YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 7 June 2012

వృథా ‘ప్రణాళిక’!

లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలను జనానికి అలవాటు చేసిన యూపీఏ జమానాలో కొన్ని లక్షల రూపాయల దుర్వినియోగం అంటే ఎవరికైనా పెద్దగా పట్టకపోవచ్చు. ‘ప్రభుత్వం అన్నాక ఆ మాత్రం వృథా జరగదా?’ అని కూడా అనుకోవచ్చు. కానీ, ప్రణాళికా సంఘం కొలువుదీరిన యోజనా భవన్‌లో జరిగిన వృథా కథే వేరు. ఆ భవన సముదాయంలోని రెండు మరుగుదొడ్లను ఆధునికీకరించడానికి ఏకంగా రూ.35 లక్షల రూపాయలు ఖర్చుచేసి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా రికార్డు సృష్టించారు. పైగా, ‘అందులో తప్పేంటి...’అనే ప్రశ్న దగ్గరనుంచి ‘అవి 50 ఏళ్లనాటివి. మొత్తం పాడైపోయాయి. పైపులు మార్చి, విద్యుత్తు పనులు, ప్లంబర్ పనులు వగైరా ఎన్నో చేయించాల్సివచ్చింది’ అని చెప్పిన సంజాయిషీ వరకూ మధ్యలో చాలా జవాబులు వచ్చాయి. 

‘తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకు గడ్డి కోసమ’ని వెనకటికెవడో చెప్పిన ధోరణిలోనే ఈ జవాబులు, సంజాయిషీలు, ఎదురు ప్రశ్నలు, దబాయింపులు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రణాళికా సంఘం చెప్పినదానికంటే దాచిందే ఎక్కువ. అంతేకాదు... ఇది కేవలం కొన్ని లక్షల రూపాయల వృథాకు సంబంధించిన విషయాన్ని మాత్రమే కాదు... అంతకుమించి దానికి నేతృత్వం వహిస్తున్న వారిలో గూడుకట్టుకున్న ఆధిక్యతా ధోరణిని కూడా వ్యక్తపరుస్తున్నది.

ప్రణాళికా సంఘం నెత్తికెత్తుకున్న బాధ్యతలు సామాన్యమైనవి కాదు. దేశంలో వనరుల లభ్యత ఎలా ఉన్నదో అంచనా వేసుకోవడం, భిన్న రంగాల్లో ప్రాధమ్యా లేమిటో, రానున్న కాలంలో ఎలాంటి అవసరాలు ఏర్పడతాయో నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించడం ఈ సంఘం ప్రధాన బాధ్యత.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను, ప్రకటించే పథకాలను సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలకు అవి అనుగుణంగా ఉన్నాయో, లేదో చూడటం ఆ సంఘం బాధ్యతే. ఇలాంటి బాధ్యతలన్నీ మోస్తున్న ప్రణాళికా సంఘం తాను కొలువుదీరిన చోటే ఇంతగా వృథా వ్యయం చేసి, ఇదేమని అడిగితే ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా జవాబులిస్తున్న తీరు చూస్తే ఇలాంటి సంఘమా మన ప్రణాళికలు రూపొందిస్తున్నదన్న అనుమానాలు ఎవరికైనా తలెత్తకమానవు. 

కొన్ని నెలలక్రితం ఇదే ప్రణాళికా సంఘం దారిద్య్ర రేఖ నిర్ధారణ విషయంలో రకరకాల జవాబులిచ్చి సర్వోన్నత న్యాయస్థానంతో చీవాట్లు తిన్న విషయం ఎవరూ మరిచిపోలేదు. ప్రణాళికా సంఘంవారి లెక్కల ప్రకారం దేశంలో పేదల శాతం 37.2 మాత్రమే. గత ఏడేళ్లలో పేదరికం 7.3 శాతం తగ్గిందని వారు ఓ నివేదిక కూడా విడుదల చేశారు. పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ.28.35, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.22.42 కంటే ఎక్కువ ఖర్చుపెడితే పేదలు కానేకాదన్నది ప్రణాళికా సంఘం కొలమానం. 

