YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 9 June 2012

జగన్‌ను సీఎం చేస్తే ఎదిగిపోతారనే భయం హైకమాండ్‌కు ఉందేమో?

* ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు.. 18 సీట్లూ వైఎస్సార్ కాంగ్రెస్‌వే 
* 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి 200 పైగా సీట్లొస్తాయి 
* చదవకుండా సంతకాలు పెట్టేవాళ్లు మంత్రులెలా అవుతారు? 
* జగన్‌ను సీఎం చేస్తే ఎదిగిపోతారనే భయం హైకమాండ్‌కు ఉందేమో? 
* అందుకే 154 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా సీఎంను చేయలేదు 
* ప్రజాస్వామ్యమంటే ఒక్కరి చెప్పుచేతల్లో ఉండటమేనా? 
* అయినా కూడా జగన్ తిరుగుబాటు చేయలేదు కదా? 
* అధిష్టానం చెప్పినట్లే రోశయ్యను సీఎంగా ప్రతిపాదించారు కదా? 
* ఇందిరాగాంధీ హత్య సమయంలో ఏ ఒక్క ఎంపీ అభిప్రాయమూ అడగలేదెందుకు? 
* ఏకపక్షంగా రాజీవ్‌గాంధీని ప్రధాని చేసిన సంగతి మర్చిపోయారా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కాంగ్రెస్ దుస్థితికి పార్టీ అధిష్టానమే కారణమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కక్షతో పార్టీని నాశనం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా జగన్ పక్షానే నిలబడ్డారని, వై.ఎస్.విజయమ్మ సభలకు వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో అన్ని సీట్లూ (18 అసెంబ్లీ, ఒక ఎంపీ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం ఖాయమన్నారు. 2014లో జరగబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఇంతకంటే పెద్ద మార్పు ఏమీ ఉండబోదని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 200కు పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. 

ఉప్పునూతల శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తాజా రాజకీయ పరిస్థితి, జగన్‌పై హైకమాండ్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘వై.ఎస్. రాజశేఖరరెడ్డి బతికుండగా ఆయనను పొగిడిన వాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే వైఎస్ ఎక్కడ ఉండేవారని అంటున్నారు. 1978లో రాజశేఖరరెడ్డి ఇందిరా కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదు. రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2004లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాగలిగారు. 2009లో 33 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇప్పుడేమో ఇట్లా అంటే ఏం న్యాయం? ఏదైనా జరిగితే అది మా ప్రభావం.. లేకుంటే ఆయనెక్కడ అనే పద్ధతి సరికాదు’’ అని పేర్కొన్నారు. 

రాజీవ్‌ను ప్రధానిని ఎలా చేశారు? 
జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. ‘‘తండ్రి శవం ముందే జగన్ సంతకాలు పెట్టించి హైకమాండ్‌ను ధిక్కరించారని ఇవాళ మా పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. తల్లీకొడుకులే వైఎస్‌ను చంపించారని కూడా ఆరోపిస్తున్నారు. నిజానికి వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం జగన్‌ను నేను చూసి ఎరగను. వైఎస్ చనిపోయిన తరువాత ఇడుపులపాయలో మొదటిసారి అతన్ని చూశాను. నిజంగా సంతకాలు ఎవరు పెట్టించారో నాకు తెల్వదు కానీ.. జగన్ సీఎం కావాలని 154 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినప్పుడే ఆయనను సీఎంగా ప్రకటించాల్సి ఉండే. కానీ హైకమాండ్ ఎందుకు చేయలేదు? ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదా? ఒక్కరి చెప్పుచేతల్లో ఉండటమే ప్రజాస్వామ్యమా? అలాగయితే ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు ఏ ఒక్క ఎంపీ అభిప్రాయమూ తీసుకోలేదు. ఎవరి అభిప్రాయమూ అడగలేదు. 

రాష్ట్రపతి వద్దకు వెళ్లి రాజీవ్‌గాంధీని ప్రధానిని చేయాలని చెప్పిన విషయం మర్చిపోయారా? కానీ ఇక్కడ అట్లా కూడా జరగలేదే. ఎమ్మెల్యేలంతా జగన్ సీఎం కావాలని సంతకం చేసినా మీరు (హైకమాండ్) మాత్రం వాటిని పక్కన పెట్టి రోశయ్యను సీఎం చేస్తానన్నారు. అంతమంది ఎమ్మెల్యేల హక్కును కాలరాసే హక్కు మీకెక్కడిది? జగన్ సీఎం అయితే ఎదిగిపోతారనే భయం కాంగ్రెస్ అధిష్టానంలో ఉందేమో? అయినా కూడా జగన్ అధికారం కోసం మీ మీద తిరుగుబాటు చేయలేదే? మీరు చెప్పినట్లుగానే రోశయ్య పేరునే ప్రతిపాదించారే? ఆ తరువాత ఒక్కడే పార్టీ నుంచి బయటకొచ్చి పోటీ చేస్తే ఐదున్నర లక్షల మెజారిటీతో గెలిచారు. ఇదేం మామూలు విషయం కాదే! అయినా ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా జగన్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఒకరిపై కక్షతో పార్టీని నాశనం చేసుకుంటారా? ఇదేం న్యాయం?’’ అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. 

