YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 7 June 2012

రుషికొండ భూములపై వాస్తవాల్ని దాచిన రామోజీ. వైఎస్ బంధువులు ఉన్నారంటే చాలు... ప్రతిదీ మోసమేనంటూ చెలరేగిపోవటమేనా? మరీ ఇంత దారుణమా?

*బిడ్డింగ్ ద్వారానే 80 ఎకరాలు; ఒప్పందం ప్రకారమే ప్రీక్లోజర్
*ప్రీక్లోజర్ గా ముందే ఎకరాకు రూ.3.02 కోట్లు దక్కించుకున్న ‘వుడా’
*అప్పటికే అడ్వాన్సులు, అనుమతుల కోసం రూ.30 కోట్లు ఖర్చుచేసిన వైవీ సంస్థ
*దీన్ని దాచిపెట్టి కేవలం రూ.3 కోట్లే పెట్టారంటూ ‘ఈనాడు’ అబద్ధాలు
*పర్యావరణ అనుమతికి రాసిన లేఖలో 86 లక్షల చ.అ.ల నిర్మాణాలు చేపడతామన్న సంస్థ
*ప్రీక్లోజర్‌కు వచ్చేసరికి అంచనాలు కుదింపు.. 51 లక్షల చదరపు అడుగులకే పరిమితం
*దానిప్రకారమే ప్రాజెక్టు వ్యయం అంచనా; దాన్లో వాటాగా వుడాకు రూ.242 కోట్లు
*నిజానికి 51 లక్షల చదరపు అడుగుల్లో ఇప్పటికి నిర్మించింది 15 శాతం కూడా లేదు
*మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా మారటంతో నెమ్మదించిన ప్రాజెక్టు పనులు
*భూమికి చెల్లించిన డబ్బుతో పాటు ప్రాజెక్టు వ్యయం కూడా ఇరుక్కుపోయిన వైనం
*అయినా సరే వైవీ సుబ్బారెడ్డి లాభపడ్డారంటూ అడ్డగోలు రాతలు... 
*ఎన్నికల ముందు వైఎస్సార్ బంధుమిత్రులే టార్గెట్‌గా రెచ్చిపోతున్న ఎల్లో పత్రికలు

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి):అసలే రామోజీ! ఆపై ఎన్నికలు!! ఇక అబద్ధాలకు హద్దుంటుందా? రాసే రాతలకు విలువలూ వలువలూ ఉంటాయా? వై.ఎస్.రాజశేఖరరెడ్డి బంధువులైతే చాలు. ఆయన కుటుంబీకులైతే చాలు. ఏదైనా రాసేయొచ్చనే బరితెగింపు... ఎంతకైనా దిగజారిపోవచ్చనే నిస్సిగ్గుతనం... ఇవే ఇప్పుడు రామోజీలో కనిపిస్తున్నాయి. నిలువెల్లా విషం కక్కుతున్న ‘ఈనాడు’ ఇలాంటి కథనాలతోనే చెలరేగిపోతోంది. 35 ఏళ్ల పాటు తాను ఏది రాస్తే అది నిజమని నమ్మిన జనం... నాలుగేళ్లుగా అలా నమ్మటం లేదన్న నగ్నసత్యం రామోజీకి ఇప్పటికీ బోధపడటంలేదు. వయసు పెరుగుతున్నా సరే...!!!

‘రుషి కొండ కింద అనకొండ’ అంటూ అడ్డంగా ఫుల్‌పేజీ కథనాన్ని వండి వార్చేసిన ‘ఈనాడు’... అందులో అసలు అంశాల్ని ఎందుకు వదిలిపెట్టింది? ఉన్నట్టుండి ఇప్పుడు ఈ కథనాన్ని ఎందుకు ప్రచురించింది? ఎన్నికలు ఐదు రోజుల్లో ఉన్నందుకా? వైఎస్సార్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న వై.వి.సుబ్బారెడ్డి ఈ వ్యవహారంలో ఉన్నందుకా? ఆయన వైఎస్సార్‌కు బంధువు కావటం వల్లా? నిజం చెప్పాలంటే... ఈ మూడూ కారణాలే! అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం.

విశాఖపట్నంలోని మధురవాడలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం 2006లో టెండర్లు పిలిచింది. చాలా కంపెనీలొచ్చాయి. ఎక్కువ ధరకు బిడ్ వేసిన ఏబీఎస్ ఇన్‌ఫ్రా-జురాంగ్‌కు 80 ఎకరాల ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు దక్కింది. తరువాతి స్థానం... అంటే హెచ్-2 ఎవరో తెలుసా? ఎల్ అండ్ టీ.

