YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 7 June 2012

‘సత్యం’లో అలా.. ‘సాక్షి’పై ఇలా!

‘సత్యం’ కేసులో సీబీఐ దరఖాస్తుచేసుకున్న ఏడాది తర్వాత అటాచ్‌కు అనుమతి
సాక్షి వ్యవహారంలో మాత్రం హడావుడిగా మూడ్రోజుల్లోనే జీవోల జారీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి దినపత్రిక, ఇందిరా టెలివిజన్‌పై ప్రభుత్వ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాక్షి మీడియా గొంతు నొక్కేందుకు హడావుడిగా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో ‘సత్యం కంప్యూటర్స్’కు చెందిన ప్రమోటర్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపడానికి ఏడాదికిపైగానే పట్టింది! రెండు కేసులనూ దర్యాప్తు జరుపుతోంది సీబీఐనే. కానీ సాక్షి ఆస్తుల అటాచ్‌మెంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. సత్యం కంప్యూటర్స్ సంస్థ ప్రమోటర్ల కుటుంబ సభ్యుల పేర్ల మీదున్న 44 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రంగారెడ్డి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో రూ.2.48 కోట్ల విలువచేసే 44 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆమోదం తెలిపినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. గతంలో రూ.3.87 కోట్ల విలువచేసే ఆస్తులను కూడా అటాచ్ చేసేందుకు అనుమతిచ్చామని ఆ ప్రకటనలో పేర్కొంది. సత్యం కంప్యూటర్స్ సంస్థకు చెందిన కుటుంబీకులు బినామీ పేర్లతో ఏడు కంపెనీలను రిజిస్టర్ చేసిన కేసుకు సంబంధించి ఈ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించినట్లు వివరించింది. సత్యం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ అనుమతి కోరి ఏడాది పూర్తయింది. 

ఆ ప్రతిపాదనలకు ఇప్పుడు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాక్షి మీడియా ఆస్తుల అటాచ్‌మెంట్ విషయంలో మాత్రం సర్కారు అత్యంత వేగంగా స్పందించింది. సీబీఐ ప్రతిపాదనలు పంపిన మూడు రోజుల వ్యవధిలోనే హడావుడిగా ఆమోదం తెలుపుతూ జీవోలు జారీ చేసింది. సాక్షి మీడియా గొంతు నొక్కాలనే కుట్రపూరితమైన పథకం ప్రకారమే హడావుడిగా జీవోలు జారీచేసినట్లు జర్నలిస్టులందరూ ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆ జీవోల విడుదల కోసం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయేంద్ర పాల్ స్వయంగా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మరీ సంతకం చేయించుకుని రావడం గమనార్హం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!