YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 23 June 2012

ఆగని సీబీఐ వేధింపులు .జిల్లాల్లో ‘సాక్షి’ బ్యాంకు ఖాతాల స్తంభన

* అధికారికంగా సమాచారమివ్వని సీబీఐ, బ్యాంకు అధికారులు
* సాక్షిని ఆర్థికంగా దెబ్బతీసి.. ఉద్యోగులను రోడ్డున పడవేయడమే సీబీఐ లక్ష్యం
* హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహారశైలి
* ఏ చర్యా సాక్షి మూతపడే విధంగా ఉండకూడదన్న హైకోర్టు.. అయినా ఆ దిశగానే పావులు కదుపుతున్న దర్యాప్తు సంస్థ
* హైకోర్టును ఆశ్రయించనున్న సాక్షి యాజమాన్యం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తగదని చెప్పినా కూడా సాక్షి దినపత్రికపై సీబీఐ అధికారులు తమ వేధింపులను కొనసాగిస్తూనే ఉన్నారు. సాక్షిని ఆర్థికంగా దెబ్బతీసి, దాని ఉద్యోగులను రోడ్డునపడవేసే దిశగా ముందుకెళుతున్నారు. సాక్షి రోజువారీ వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని హైకోర్టు స్పష్టం చేసినా, సీబీఐ అధికారులు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు. స్తంభింప చేసిన ఖాతాల నిర్వహణకు హైకోర్టు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా, సీబీఐ అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా సీబీఐ అధికారులు తిరిగి సాక్షి దినపత్రిక ఖాతాలను స్తంభింపజేశారు. 

గతంలో సాక్షి ప్రధాన కార్యాలయానికి చెందిన ఖాతాలను స్తంభింప చేసిన సీబీఐ అధికారులు, ఇప్పుడు సాక్షికి సంబంధించి అన్ని జిల్లాల కార్యాలయాలకు చెందిన ఖాతాలను నిలుపుదల చేయించారు. అన్ని జిల్లాల్లోని సాక్షి ఖాతాలను స్తంభింప చేయాలంటూ సీబీఐ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ నిర్ణయం తీసుకుంది. ఖాతాల స్తంభన విషయంలో సాక్షి న్యాయపోరాటంతో ఖంగుతిన్న సీబీఐ అధికారులు, ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఖాతాల స్తంభనకు సంబంధించి సాక్షి యాజమాన్యానికి శనివారం రాత్రి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సీబీఐ అధికారుల ఆదేశంతో బ్యాంకు అధికారులు కూడా ఇప్పటి వరకు ఖాతాల స్తంభనపై సాక్షి యాజమాన్యానికి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

సంస్థ నడిచేదెట్లా... గతంలోనే అడిగిన హైకోర్టు
జగతి పబ్లికేషన్స్, జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఇందిరా టెలివిజన్‌లకు హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ)ల్లో ఉన్న కరెంట్ ఖాతాలను గత నెలలో సీబీఐ అధికారులు స్తంభింప చేశారు. దీంతో ఈ మూడు కంపెనీల ప్రతినిధులు సీబీఐపై హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. వాదనల సమయంలోనే హైకోర్టు సీబీఐకి పలుమార్లు చీవాట్లు పెట్టింది. ఖాతాలను స్తంభింప చేస్తే సంస్థ పని చేసేదెట్లా..? అందులోని ఉద్యోగుల మాటేమిటి..? అంటూ సీబీఐని న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ సూటిగా ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, మూడు కంపెనీల ఖాతాలను నిర్వహించుకునేందుకు కొన్ని షరతులతో అనుమతిని మంజూరు చేసింది. 

జీతాలు ఇవ్వాలి కదా...
అంతేకాక సాక్షి పత్రిక, టీవీ, జనని ఇన్‌ఫ్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు అందకుండా ఉండే పరిస్థితులు తలెత్తకూడదని న్యాయమూర్తి గతంలోనే తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యోగులు కేవలం జీతంతోనే బతుకు వెళ్లదీయగలరని, వారిపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని తెలిపారు. బ్యాంకు ఖాతాల స్తంభన వల్ల వారు వీధులపాలయ్యే అవకాశాలు ఉన్నాయని, అందుకు ఈ కోర్టు అంగీకరించదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సాక్షిని నమ్ముకున్న ఉద్యోగులను, ఉద్యోగులపై ఆధారపడి ఉన్న వారి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అందుకు సంస్థ కార్యకలాపాలు ఏదో రకంగా నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు. చర్య ఏదైనా సాక్షి దినపత్రిక, టీవీ మూతపడే విధంగా ఉండకూడదని జస్టిస్ చంద్రకుమార్ సీబీఐకి తేల్చి చెప్పారు. 

అంతేకాక సాక్షికి వచ్చే మొత్తం ఆదాయం నెలవారీ ఖర్చుల నిమిత్తం సరిపోవచ్చునని కూడా న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఇంత స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసినా సీబీఐ మాత్రం ఆ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు తమకు ఏ మాత్రం వర్తించవనే విధంగా వ్యవహరిస్తూ.. నెలాఖరు సమీపిస్తున్న దశలో... మరో ఐదారు రోజుల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉన్న తరుణంలో సీబీఐ ఖాతాలను నిలుపుదల చేయడం గమనార్హం. సీబీఐ చర్యలపై సాక్షి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించనున్నది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!