YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 22 June 2012

ఎమ్మెల్యేల ప్రమాణం సందర్భంగా పోలీసుల అతి

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో పోలీసులు అతిగా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రమాణం చేసేటపుడు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను మాత్రం ఆవరణలోనూ, లాబీల్లోనూ విచ్చలవిడిగా తిరగనిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వంతు వచ్చేటప్పటికి పోలీసులు ఒక్కసారిగా ఆంక్షలు విధించారు. కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా పాసులు తీసుకున్న వారిని సైతం అడుగడుగునా నిరోధిస్తూ వేధించారు. విలేకరులు, మీడియా ప్రతినిధులను కూడా వారు వదల్లేదు. అనంతపురానికి చెందిన నారాయణరెడ్డి అనే పార్టీ సీనియర్ నాయకుడు పాసు చూపించినా అసెంబ్లీ లోపలికి వదలకు పోవడంతో ఆయన నిరసన వ్యక్తం చేయడంతో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆయనను పోలీసు రక్షక్ వాహనంలో ఎక్కించి ఆ తరువాత అందరూ అభ్యంతరం తెలపడంతో కిందకు దించేశారు. పాసుల జారీలో కూడా వివక్ష కనిపించింది. 

ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఐదు నుంచి ఆరు సందర్శకుల పాసులు జారీ చేయాలని తొలుత నిర్ణయించారు. ఆ ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జారీ చేశారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే విషయానికి వచ్చేటప్పటికి ఆ నిబంధన గాలికెగిరిపోయింది. ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయి నుంచి ఒత్తిడులు రావడంతో పొలోమని మంత్రులు తోట నరసింహం, పినిపె విశ్వరూప్ వెంట కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అసెంబ్లీ లాబీల్లోకి అనుమతించారు. పోలీసులు విలేకరులపై అడుగడుగునా దురుసుగా వ్యవహరించారు. సీఎల్పీ కార్యాలయం ఎదుట సైఫాబాద్ డీసీపీ తరుణ్ జోషి సీనియర్ జర్నలిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అంతే కాదు. హడావుడి అంతా సద్దుమణిగాక ప్రమాణ స్వీకారం వివరాలు తెలుసుకునేందుకు ఎప్పటి లాగే స్పీకర్ వద్దకు వెళుతున్న విలేకరులను కూడా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసుల చేతిలో తమకు ఎదురైన అనుభవాన్ని స్పీకర్ మనోహర్‌కు విలేకరులు ఫిర్యాదు చేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!