YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 9 June 2012

‘కోలా’ డబ్బులు కొట్టేసి సింగపూర్‌లోని చీకటి ఖాతాకు మళ్లింపు!

* పార్టీ టికెట్టు ఇస్తానంటూ చంద్రబాబు మోసం
* గుట్టు విప్పిన ‘యూరో లాటరీ’ కోలా కృష్ణమోహన్ 
* ‘మాజీ సీఎం’ హవాలా గురించి గతంలో హసన్ అలీ కూడా వెల్లడి 
* రూ. 200 కోట్లు హవాలా రూట్‌లో తెచ్చినట్లు ఈడీకి తెలిపిన అలీ 
* బాబు చీకటి ఖాతాలు తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే

హైదరాబాద్, న్యూస్‌లైన్: అపర హజారేలా నీతులు పలికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనకు పార్టీ టికెట్ ఇస్తానంటూ రూ. 5.10 కోట్లు దండుకున్నారని, బాబు ఆ డబ్బును సింగపూర్‌లోని తన ఖాతాకు మళ్లింపజేసుకున్నారని కోలా కృష్ణమోహన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కొంతకాలం గా తెరమరుగైన కోలా వెంకట కృష్ణమోహన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసి మళ్లీ వార్తల్లోకెక్కారు. సింగపూర్‌లోని చంద్రబాబు చీకటి ఖాతాను బయట పెట్టారు. కోలా కృష్ణమోహన్ స్వయంగా తన ఖాతా నంబరు, చంద్రబాబు సింగపూర్ బ్యాంకు ఖాతా నంబర్లతో సహా వివరాలను మీడియా ముందుంచారు. పార్టీ టికెట్టు ఇస్తానని వంచించి డబ్బులు నొక్కేసి తరువాత తనను చంపేందుకు యత్నించారని ఆరోపించారు. ఈ ఖాతాల మతలబును తేల్చాలంటే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన అవసరం కనిపిస్తోంది. 

కోలా కృష్ణమోహన్ హవా నడిచిన రోజుల్లో నాటి అధికార తెలుగుదేశం పార్టీకి 2,50,000 డాలర్లు విరాళంగా ఇచ్చారని అప్పట్లో బీబీసీ న్యూస్ కూడా పేర్కొంది. మరోవైపు నల్లధన కుబేరుడు హసన్‌అలీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులు విచారించినప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి నల్లడబ్బును విదేశాల నుంచి ఎన్నికల అవసరాల కోసం హవాలా మార్గాల్లో తిరిగి తెచ్చానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించి చేసినవేనని అప్పట్లో దుమారం రేగింది. ఇప్పుడు తాజాగా కోలా కృష్ణమోహన్ సింగపూర్‌లోని చంద్రబాబు బ్యాంకు ఖాతా వివరాలను బయటపెట్టటంతో బాబు హవాలా పద్ధతుల్లో విదేశాలకు డబ్బు మళ్లించి అక్కడ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది. 

అసలేం జరిగింది...
కృష్ణమోహన్ చేసిన ఆరోపణల్లో ప్రధానంగా పార్టీ టికెట్టు కోసం రూ. 5.10 కోట్లు చంద్రబాబు తీసుకున్నారన్నది ఒకటి. దీని వెనక పూర్వాపరాలను కృష్ణమోహనే స్వయంగా మీడియా ముందుంచారు. వాటి ప్రకారం.. తనకు 20 మిలియన్ డాలర్ల విలువైన యూరో లాటరీ దక్కిందని చెప్పుకొన్న కృష్ణమోహన్ అప్పుడు సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. ఆయన మొదటిసారి 1998 డిసెంబరులో చంద్రబాబునాయుడును తిరుపతిలో కలిశారు. దాంతో హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా తనను కలవాలని కృష్ణమోహన్‌ను బాబు ఆహ్వానించారు. 1999 మే నెల 19న అప్పటి పార్టీ అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. కోలాను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కోలా ఆ తర్వాత హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి ఐదారుసార్లు వచ్చి కలిశారు. 

ఈ నేపథ్యంలో పార్టీలో చేరాలని చంద్రబాబు ఆయనకు సూచించారు. పార్టీ కోసం కోటి పది లక్షల రూపాయలు ఇవ్వమని చంద్రబాబు అడిగారు. దీంతో కోలా రూ. 10 లక్షల చెక్ (విజయవాడలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఖాతా చెక్)తో పాటు.. 1999 ఏప్రిల్ 24న చంద్రబాబు ఇంట్లో స్వయంగా కోటి రూపాయల నగదు ఇచ్చారు. తరువాత చంద్రబాబు మచిలీపట్నం ఎంపీ టికెట్‌ను ఆఫర్‌చేస్తూ అందుకోసం రూ. 4 కోట్లు ఇవ్వాలని కోలాను అడిగారు. ఆ నాలుగు కోట్లను సింగపూర్‌లోని తన అకౌంట్‌కు బదిలీ చేయాలని కోరారు. దీంతో కోలా విజయవాడలోని ఇప్పా చలపతి రావు అనే వ్యక్తికి రూ. 4 కోట్ల నగదు ఇచ్చి లండన్‌లోని తన మిడ్‌ల్యాండ్స్ బ్యాంక్ ఖాతాలో జమచేయాలని కోరారు. 

