YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 23 June 2012

అంతా పథకం ప్రకారమే ,జగన్ కేసులో సీబీఐ తీరు ఆక్షేపణీయం

 హైకోర్టు సీనియర్ న్యాయవాది రామచంద్రరావు
* ములాయం, మాయావతి, జయలలితపైనాఆదాయానికి మించిన ఆస్తుల కేసులు
* కానీ అవన్నీ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి
* జగన్ కేసులోనే సీబీఐ దృష్టినంతా కేంద్రీకరించింది 
* విచారణకు జస్టిస్ కక్రూ ఆదేశించడంపైనే న్యాయవర్గాల్లో అనుమానాలు
* ఆ తర్వాత ఆయనను హెచ్‌ఆర్సీ చైర్మన్ చేశారు
* సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై రాజకీయ ఒత్తిళ్లు
* ఆయన ఫోన్ సంభాషణలు, మీడియాకు లీకులూ సందేహాస్పదమే
* కోర్టులను ప్రభావితం చేసేలా మీడియా సమాంతర దర్యాప్తు
* బొత్స అవినీతిపరుడు.. కిరణ్ అసమర్థుడు
* అవినీతిని అడ్డుకోకపోగా, ప్రోత్సహిస్తున్నాడు
* కేంద్రం కల్పించుకుని రాష్ట్రపతి పాలన విధించాలి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు దర్యాప్తు తీరుతెన్నులను హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీరామగిరి రామచంద్రరావు తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘యూపీ మాజీ ముఖ్యమంత్రులు ములాయంసింగ్ యాదవ్, మాయావతి, తమిళనాడు సీఎం జయలలిత వంటి ఎందరో రాజకీయ నాయకులపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులున్నా, అవన్నీ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఒక్క జగన్ కేసులో మాత్రమే సీబీఐ రోజువారీ పద్ధతిలో దృష్టినంతా కేంద్రీకరించి దర్యాప్తు చేస్తోంది. పైగా దర్యాప్తులో ఆద్యంతం వింతగా వ్యవహరిస్తోంది. అందులో పలు అవలక్షణాలు, తమాషాలు కొట్టొచ్చినట్టుగా కన్పిస్తున్నాయి. నేరాన్ని ఒప్పుకుంటున్నాననే రీతిలో సమాధానాలు చెప్పాలన్న సీబీఐ తీరు రాజ్యాంగ విరుద్ధం’’ అంటూ విమర్శించారు. 

జగన్‌ను శిక్షించాలన్న తాపత్రయమే దర్యాప్తులో అడుగడుగునా కన్పిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిపై మాత్రమే పెట్టాల్సిన కేసును జగన్‌పై పెట్టారని, కాబట్టి అసలీ కేసే చెల్లనిదని తేల్చిచెప్పారు. అసలు జగన్ కేసుపై అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ సీబీఐ విచారణకు ఆదేశించిన తీరుపైనే న్యాయ వర్గాలకు ఎన్నో అనుమానాలున్నాయని ఆయన తెలిపారు. విచారణ జరుపుతున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణపై రాజకీయ ఒత్తిళ్లున్నాయని అభిప్రాయపడ్డారు. 

‘‘సీబీఐ దర్యాప్తు, కోర్టులో వాదిస్తున్న తీరు తదితరాలను పరిశీలిస్తే అంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది. దర్యాప్తు పూర్తవకుండానే చార్జిషీట్లు దాఖలు చేయడం, అదీ ఒకే ఎఫ్‌ఐఆర్‌పై పలు చార్జిషీట్లు వేయడం జగన్ కేసులో మాత్రమే జరుగుతున్నాయి. దర్యాప్తు అధికారి ఫోన్ సంభాషణల తీరుతెన్నులు, విచారణ వివరాలను ఎంపిక చేసిన కొన్ని పత్రికలకే ఆయన లీక్ చేయడం వంటివన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. పైగా ఒక వర్గం మీడియా కూడా కోర్టు విచారణకు సమాంతరంగా విచారణ జరుపుతూ న్యాయస్థానాలను ప్రభావితం చేయజూస్తోంది’’ అని శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. 

