YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 9 June 2012

టీడీపీ గుర్తింపును రద్దు చేయండి

‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయనపై తెలుగుదేశం పార్టీ అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. మూడు దశాబ్దాల పై చిలుకు చరిత్ర ఉన్న టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్‌ల పరువుప్రతిష్టలను మంటగలపడమే పనిగా పెట్టుకుంది. ఆ క్రమంలో అత్యంత దుర్మార్గపూరితమైన ఆరోపణలు చేస్తోంది. అవాస్తవ ప్రచారానికి పూనుకుంటోంది. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన తెలుగుదేశం పార్టీ గుర్తింపును తక్షణమే రద్దు చేయండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు శనివారం ఆయనకు ఒక లేఖ రాశారు. టీడీపీ అభూత కల్పనలనే.. ఏదో తీవ్ర శ్రమకోర్చి చేసిన పరిశోధన ఫలితాలు అనే రీతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించడం ద్వారా తమవంతు సహకారం అందజేస్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఆరోపించారు. ‘‘శాసనమండలిలో టీడీపీ పక్ష నేత దాడి వీరభద్రరావు పేరిట ఫక్తు అవాస్తవ, అతిశయోక్తులమయమైన ఆరోపణలను శనివారం నాటి సంచికలో ‘ఈనాడు’ ప్రచురించింది. జగన్ ఇమేజీని మసకబార్చేందుకు చేస్తున్న నిరంతర ప్రచారంలో భాగంగా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అలా చేసింది. ఆ వార్తకు ‘ఘోరీ+గజనీ=జగన్’ అంటూ హెడ్డింగ్ పెట్టి అక్కసు వెళ్లగక్కింది. కాకినాడ సీ పోర్టు, మ్యాట్రిక్స్ గ్రూపు, రస్ అల్ ఖైమా తదితర ప్రముఖ కంపెనీలకు కేటాయించిన ప్రాజెక్టులను కూడా జగన్ బినామీలుగా అందులో చిత్రీకరించింది.

నాసిరకం ఇనుప ఖనిజమున్న ఖమ్మం జిల్లా బయ్యారం గనుల విలువను ఏకంగా రూ.14 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. వాటిని జగన్ బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన, ఎకనామిక్స్‌లో పీజీ చేసిన, ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు పొందిన చంద్రబాబుకు అసలు రూ.14 లక్షల కోట్ల విలువెంతో తెలియదా? బయ్యారం గనుల్లోని నాసిరకపు ముడి ఇనుము విలువే రూ.14 లక్షల కోట్లంటున్న టీడీపీ, అదే నిజమైతే తన తొమ్మిదేళ్ల పాలనలో రెవెన్యూ లోటును అధిగమించేందుకు ఏకంగా రూ.50 వేల కోట్ల మేరకు అప్పులెందుకు చేసింది? ఉప ఎన్నికల వేళ జగన్ ఇమేజీని దెబ్బ తీసి, తద్వారా తాము లబ్ధి పొందాలన్నదే ఈ ఆరోపణల మౌలికోద్దేశమని స్పష్టం కావడం లేదా? మాకున్న ఏకైక ఆశ ఎన్నికల సంఘమే. కాంగ్రెస్, టీడీపీ మాపై రోజువారీ పద్ధతిన దాడులు చేస్తూ వేటాడుతున్నాయి. మీరే గనుక సకాలంలో జోక్యం చేసుకోకపోతే , జగన్ అరెస్టు తదనంతర పరిణామాల్లో అరెస్టయిన మా పార్టీ నేతల్లో అత్యధికులు ఇంకా జైళ్లలోనే మగ్గుతూ ఉండేవారు! ఇలా రాజకీయ పార్టీలే కొన్ని పత్రికల సాయంతో ఇంత బాహాటంగా అవాస్తవ సమాచారంతో కూడిన తప్పుడు ప్రచారానికి పాల్పడితే రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడం అసాధ్యం’’ అని సోమయాజులు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!