చలపతిరావు అమెరికాలోని తన స్నేహితుడి ద్వారా మిడ్‌ల్యాండ్స్ బ్యాంక్‌లో ఉన్న కృష్ణమోహన్ ఖాతాలో డబ్బు జమ చేశారు. ఆ వెంటనే కోలా మిడ్‌ల్యాండ్స్ బ్యాంక్‌లో 433846958001 అనే నంబరు గల తన ఖాతా నుంచి రూ. 4 కోట్లను సింగపూర్‌లోని చంద్రబాబు ఖాతాకు 1999 ఆగస్టులో బదిలీ చేశారు. సి.నాయుడు నారా పేరుతో సింగపూర్ రాఫెల్స్‌క్యూలోని డాయిషే బ్యాంక్ అకౌంట్‌లోని పి. అకౌంట్ 2248634590-4985 నంబరు గల ఖాతాకు బదిలీ చేశారు. ఇలా చంద్రబాబునాయుడుకు రూ. 4 కోట్లు బదిలీ చేయగానే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి కొంత మంది అధికారులు ఫిల్మ్‌నగర్‌లోని కోలా గెస్ట్‌హౌజ్‌పై దాడి చేశారు. తాను చంద్రబాబుకు రూ. 5.10 కోట్లు ఇచ్చానని వారి విచారణలో కోలా తెలిపారు. దీంతో కోలా పాస్‌పోర్టును, ఇతర డాక్యుమెంట్లను సదరు అధికారులు స్వాధీనం చేసుకుని ఆదర్శనగర్‌లో ఉన్న వారి కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ రాతపూర్వకమైన వాంగ్మూలం తీసుకున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఈడీ అధికారులకు రూ. 50 లక్షలు లంచం ఇచ్చి మేనేజ్ చేశారు. విజయవాడలోని హోటల్ నటరాజ్ యజమాని వీరమాచినేని మల్లేశ్వరరావు, అప్పటి ఆంధ్రజ్యోతి పబ్లికేషన్స్ యజమాని, న్యాయవాది రాంప్రసాద్, విజయవాడకు చెందిన ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహాయంతో ఈ నగదును సదరు అధికారులకు చేర్చారు. ఈ మొత్తం డబ్బును ఈడీ అధికారులకు రాజ్‌భవన్ సమీపంలోని ఒక ఇంట్లో అందజేశారు. అనంతరం ఈడీ అధికారులు చిన్న పెట్టీ కేసు నమోదు చేసి కోలాకు చెందిన పాస్‌పోర్టును తిరిగి అప్పగించారు. 

ఆ తర్వాత 1999 నవంబర్ 27న విజయవాడ పోలీసులు కోలాను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి సికింద్రాబాద్‌లోని డెక్కన్ కాంటినెంటల్ హోటల్‌లో పెట్టారు. అక్కడికి పోలీసు ఉన్నతాధికారులంతా వచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ శివశంకర్ కూడా వచ్చారు. ముఖ్యమంత్రికి ఎంత డబ్బులు ఇచ్చావని అడిగారు. తాను రూ. 5.10 కోట్లు ఇచ్చానని కోలా చెప్పగానే.. పబ్లిక్‌లో కానీ, ప్రెస్‌తో కానీ ఎక్కడా రూ. 5.10 కోట్లు ఇచ్చినట్లు చెప్పకూడదని.. కేవలం రూ. 1.10 కోట్లు ఇచ్చానని మాత్రమే చెప్పాలని బెదిరించారు. తరువాతి రోజు 1999 నవంబర్ 28న కృష్ణమోహన్‌ను చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లారు. చంద్రబాబు కూడా ఇదే రీతిలో రూ. 5.10 కోట్లు ఇచ్చినట్లు చెప్పవద్దని, కేవలం రూ. 1.10 కోట్లుగా మాత్రమే చెప్పాలని, అది కూడా తిరిగి చెల్లిస్తానని సూచించారు. కానీ తర్వాత చంద్రబాబునాయుడు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే విజయవాడలోని కోర్టుకు జమచేశారు. ఇప్పటివరకు ఆ మిగతా రూ. 5 కోట్లు కానీ.. కనీసం బయటపెట్టిన కోటి రూపాయలు కానీ తిరిగి ఇవ్వలేదు. 