బినామీ పేర్లతో వందలాది మద్యం దుకాణాలు నడుపుతున్న బొత్సకు మంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదని ఆయనన్నారు. సీఎం కిరణ్ కూడా అవినీతిని అడ్డుకోకపోగా, ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో అవినీతి హద్దు మీరిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. అందుకే కేంద్రం కల్పించుకుని రాష్ట్రపతి పాలన విధించాలని తన క్లయింట్ గిరి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

‘‘జగన్ కేసులో సీబీఐ దర్యాప్తు తీరు వింత పోకడలు పోతోంది. పుకార్లు, అనుమానాలు ఉండొచ్చు. కానీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి దర్యాప్తు ప్రారంభమైన తర్వాత చట్టం ముందు అందరూ సమానమే...చట్టం అందరికీ సమానమే అన్నట్లుగా దర్యాప్తు కొనసాగాలి. దర్యాప్తు న్యాయపరంగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడమేకాక జరిగినట్లు కూడా కనిపించాలి. ఆధారాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగాలి. ఇతర కేసులు, నిందితుల తరహాలోనే ఆయన్ను విచారించాలి. నేరం రుజువైతే శిక్ష విధించవచ్చు. కానీ సీబీఐ దర్యాప్తులో అనేక అవలక్షణాలు, తమాషాలు కనిపిస్తున్నాయి. సాక్ష్యాల ఆధారంగా కోర్టు విచారణ సాగాలి. కానీ కోర్టులను ప్రభావితం చేసేలా మీడియా ట్రయల్ నడుస్తోంది. ఆయన నేరస్తుడంటూ మీడియా ప్రచారం చేస్తూ కోర్టు ట్రయల్‌కు సమాంతరంగా మీడియా ట్రయల్ చేస్తోంది. కోర్టులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

జస్టిస్ కక్రూ ఆదేశాలపైనే అనుమానాలు
హైకోర్టు ఆదేశాలతోనే సీబీఐ దర్యాప్తు ప్రారంభించిందని అందరూ అంటున్నా..హైకోర్టు ఆదేశాలపైనే న్యాయవర్గాలకు అనుమానాలున్నాయి. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే ముందు హైకోర్టు విచారణ సక్రమంగా జరగలేదనే అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ కొన్ని వందల కేసులను కొట్టేసినా, కేవలం రెండు కేసుల్లో మాత్రమే తీర్పులు ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ దర్యాప్తు అందులో ఒకటి. రెండోది స్థానిక సంస్థల ఎన్నికల కేసు. జగన్‌పై వచ్చిన ఫిర్యాదుపై కక్రూ ఎందుకు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారనే దానిపై అనేక అనుమానాలున్నాయి. జగన్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాక జస్టిస్ కక్రూకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవిచ్చారనే విమర్శలూ ఉన్నాయి.

నిప్పులాంటి మనిషనుకున్నాం
సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నిప్పులాంటి మనిషి అనుకున్నాం. అవినీతిపరుడు కాదని ఇప్పటికీ నమ్ముతున్నాం. కానీ ఆయన మీద రాజకీయ ఒత్తిడి, లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి పని చేసి ఉండవచ్చు. దర్యాప్తులో భాగంగా విలేకరులు ఫోన్లు చేయవచ్చు. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళతో లక్ష్మీనారాయణ మాట్లాడటం, తర్వాత ఆమె మళ్లీ ఓ పత్రికాధిపతితో పాటు అనేక మందితో మాట్లాడటమే అనేక అనుమానాలకు తావిస్తోంది. సేవా కార్యక్రమాల కవరేజీ కోసమే మీడియా అధిపతితో మాట్లాడానన్న చంద్రబాల మాటలు నమ్మశక్యంగా లేవు. కొన్ని వందల కాల్స్ మాట్లాడడం, మాట్లాడిన సమయాన్ని పరిశీలిస్తే ఆరోపణలు నిజమేనన్నట్టుగా ఉంది. లక్ష్మీనారాయణ ఇచ్చిన సమాచారాన్ని చంద్రబాల ఇతరులకు ఇచ్చినట్టు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. 