ఏబీఎస్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎస్‌పీవీని ఏర్పాటు చేసింది. ఆ సంస్థతో 2007 మార్చిలో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ ఒప్పందం ప్రకారం అన్ని అనుమతులూ వచ్చిన మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. వుడాకు కనీస గ్యారంటీ మొత్తం కింద ఎకరానికి రూ.2.96 కోట్లు (మొత్తం రూ.236.50 కోట్లు) గానీ... లేదా ప్రాజెక్టు పూర్తయ్యాక అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ములో 26.8 శాతం గానీ... ఏది ఎక్కువైతే అది ఇవ్వాలి.

ఒప్పందం సందర్భంగా కనీస గ్యారంటీ మొత్తంలో 10 శాతాన్ని అంటే 23.6 కోట్లను ఏబీఎస్ సంస్థ చెల్లించింది. అనుమతుల కోసం మరో 7 కోట్లు... మొత్తమ్మీద ముందే రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టింది. 

పర్యావరణ అనుమతుల కోసం స్టేట్ లెవల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీకి 2007 అక్టోబర్లో లేఖ రాసిన గ్లోబల్ సంస్థ... ఆ భూమిలో 86.33 లక్షల చదరపు మీటర్ల మేర నిర్మాణాల్ని నిర్మిస్తామని అంచనా వేసింది. 

అమెరికాలో సబ్‌ప్రైమ్ సంక్షోభం 2007 చివరి నుంచే తన ప్రభావం చూపించటం మొదలుపెట్టింది. ఈ సమయంలో ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా అని ఏబీఎస్ ఆలోచనలో పడింది.

ఇంతలో శ్రీరామ్ గ్రూపు దీన్ని చేపట్టడానికి ఆసక్తి చూపించింది. ప్రభుత్వంతో లావాదేవీలకు బదులు... ప్రీ క్లోజర్ ద్వారా ప్రభుత్వ వాటాను ముందే చెల్లిస్తే బాగుంటుందని సూచించింది.

ప్రీక్లోజర్ అంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక విక్రయాల ద్వారా ఎంత వస్తుందో ముందే అంచనా వేసి, దాన్లో 26.8% మొత్తాన్ని ‘వుడా’ వాటాగా దానికి ముందే చెల్లించాలి. 

ఒప్పందంలో ఈ అంశం ఉండటంతో ఏబీఎస్ సంస్థ ప్రీక్లోజర్ ప్రతిపాదన చేసింది. ‘వుడా’ సరేనంది. మార్కెట్ పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవటంతో 51.49 లక్షల చదరపు అడుగుల నిర్మాణాల్ని చేపట్టే అవకాశం ఉందని అంచనా వేసి.. తద్వారా రూ.1121.34 కోట్లు వస్తుందని భావించి.. దాన్లో 26.8% అంటే దాదాపు రూ.300 కోట్లు‘వుడా’కు చెల్లించడానికి అంగీకరించారు. 

మూడేళ్లకు ముందే ‘వుడా’ వాటా మొత్తం చెల్లిస్తున్నారు కనక... స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఎల్‌ఆర్ (ప్రైమ్ లెండింగ్ రేట్) ప్రకారం ఏడాదికి 11 శాతం చొప్పున వడ్డీని మినహాయించారు. దాంతో నికరంగా తేలిన రూ.242.29 కోట్లను గ్లోబల్ ఎం ట్రోపోలిస్ సంస్థ ముందే ‘వుడా’కు చెల్లించేసింది.

అంటే ఎకరాకు నికరంగా రూ.3.02 కోట్లు చెల్లించారన్న మాట. ఒప్పందం ప్రకారమైతే డెవలప్‌మెంట్ పూర్తయ్యాక భవనాల్ని కొనుక్కున్న వారికి ‘వుడా’యే రిజిస్ట్రేషన్ చేస్తుంది. కానీ ఇలా ప్రీ క్లోజర్ ద్వారా భూమిని తీసుకోవటం వల్ల రూ.23 కోట్లు రిజిస్ట్రేషన్ చార్జీల్ని కూడా గ్లోబల్ సంస్థే చెల్లించాల్సి వచ్చింది. 

ఈ రకంగా చూసినపుడు సదరు భూమి ద్వారా వుడాకు రూ.242 కోట్లు, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపేణా 23 కోట్లు దక్కాయన్న మాట.

