- కొండా దంపతుల ధ్వజం
- ఆరుసూత్రాలను వ్యతిరేకించింది మీరు కాదా?
- జగన్ సీఎం అయితే.. అసెంబ్లీలో
- తెలంగాణపై తీర్మానం బాధ్యత మాదే
వరంగల్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు పచ్చిరాజకీయ అవకాశవాది అని వైఎస్సార్ సీపీ పరకాల అభ్యర్థి కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి ఆరోపించారు. హన్మకొండలోని తమ స్వగ్రహంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆరుసూత్రాల వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని, జోనల్ వ్యవస్థను రద్దు చేయాలంటూ 1996లో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సీడీని వారు ఈ సందర్భంగా విడుదల చేశారు. తెలంగాణ నిరుద్యోగులకు రక్షణగా నిలిచిన దానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణవాదానికి కట్టుబడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాననే వాస్తవం కళ్ల ముందున్నప్పటికీ టీఆర్‌ఎస్ తమపై దుష్ర్పచారం చేస్తోందని మండిపడ్డారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం కాదనే అంశాన్ని ఎప్పుడో తేల్చి చెప్పారన్నారు. ఈ మేరకు ఇడుపులపాయ ప్లీనరీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ సీఎం అయితే తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేయించే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పడం జగన్‌కుగానీ, తమకుగానీ లేదన్నారు. అసలు కేసీఆర్‌కు తెలంగాణ ఏ విధంగా తేవాలో కనీస ప్రణాళిక ఏమైనా ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, టీడీపీలతో చెట్టపట్టాల్
టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఒకసారి కాంగ్రెస్‌తో మరోసారి టీడీపీతో పొత్తుపెట్టుకున్నారని చెప్పారు. టీడీపీ నుంచి రూ. 200 కోట్ల ప్యాకేజీ పొందారని ఆరోపించారు. ఎన్నికలు ముగియగానే ఎన్డీయేకు మద్దతంటూ బీజేపీతో చెట్టపట్టాలేసుకునే యత్నం చేశారని విమర్శించారు. ఇప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారని, సుష్మాస్వరాజ్ తెలంగాణ కోసం మాట్లాడినంతనైనా ఎప్పుడైనా కేసీఆర్ పార్లమెంట్‌లో మాట్లాడారా? అని ప్రశ్నించారు.
బీజేపీని మతతత్వపార్టీగా అభివర్ణిస్తున్న సీపీఐ కార్యదర్శి నారాయణ ఈ విషయమై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు మద్దతిస్తూ, సీమాంధ్రలో సమైక్యవాద పార్టీ టీడీపీకి మద్దతు ఇవ్వడంలో ఔచిత్యమేమిటన్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాంరెడ్డితో బలవంతంగా మద్దతు ఇప్పించుకోవాల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కు ఎందుకొచ్చిందన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలన
తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన సాగుతుందని సురేఖ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవితలంతా కలసి కుటుంబం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. గొంగళి పురుగును సైతం ముద్దాడుతానని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ కోసం రాజీనామా చేసిన తమపై ఇంత పెద్దఎత్తున దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉంటేనే ఉద్యమకారులుగా భావించడం శోచనీయమన్నారు. వైఎస్ బతికి ఉండగా సిద్దిపేటలో అనేక అభివృద్ధి పనులు చేయించుకున్న హరీష్‌రావు, కొద్దిరోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే వారని ఆరోపించారు.
పరకాలలో బుద్ధి చెబుతారు
ఊసరవెల్లి మాదిరి రంగులు మారుస్తూ 11 ఏళ్లుగా తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు పాలమూరు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారన్నారు. అంతకన్నా గొప్ప తీర్పు పరకాల ప్రజలివ్వనున్నారని చెప్పారు. ఇక్కడ రెండో స్థానం కూడా దక్కదని ఎద్దేవా చేశారు. కొన్ని చానళ్లు ప్యాకేజీలతో తమపై దుష్ర్పచారం చేస్తున్నాయని కొండా దంపతులు మండిపడ్డారు.
No comments:
Post a Comment