మంత్రులు తమకేం తెలియదంటారా? 
గతంలో తాను సోనియాగాంధీని కలిసినప్పుడే.. చాలా తప్పులు చేస్తున్నారని, సరిదిద్దుకోకపోతే పార్టీకి కష్టమని కూడా హెచ్చరించానని ఉప్పునూతల తెలిపారు. వైఎస్ హయాంలో జరిగిన తప్పులకు తమకు సంబంధం లేదని, వైఎస్ చెప్తేనే సంతకాలు చేశామని, ఫైళ్లు కూడా చూడలేదని మంత్రులు చెప్తున్న మాటలపైనా ఆయన మండిపడ్డారు. ‘‘దొరికిన వాడే దొంగ... దొరకనోడు దొర అన్నట్లుగా సీబీఐ విచారణ సాగుతోంది. నిష్పాక్షిక విచారణే జరగటం లేదు. 26 జీవోలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కేబినెట్ సమష్టిగా తీసుకున్నవే. మాకేం తెలియదంటే ఎట్లా? చదవకుండా సంతకాలు పెట్టెటోళ్లు మంత్రులెలా అవుతారు? ఇక కేబినెట్ ఎందుకు? కడప జిల్లాలో రఘురాం సిమెంట్ కోసం సేకరించే స్థలానికి ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున చెల్లిద్దామని రాజశేఖరరెడ్డి ప్రతిపాదిస్తే.. అంత రేటెందుకు? అక్కడ ఎకరా స్థలం రూ. 50 వేలు కూడా చేయదని చెప్పిన మంత్రులు ఈ రోజు తమకేం తెలియదంటే నమ్మేదెవరు?’’ అని ఆయన నిలదీశారు. 

ఓడిపోతామనే అసహనంతోనే ఆ మాటలు... 
జయమ్మ, జగన్‌లు కలిసి వైఎస్‌ను హత్య చేసి ఉంటారంటూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఉప్పునూతల విస్మయం వ్యక్తం చేశారు. ‘‘పాపం.. విజయమ్మ ఏనాడూ బయటకు రాని మనిషి. నాలాంటి వాళ్లు ఎప్పుడైనా వైఎస్ ఇంటికి వెళ్లినా భోజనం వడ్డించే దగ్గర తప్ప మరెక్కడా కనిపించేవారు కాదు. అలాంటి వ్యక్తిని పట్టుకుని రాజశేఖరరెడ్డిని చంపించారంటే వాళ్లను ఇంకేమనాలి? అది కూడా వైఎస్ ఉన్నన్నాళ్లూ సన్నిహితంగా ఉన్న బొత్స అంటాడా? ఆ మాటలను వింటుంటే ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే అసహనంతో మాట్లాడుతున్నారే తప్ప ఇంకోటి కాదనిపిస్తోంది. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని మాకు ముందే తెలుసు. పోటీ పెట్టద్దని చెప్పినా వినలేదు. ఇప్పుడు ఘోరంగా ఓడిపోతామని తెలిసే సరికి ఇట్లా మాట్లాడుతున్నారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఎవరెన్ని మాట్లాడినా ప్రజలంతా జగన్ పక్షానే ఉన్నారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లో ఇప్పుడున్నోళ్లంతా బ్రూటస్‌లే... 
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులంతా బ్రూటస్‌లలా తయారయ్యాయని ఉప్పునూతల విమర్శించారు. ‘‘రాజశేఖరరెడ్డి బతికున్నన్నాళ్లూ ఆయన వెన్నంటి ఉంటూ.. అహో ఓహో అని పొగిడిన బొత్స సత్యనారాయణ, ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి వాళ్లు కూడా ఈ రోజు ఎలాపడితే అలా మాట్లాడుతున్నారంటే బాధేస్తోంది. పాత రోజులను చూస్తున్నామా? అనిపిస్తోంది. వాళ్లను చూస్తుంటే సీజర్ అన్న ‘యూ టూ బ్రూటస్’ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడున్న వాళ్లంతా అలానే తయారయ్యారు. చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. ప్రజాస్వామ్యాన్ని చూస్తుంటే భయమేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!