అలాగే జగన్ కేసు దర్యాప్తు, కోర్టులో సీబీఐ వాదనల తీరు.. వీటన్నింటినీ పరిశీలిస్తే ఈ కేసు దర్యాప్తు ఒక పథకం ప్రకారమే కొనసాగుతోందన్న అనుమానం కలుగుతోంది. దర్యాప్తు తీరుపై దోషభూయిష్టంగా ఉందనే అనుమానాలకు తావిచ్చేలా ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు 2011 ఆగస్టులో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు 9 నెలల తర్వాత, అదీ ఉప ఎన్నికలు సమీపించిన తరుణంలో జగన్‌ను అరెస్టు చేయడం, దర్యాప్తు పూర్తవకుండానే చార్జిషీట్లు దాఖలు చేయడం, ఒకే ఎఫ్‌ఐఆర్‌పై అనేక చార్జిషీట్లు దాఖలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఏ కేసులోనూ ఇలా జరగదు. జగన్ కేసులో అసాధారణంగా ఎందుకిలా జరుగుతోందన్నదే అనుమానాస్పదం. జేడీపై రాజకీయ ఒత్తిడి పని చేస్తోందా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు ఆయన పని చేస్తున్నారా అన్నది సందేహాస్పదంగా ఉంది.

అలాంటి కేసులన్నీ పెండింగ్‌లోనే..
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, ములాయంసింగ్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలపై కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు పెట్టారు. కానీ అవన్నీ కొన్నేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ ఒక్క జగన్‌పై నమోదు చేసిన కేసులోనే సీబీఐ దర్యాప్తు రోజువారీ పద్ధతుల్లో కొనసాగుతోంది. నిజానికి ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసును ప్రభుత్వ పదవులు అనుభవించిన వారిపై మాత్రమే పెట్టాలి. కాబట్టి అసలు జగన్‌పై పెట్టిన కేసే చెల్లనిది. నేరం జరిగిందని చెప్పిన సమయంలో జగన్ ఏ ప్రభుత్వ పదవిలోనూ లేరు. 

జగన్‌పై కేసు పెట్టే ముందు లోక్‌సభ స్పీకర్ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఇలాంటివేవీ సీబీఐ పట్టించుకోలేదు. దర్యాప్తుకు జగన్ సహకరించలేదని, తామడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదని కారణాలు చూపుతూ ఆయనకు సీబీఐ కస్టడీని పొడిగించాలని గతంలో అడిగింది. కానీ నేరం ఒప్పుకోవాలనే విధంగా సమాధానాలు చెప్పాలన్న సీబీఐ తీరు రాజ్యాంగ విరుద్ధం. పౌరులకు రాజ్యాంగం కల్పించిన 23వ అధికరణానికి ఇది విరుద్ధం. నిందితుడు తనకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే చెబుతాడు. అలాగాక తమను సంతృప్తిపర్చేలా సమాధానాలు చెప్పాలనడం చట్టబద్ధం కాదు.

జగన్‌ను ఎలాగైనా శిక్షించాలన్నదే లక్ష్యం
పోలీసులు, సీబీఐ ఎంత దిగజారినా జగన్ భౌతిక భద్రతకు భంగం కల్గిస్తారని అనుకోను. పైగా జగన్‌ను సాధారణ వ్యాన్‌లో తీసుకురావడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి, సరైన భద్రత కల్పించాలని ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలోనైనా వారు జాగ్రత్త పడతారని, భవిష్యత్తులో ఆ దిశగా తగిన చర్యలు తీసుకుంటారనే ఆశిస్తున్నాం. అయితే జగన్‌పై ఎలాగైనా నేరం నిరూపించి ఆయనను శిక్షించాలన్న తాపత్రయం బాగా కనిపిస్తోంది. శిక్షించాలనే పట్టుదలతో చేస్తున్న రాజకీయ ఒత్తిడికి సీబీఐ దోహదం చేస్తోంది. చెల్లని కేసులు పెట్టడం, అందులోనూ కొందరినే అరెస్టు చేయడం, దర్యాప్తు అధికారి ఫోన్ సంభాషణలు, దర్యాప్తు సమాచారాన్ని ఎంపిక చేసిన కొన్ని పత్రికలకే లీక్ చేయడం.. ఇలా సీబీఐ దర్యాప్తులో ప్రతి అంశమూ అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు ఒక పథకం ప్రకారమే సాగుతోందన్న అనుమానం కలుగుతోంది.