ఇప్పటికీ పూర్తికాని ప్రాజెక్టు: సరే! ‘వుడా’ వాటా ముందే ఇచ్చేయటంతో వెనక్కెళ్లిపోయింది. శ్రీరామ్ గ్రూపు 74 శాతం వాటాతో, గ్లోబల్ సంస్థ 26 శాతం వాటాతో మిగిలాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాయి. ఇప్పటికి నాలుగేళ్లు గడిచింది. ఊహించిన డిమాండ్ లేదు. పర్యావరణ అనుమతులప్పుడు చెప్పిన 86 లక్షల చదరపు అడుగులు కాదు కదా... ప్రీ క్లోజర్ సమయంలో అంచనా వేసిన 51 లక్షల చదరపు మీటర్లలో కనీసం 15 శాతాన్ని కూడా ఇప్పటికీ నిర్మించలేదు. రియల్ బూమ్ పోయి ఒకదశలో ప్రాజెక్టు సగంలో ఆగి పోయింది. తరవాత మెల్లగా సాగుతోంది. ఇప్పటికీ నిర్మాణాలు పూర్తికాలేదు. అడ్వాన్సు కోసం, అనుమతుల కోసం ఏబీఎస్ సంస్థ పెట్టిన 30 కోట్లూ ఇరుక్కుపోయింది. తరవాత శ్రీరామ్-గ్లోబల్ సంస్థలు రెండూ కలిసి భూమికోసం చెల్లించిన 275 కోట్లు, ప్రస్తుతం నిర్మాణానికి వెచ్చించిన మొత్తం... అన్నీ ఇరుక్కుపోయాయి. ఇప్పటికి పైసా లాభం లేదు. సరికదా పెట్టిన పెట్టుబడి సైతం వస్తుందో రాదో తెలియని స్థితి. 

రామోజీ కడుపు మంటేమిటి?: అసలిక్కడ లాభపడిందెవరైనా ఉంటే అది ‘వుడా’యే కదా? రిజిస్ట్రేషన్‌కు రూ.23 కోట్లు రాబట్టడం ద్వారా లాభపడింది ప్రభుత్వమే కదా? సొమ్ము పూర్తిగా ఇరుక్కు పోయి నష్టపోయిందెవరైనా ఉంటే అది ఏబీఎస్ సంస్థ, శ్రీరామ్ సంస్థ తప్ప ‘వుడా’ ఎక్కడ నష్టపోయింది? మూడేళ్లలో పూర్తికావాలన్న ప్రాజెక్టు ఇంకా పూర్తికానేలేదు. అలాంటిది వుడాకు నాలుగేళ్ల కిందటే రూ.242 కోట్లు... అంటే ఎకరాకు రూ.3 కోట్లు దక్కాయి. అప్పట్లో హైదరాబాద్ హైటెక్‌సిటీ చెంతనే ల్యాంకోకు వేలంలో ఎకరా రూ.4 కోట్లకు దక్కింది. మరి విశాఖలో రూ.3 కోట్లంటే ఎక్కువ కాదా? వుడా నష్టపోయిందెక్కడ? రామోజీ ఎందుకింతలా దిగజారుతున్నారు? ఏబీఎస్ సంస్థలో వైఎస్ తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి భాగస్వామి కావటమే నేరమా? ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు లాభాలొచ్చాయంటూ అడ్డగోలుగా రాస్తారా? అసలు ఎంత నిర్మాణం చేపట్టాలనే దానికి అనుమతినిచ్చేదెవరు? పర్యావరణ అనుమతుల సంస్థా... లేక టౌన్‌ప్లానింగ్ సంస్థా? 

ఎల్‌ఐజీలపైనా అడ్డగోలు రాతలే: ఈ ప్రాజెక్టులో ఎల్‌ఐజీ ఇళ్లను నిర్మించాలని నిబంధనల్లో ఉందని, కానీ నిర్మించకుండా తూట్లు పొడిచారని కూడా రామోజీ మహా ఆవేదన వెళ్లగక్కారు. అసలు రాసిన వ్యక్తికి అక్కడి ప్రాజెక్టు గురించి అవగాహన ఉందా? ఇప్పటిదాకా ఎన్ని చదరపు అడుగులు నిర్మించారో తెలుసా? ఎల్‌ఐజీలకు మొదటి నుంచీ కొంత స్థలం కేటాయించి దాన్ని అన్ని ప్లాన్‌లలోనూ చూపిస్తున్న సంగతి తెలియదా? ప్రాజెక్టే పూర్తికానప్పుడు ఎల్‌ఐజీలకు కేటాయించలేదని ఎలా చెబుతారు? ఎందుకింత అడ్డగోలు రాతలు? ఎవరి కోసం? ఏ బాబు ప్రయోజనాల కోసం? ఎవరిని దెబ్బతీయటానికి? 

