YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 8 June 2012

జన ఉప్పెనై.. పోటెత్తిన పరకాల

- పోటెత్తిన పరకాల నియోజకవర్గం
- విజయమ్మ, షర్మిలకు అడుగడుగునా నీరాజనం
- మహానేత కుటుంబ సభ్యులకు జేజేలు
- కొండా దంపతులకు అండగా తరలిన ప్రజలు
- ఆకట్టుకున్న హావభావాలు.. 
- హత్తుకున్న విజయమ్మ, షర్మిల ప్రసంగాలు
- తెలంగాణ అమరులకు వైఎస్సార్ సీపీ నివాళి.. 
- వైఎస్ అభివృద్ధిని గుర్తుచేసిన రాజన్న సతీమణి
- నినాదాలతో హోరెత్తిన ఉప ఎన్నిక ప్రచారం

మండుటెండలోనూ.. జనప్రవాహం ఉప్పెనై కదిలొచ్చింది... కోనాయమాకుల కొండాకే అండ అంది.... ప్రజాప్రస్థానంతో రాజన్న నడయూడిన నేల విజయమ్మ అడుగులతో ఉద్వేగభరితమైంది.. రాజన్న బిడ్డను చూసేందుకు దారులన్నీ జనసంద్రమయాయి... అడుగుతీసి... అడుగేయలేనంత మందితో పరకాల ఉరకలెత్తింది... జనం గుండె చప్పుడు...జగనే అంటూ... జైకొట్టి నినదించింది... 

వరంగల్, న్యూస్‌లైన్ : పరకాల నియోజకవర్గం జనసందోహంతో పోటెత్తింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి దక్కినంత ఆదరణ.. ఆ మహానేత కుటుంబ సభ్యులకు లభించింది. రాజన్న సతీమణి, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిల నియోజకవర్గ ప్రజల నుంచి అపూర్వ స్వాగతం అందుకున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం పరకాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండా సురేఖ తరఫున ప్రచార కార్యక్రమానికి శనివారం ఇక్కడకు విచ్చేసిన వారికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. 

ఉదయం గీసుకొండ మండలంలో, సాయంత్రం పరకాల పట్టణంలో జరిగిన సభలకు అశేష జనం తరలివచ్చారు. సంక్షేమ ప్రదాతగా పేదల గుండెల్లో కొలువై ఉన్న రాజన్న హావభావాలను పుణికి పుచ్చుకున్న షర్మిల.. ఆ మహానేతను అనునయించేలా ప్రసంగించడం అందరినీ ఆకట్టుకుంది. ఒక్కసారిగా వైఎస్ స్మృతులు అందరి హృదయంలో కదలాడాయి. తెలంగాణ అమరులకు నివాళులర్పిద్దామంటూ ప్రసంగం ప్రారంభించిన విజయమ్మకు జనం జేజేలు పలికారు.

చెట్టు.. పుట్ట.. కొండంత అభిమానం
ఉదయం గీసుకొండ మండలం కోనాయమాకులలో జరిగిన రోడ్‌షో, సభకు కొండా దంపతులకు అండగా... జనం, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. 

ఇసుకేస్తే రాలనంతగా గీసుగొండ, సంగెం మండలాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో చెట్టు.. పుట్ట.. భవనాల పై భాగాలు కిక్కిరిసిపోయాయి. తమ ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే కాకుండా... తమకు ఎల్లవేళలా అండగా నిలిచే కొండా దంపతులకు మద్దతుగా వచ్చిన జనంలో అభిమానం వెల్లువెత్తింది. విజయమ్మ, షర్మిల గ్రామానికి చేరుకోగానే... నినాదాలు మిన్నంటాయి.‘జోహార్.. వైఎస్‌ఆర్.. జైజగన్.. కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..’’ అంటూ హోరెత్తించారు.