యూరో లాటరీతో బోల్తా... 
యూరో లాటరీ తగిలిందని స్వయంగా ప్రకటించుకున్న కృష్ణమోహన్.. ప్రైవేటు వ్యక్తులు, ఆర్థిక సంస్థలు, పలు బ్యాంకులు కలిపి మొత్తంగా 30 నుంచి 35 మందిని బోల్తా కొట్టించి 8 కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారని అప్పట్లో విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ సుదీప్ అక్టాకియా వెల్లడించారు. ఈ మొత్తం చాలా తక్కువని, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కాకుండానే దాదాపు 40 మంది ప్రముఖుల నుంచి కోలా రూ. 23 కోట్ల మేరకు తీసుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. కోలా ఈ రకంగా తీసుకున్న మొత్తంలో చాలా మేరకు విదేశాలకు తరలించినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు.

చిట్యాలలో ఊహించని ప్రమాదం... 
2002 ఆగస్టులో కృష్ణమోహన్‌ను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. కాచిగూడలో ఆయన ఉన్న సుప్రభాత్ హోటల్‌లో తనిఖీ చేశారు. పోలీసులకు కృష్ణమోహన్ సూట్‌కేసులో ఒక నోట్ దొరికింది. అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి కృష్ణమోహన్ రాసిన లేఖ అది. చంద్రబాబు రూ. 5 కోట్లు తీసుకుని తనను మోసం చేశారని, అసెంబ్లీలో దీన్ని ప్రకటించి తనను రక్షించాలని కోరుతూ రాసిన లేఖ అది. ఆ లేఖను తీసుకుని కృష్ణమోహన్‌ను నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.30కి వదిలేశారు. ఆ వెంటనే కృష్ణమోహన్ తన కారులో విజయవాడ బయలుదేరారు. 

సాయంత్రం 5.30కు విజయవాడ జాతీయ రహదారిలో చిట్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని వాహనం కృష్ణమోహన్ కారును ఢీకొట్టింది. దీంతో స్థానికులు కృష్ణమోహన్‌ను నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. కృష్ణమోహన్ గాయాలతో బయటపడ్డా కారు మాత్రం పూర్తిగా దెబ్బతింది. చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో కారును వదిలేసి ట్యాక్సీలో తదుపరి చికిత్స కోసం విజయవాడ వెళ్లిపోయారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులే ఈ పనికి ఒడిగట్టారని కృష్ణమోహన్ మీడియాతో ఆరోపించారు. ఈ ఆరోపణలను టీడీపీ ఎంపీ టి.దేవేందర్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. 

బాబుకు స్విస్ బ్యాంక్‌లో ఖాతాలు
చంద్రబాబుకు స్విస్ బ్యాంక్‌లో రెండు ఖాతాలు, లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోనూ ఖాతాలు ఉన్నాయని చెప్పిన కోలా కృష్ణమోహన్ ఆ బ్యాంకు ఖాతాల నంబర్లను కూడా వెల్లడించారు. ఇదిలావుండగా.. హైదరాబాద్‌కు చెందిన హవాలా బ్రోకర్, గుర్రాల వ్యాపారి హసన్ అలీని గత ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు దేశ విదేశాలకు నల్లడబ్బును తరలించిన అనేక విషయాలు బయటపెట్టాడు. 

‘ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు విదేశాల్లో అక్రమంగా దాచిన వేల కోట్ల రూపాయలను ఎన్నికలప్పుడు తిరిగి ఇతర మార్గాల్లో తెచ్చి ఇచ్చా. గడిచిన పదేళ్లలో రెండుసార్లు ఎన్నికల కోసం ఇలా నిధులందించా. 2009 ఎన్నికల్లో ఓ ప్రాంతీయ పార్టీ కోసం దాని నేత విదేశాల్లో దాచిన రూ. 200 కోట్లను హవాలా మార్గంలో తెచ్చి ఇచ్చా. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి విదేశాల్లో భారీగా డబ్బు కూడబెట్టారు. ఆయన డబ్బును నేనే హ్యాండిల్ చేశా. సినీ నటుడిగా వెలిగి రాజకీయాల్లోకి వచ్చిన మరో నాయకుడి బ్లాక్ మనీని కూడా నేనే హ్యాండిల్ చేశా’ అని హసన్‌అలీ ఈడీ దర్యాప్తులో వెల్లడించినట్టు అప్పట్లో పత్రికల్లో ప్రముఖంగా వార్తలొచ్చాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!