బొత్సకు పదవిలో కొనసాగే అర్హత లేదు
వందలాది మద్యం దుకాణాలను బినామీల పేర్లతో నిర్వహిస్తున్న పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణకు ఒక్క క్షణం కూడా మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టేప్పుడు చేసిన ప్రమాణానికి విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వందలాది మద్యం దుకాణాలను బొత్స నిర్వహిస్తున్నారు. తనకు 30 మద్యం దుకాణాలున్నాయని ఆయనే స్వయంగా అంగీకరించారు. వచ్చే ఏడాది వ్యాపారం చేయనని చెబుతున్నారు. కానీ తన దగ్గర పనిచేసే గుమాస్తాల పేరుతో బొత్స దుకాణాలు పొందారు. నెల జీతాలు తీసుకునే గుమాస్తాలు కోటి, రెండు కోట్లు చెల్లించి దుకాణాలు పొందారు! 

ఒక్క విజయనగరం జిల్లాలోనే 230 దుకాణాల్లో 130 దుకాణాలు బినామీల పేర్లతో ఉన్నాయి. సిండికేట్ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారు. మద్యం సిండికేట్లు, బినామీలపై ఏసీబీ దర్యాప్తును బొత్స అడ్డుకున్నారు. నిష్పాక్షికంగా దర్యాప్తు చేసిన ఏసీబీ జాయింట్ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయాలంటూ సోనియాగాంధీ, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జికి బొత్స లేఖ రాశారు. ఆయన్ను బదిలీ చేసేలా సీఎంపై ఒత్తిడి తెచ్చారు. 

ఇటీవలి దాకా ఆర్టీసీ చైర్మన్‌గా పని చేసిన ప్రసాదరావును ఏసీబీ చీఫ్‌గా వేశారు. మంత్రిగా బొత్స నిర్వహిస్తున్న రవాణా శాఖ పరిధిలోనే ఆర్టీసీ పని చేస్తుంది. అలాంటి సంస్థ నుంచి ప్రసాదరావును ఏసీబీకి బదిలీ చేయడం అనుమానాస్పదంగా ఉంది. ప్రసాదరావు మంచి అధికారే కావచ్చు. కానీ ఆయనను ఏసీబీ చీఫ్‌గా వేయడమే అభ్యంతరకరం. బొత్స అవినీతిపై దర్యాప్తు జరగాలి. ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాం.

ముఖ్యమంత్రి కిరణ్ అసమర్థుడు..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతిపరుడు కాకపోవచ్చు. కానీ అవినీతిపై చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహిస్తున్నారు. అవినీతి నిరోధక విభాగానికి అధిపతి అయిన ఆయన సక్రమంగా స్పందించడం లేదు. మద్యం మాఫియా కారణంగా ప్రభుత్వం రూ.15 వేల కోట్లు నష్టపోయిందని ఏసీబీ పీపీ కోర్టుకు నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,000 మద్యం దుకాణాల్లో ఏకంగా 3,000 బినామీ పేర్లతో ఉన్నాయని కూడా ఏసీబీ తేల్చింది. మద్యం వ్యాపారుల నుంచి అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ రూ.10 లక్షలు తీసుకున్నారని కూడా ఓ నిందితుని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. మద్యం మాఫియా వెనుక 15 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, వందలాది మంది ప్రభుత్వాధికారులు ఉన్నారని తేలింది. అయినా సీఎం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. 

రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా మంత్రివర్గం వ్యవహరిస్తున్నా ఆయన నిశ్చేష్టుడిగా ఉన్నారు. అవినీతికి పాల్పడుతున్న వారిని వదిలి, దానిపై దర్యాప్తు చేసి, అవినీతికి బాధ్యులైన వారిని బయట పెట్టేందుకు ప్రయత్నించిన ఏసీబీ ఉన్నతాధికారులు భూపతిబాబు, శ్రీనివాసరెడ్డిలను సాగనంపారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి హద్దు మీరినప్పుడు, శాంతిభద్రతలు క్షీణించినప్పుడు 355వ అధికరణం ప్రకారం కేంద్రం జోక్యం చేసుకొని సరిదిద్దాలి. పరిస్థితులు సర్దుకునేదాకా రాష్ట్రపతి పాలన పెట్టాలి. కానీ ఇవేవీ జరగలేదు. అందుకే హైకోర్టులో పిల్ దాఖలు చేశాం. అవి జూలై 2న విచారణకు రానున్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!