ఆ క్షణం.. ఉద్విగ్నం..
విజయమ్మ తన ప్రసంగంలో ‘భర్తను పోగొట్టుకున్నా.. బిడ్డ జైలు కెళ్లాడంటూ...’ చెప్పడంతో సభలో ఒక్కసారిగా ఉద్విగ్న క్షణాలు చోటుచేసుకున్నాయి. సభికులందరి కళ్లు చెమర్చాయి. తడి ఆరిన గొంతుకను సరిచేసుకుని... వైఎస్సార్ అమర్హ్రే... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జైజగన్.. జైజై జగన్ అంటూ హోరెత్తించారు. 

అలాగే... ప్రసంగం మొదలుపెడుతూనే... ‘నేను మీ రాజన్న బిడ్డను.. జగనన్న చెల్లెను...’’ అని షర్మిల అనగానే... పరకాల నియోజకవర్గ ప్రజలు జైజగన్... జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. మాటమాటకూ జేజేలు పలికారు. వైఎస్‌ఆర్ పేరు తలిచినప్పుడల్లా మహానేతకు జోహార్లు ఆర్పించారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. షర్మిల, విజయమ్మ ప్రసంగాలు వేలాది మందిని కట్టిపడేశాయి. 

పరకాల.. జన జాతరలా...
సాయంత్రం పరకాలలో జరిగిన సభ జన జాతరను తల పించింది. విజయమ్మ, షర్మిలను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినవారు... వారితో కరచాలనం చేసేందుకు ఆసక్తి కనబరిచారు. 

మహిళలు, వృద్ధులు గంటల తరబడి వారి కోసం ఎదురుచూశారు. చిన్న పిల్లలు కూడా ‘వైఎస్‌ఆర్... జోహార్ అంటూ పుర వీధుల్లో కలియతిరిగారు. విజయమ్మ పర్యటన... భారీ జన సందోహం... మొత్తం పరకాల నినాదాలతో దద్దరిల్లింది. 

శివారు నుంచే...
పరకాల పట్టణంలో ప్రవేశిస్తున్న క్రమంలోనే వైఎస్ విజయమ్మ, షర్మిలకు ప్రజలు నీరాజనం పలికారు. పట్టణ శివారులోని ఎల్‌ఐసీ కార్యాలయం నుంచి.. మరోవైపు హుజూరాబాద్ వైపు వెళ్లే దారిలో ఆర్టీసీ డిపో వరకు జనం బారులు తీరారు. పరకాలలో రాత్రి వరకు ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది.

అభిమానాన్ని ఆపగలరా?
విజయమ్మ, షర్మిల, కొండా దంపతుల రాకను పురస్కరించుకుని పట్టణంలో పోలీసులను భారీగానే మోహరించారు. వీరు పట్టణానికి చేరుకోవడానికి ముందే.. జన తాకిడి మొదలైంది. పోలీసులు వారిని కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొంతమందిని అదుపు చేసినా... చివరకు జనంలో వెల్లువెత్తిన అభిమానానికి చేతులెత్తేశారు. ఆర్టీసీ బస్సులను పట్టణంలోకి రానీయకుండా... శివారు ప్రాంతాల నుంచే తరలించారు. వాహనాలను దారుల వెంట అనుమతించలేదు. 

రాత్రి 8 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో చివరివరకూ జనం వెంట నడిచారు. విజయమ్మ, షర్మిల ప్రసంగాల్లో మహానేత వైఎస్, యువనేత జగన్, కొండా దంపతుల గురించి చెప్పినప్పుడల్లా జనం జేజేలు పలికారు. కొండా... మా అండ అంటూ నినదించారు. విశ్వాసానికి మారుపేరుగా కొండా దంపతులను విజయమ్మ వర్ణించడంతో సభకు వచ్చిన ప్రజలంతా గొంతు కలిపారు. కొండా మురళీధర్‌రావు, సురేఖ మాట్లాడినంత సేపు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతి చోటా ఫ్యాన్ గుర్తులను వేలాడదీస్తూ ప్రచారం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!