అంచనాలు తప్పవా?: మొదట పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసినపుడు అప్పటి పరిస్థితుల్ని బట్టి 86 లక్షల చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపడతామని చెప్పి ఉండొచ్చు. కానీ తరువాతి మార్కెట్ పరిస్థితుల్ని బట్టి... అక్కడి భూమి పరిస్థితిని బట్టి 51 లక్షల చదరపు అడుగుల నిర్మాణాల్నే చేపట్టగలమని అనుకున్నారు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితుల్ని బట్టి ప్రస్తుతానికి అందులో 10-15 శాతాన్నే నిర్మిస్తున్నారు. మరి దీన్నేమనుకోవాలి? అసలిక్కడ నష్టపోయిందెవరో... లాభపడిందెవరో రామోజీకి అర్థం కావటం లేదా? లేక ఎల్లో కళ్లలోంచి చూస్తున్నారు కాబట్టి ఆయనకు ఇలా కనిపించటం సహజమనుకోవాలా? ఎన్నికల వేళ అన్నీ వదిలేసి ఇలా రెచ్చిపోతుండటాన్ని జనం అర్థం చేసుకోరనుకుంటున్నారా? రామోజీకి తన పాఠకులంటే ఎందుకంత చులకన?

డబ్బులే చెల్లించని సంస్థల సంగతేంటి?

గ్లోబల్ ఎంట్రోపోలిస్ సంస్థ ముందే మొత్తం డబ్బులు చెల్లించి ఇరుక్కోగా.. విశాఖలో ‘వుడా’ నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టులు కట్టలేక, డబ్బులు కూడా చెల్లించకుండా, భూమిని మాత్రం తమ చెంతే ఉంచుకున్న కొన్ని సంస్థల వివరాలివిగో

విశాఖ జిల్లా దాకమర్రిలో టీడీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడి సంస్థకు పబ్లిక్, ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పేరున లేఅవుట్ అభివృద్ధికి రెండేళ్ల కిందట 80 ఎకరాలు కేటాయించారు. ఎకరా రూ.3 కోట్లు చొప్పున లెక్కిస్తే రూ.240 కోట్లు విలువ చేసే భూమిలో ఇప్పటిదాకా ప్రాజెక్టును ప్రారంభించనే లేదు. వుడాకు డబ్బులూ చెల్లించలేదు.

ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్స్ సంస్థకు రుషికొండలో వుడా 10 ఎకరాలను కేటాయించింది. కేవలం రూ.6 కోట్లకు తీసుకున్నప్పటికీ 10 శాతం అడ్వాన్సును మాత్రమే ఈ సంస్థ చెల్లించింది. మిగిలిన డబ్బు కట్టలేదు. ప్రాజెక్టూ చేపట్టలేదు. దాదాపుగా దీని విలువ రూ.75 కోట్లు ఉంటుంది.

వైభవ్ జ్యూయలర్స్‌కు చెందిన స్కై స్క్రాపర్స్ సంస్థకు నగరం నడిబొడ్డున సిరిపురం ప్రాంతంలో 1.5 ఎకరాను ‘వుడా’ లీజు పద్ధతిన అప్పగించింది. రూ.75 కోట్ల విలువ చేసే ఈ భూమికి సంబంధించి సంస్థ ఇప్పటిదాకా సొమ్ము చెల్లించలేదు. 

ఇంటర్నేషనల్ స్కూల్ కోసం శ్రీ చైతన్య సంస్థకు రుషికొండలో 5 ఎకరాలు ఒక చోట, 5 ఎకరాలు మరోచోట కేటాయించారు. దీని విలువ రూ.60 కోట్లు. ఇప్పటివరకు డబ్బు చెల్లించలేదు.

మరి ఇవేవీ రామోజీకి కనిపించవా? వైఎస్ బంధువులు ఉన్నారంటే చాలు... ప్రతిదీ మోసమేనంటూ చెలరేగిపోవటమేనా? మరీ ఇంత దారుణమా?

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!