...!

వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకురాలిగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఎన్నికయ్యారు. గురువారం ఉదయం వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విజయమ్మ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నుంచీ రాష్ట్రంలో ఒక పటిష్టమైన ప్రతిపక్ష పాత్రను నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది. అధికారపక్షం ప్రజా సమస్యలను గాలికొదిలేస్తే నిలదీయాల్సిన ప్రతిపక్షం కూడా ప్రభుత్వంతో కుమ్మక్కు అయిందనీ అందువల్ల ప్రజాపక్షంగా పోరాడాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్‌పైనే ఉందని నిర్ణయించారు. శాసనసభాపక్షం ఉప నాయకులను, కార్యవర్గాన్ని నియమించే అధికారాన్ని విజయమ్మకు ఇస్తూ ఒక తీర్మానం చేశారు. 

సమావేశానంతరం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి సహచరులందరితో కలిసి మీడియా ప్రతినిధులకు వివరాలు వెల్లడించారు. రైతులు, రైతు కూలీల పక్షాన నిలబడి తమను ఆదరించి భారీ ఆధిక్యతలతో గెలిపించి శాసనసభకు పంపినందుకు రాష్ట్ర ప్రజలకు ఒక ప్రత్యేక తీర్మానంలో కృతజ్ఞతలు తెలిపామని ఆమె అన్నారు. నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు నిచ్చినా తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పట్ల కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న సీబీఐ వైఖరిని ప్రతిఘటిస్తామని ఆమె వెల్లడించారు. జగన్‌కు ప్రాణహాని ఉందని ఆయన సతీమణి ఇప్పటికే కోర్టులో కేసు వేశారనీ ఇలాంటి నేపథ్యంలో నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతించాలని సీబీఐ అడగడంలో ఆంతర్యం ఏమిటి? ఇదంతా తమ నాయకునికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమేనని ఆమె అన్నారు. 

రాష్ట్రంలో తొలకరి ప్రారంభమై రైతులంతా విత్తనాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని శాసనసభా పక్షం విమర్శించినట్లు శోభ చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సమయం లేని ముఖ్యమంత్రి, మంత్రులు జగన్‌ను ఇబ్బందులు పెట్టేందుకు మాత్రం ముందున్నారని ఆమె అన్నారు. 2010 సంవత్సరంలో రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పటి వరకూ చెల్లించలేదనీ ఆమె అన్నారు. వరి ధాన్యానికి పెరిగిన మద్దతు ధర ఏ మాత్రం సరిపోదనీ పెరిగిన ఎరువుల ధరలు, కూలీకి అనుగుణంగా ఇంకా పెంచాలనీ ఆమె డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజెల్ ధరల పెరుగుదలకే కేవలం కేంద్రాన్ని నిందించకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను తగ్గించాలని కూడా ఆమె కోరారు. అలాగే వస్త్రాలపై ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని అన్నారు. 

రాష్ట్రంలో ప్రతిపక్షం నిర్వీర్యం అయి పోయింది కనుక ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిందిగా తమను ప్రజలు గెలిపించారని ఆమె అన్నారు. జగన్ కేసులపై సీబీఐ పూర్తి పక్షపాత బుద్దితో దర్యాప్తు చేస్తోందని ఆమె అన్నారు. కొన్ని పత్రికల నిర్దేశకత్వంలో విచారణ జరుగుతున్నట్లుగా ఉందనీ అన్నారు. లక్ష్మీపేట, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉదంతాల్లో మృతి చెందిన వారికీ, 104లో నిరుద్యోగులుగా ఆత్మహత్య చేసుకున్న వారికీ, షిర్డీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికీ సమావేశం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపిందని శోభ వివరించారు. 

సానుభూతి మీకు రాలేదే బాబూ...!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి వల్లనే గెలిచిందని చంద్రబాబునాయుడు చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు. 2004 ఎన్నికలకు ముందు అలిపిరి వద్ద నక్సల్స్ దాడిని తప్పించుకున్న తరువాత చిరిగిపోయిన బట్టలతో పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ఓట్లడిగినా బాబుకు ఎందుకు సానుభూతి రాలేదని శోభ సూటిగా ప్రశ్నించారు. ప్రజల సానుభూతి చూరగొనాలంటే వారికి మనపై ప్రేమ ఉండాలని అన్నారు. జగన్‌పై ప్రేమ ఉంది కనుకనే ప్రజాదరణ లభించిందన్నారు. బాబుపై ప్రజలకు ఏ మాత్రం ప్రేమ లేదు కనుకనే 2004 ఎన్నికల్లో ఆయనపై సానుభూతి రాలేదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షురాలు అందరికీ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. 

సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు డి.కృష్ణదాస్, టి.బాలరాజు, జి.బాబూరావు, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ఏ.అమరనాథరెడ్డి, కె.శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాస రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె. చెన్నకేశవరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు చదిపిరాళ్ల నారాయణరెడ్డి, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే ఎం.ప్రసాదరాజు హాజరయ్యారు. నెల్లూరు ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన సోదరుడు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వారికి ఇటీవలనే మాతృ వియోగం కలిగినందున రాలేక పోయారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!