ఇలా దారిద్య్ర రేఖ విషయంలో రకరకాల విన్యాసాలు చేసి చాలామందిని ఆ రేఖనుంచి దాటించి ‘ఇక్కడంతా క్షేమం’ అని చెప్పడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు మరుగుదొడ్ల విషయంలోనూ అదే బాణీ అనుసరిస్తున్నారు. సుభాష్ అగర్వాల్ అనే ఆర్టీఐ కార్యకర్త ఒకరు చేసుకున్న దరఖాస్తు పుణ్యాన ఈ మరుగుదొడ్ల ప్రహసనమంతా వెలుగుచూసింది. రెండు మరుగుదొడ్లకు రూ. 30 లక్షలు ఖర్చు చేశామని, అందులో ప్రవేశాన్ని కొందరికే పరిమితం చేసే ఉద్దేశంతో రూ.5,19,426తో స్మార్ట్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టామని కూడా ఆయనకిచ్చిన జవాబులో తెలియజేశారు. 

దీనిప్రకారం కార్యాలయంలో పనిచేసే ఉన్నతోద్యోగులు 60 మందికి మాత్రమే ఆ మరుగుదొడ్లను ఉపయోగించుకునే సదుపాయం లభిస్తుందన్నమాట. మిగిలిన సిబ్బంది వారి దృష్టిలో మనుషులే కాదు. పైగా, అందులోకి వచ్చిపోయేవారెవరో ఆరా తీయడానికి సీసీ కెమెరాలు పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారట. అన్నీ వెల్లడయ్యాక ప్రణాళికా సంఘం చెబుతున్న సంజాయిషీలు వింతగొలుపుతున్నాయి. 

మరుగుదొడ్లలో చాలా ఖరీదైన బేసిన్‌లు, కమోడ్‌లు, కుళాయిలు వాడారట. అవి ఎవరైనా ఎత్తుకుపోతారేమోనన్న భయంతో కొందరికే ప్రవేశం లభించేలా స్మార్ట్ కార్డులు పెట్టాలన్న ప్రయత్నం చేశామని, అయితే దాన్ని అమల్లోకి తేలేదని చెప్పుకొచ్చారు. కాదు... కాదు... మహిళలు ఉపయోగించే మరుగుదొడ్లకు భద్రత అవసరమని భావించి ఈ ఏర్పాటుచేశామని ఆ తర్వాత సంజాయిషీ ఇచ్చారు. సాధారణ వ్యక్తులెవరూ యోజనాభవన్ దరిదాపుల్లోకి వెళ్లలేనంతగా అక్కడ భద్రత ఉంటుంది. 

అంత పకడ్బందీ ఏర్పాట్లున్నచోట తమ వస్తువులకు భద్రత లేదని, కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలకు రక్షణలేదని ప్రణాళికా సంఘం చెప్పడమంటే ఎంత సిగ్గుచేటు! అసలే అష్టకష్టాలు పడుతున్న సామాన్యులకు అరకొరగా అందే సౌకర్యాలను సైతం దూరంచేయడానికి కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖ దిగువున ఉన్నవారి శాతాన్ని తగ్గించడానికి చూస్తోంది. అందులో భాగమే ప్రణాళికా సంఘం చూపుతున్న కాకి లెక్కలు. 

ఒకపక్క ఇలాంటి లెక్కలతో సామాన్యులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతనుంచి తప్పించుకోవాలని చూస్తూ, తమ కోసం మాత్రం అవసరానికి మించి అతిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం క్షమార్హంకాని నేరం. మాంటెక్‌సింగ్‌కు నిజంగా ప్రజలపట్ల బాధ్యత ఉంటే ఆ మరుగుదొడ్ల నిర్వహణను సులభ్‌లాంటి సంస్థలకు అప్పగించేవారు. 

ఇలాంటి దుర్వినియోగం ఆయనకు కొత్తేమీ కాదు. గత ఏడాది ఆరునెలల వ్యవధిలో... అంటే మే-అక్టోబర్ మధ్య విదేశీ ప్రయాణాల పేరుచెప్పి ఆయన రోజుకు రూ.2 లక్షలకుపైగా ఖర్చుచేశారట! ఇవన్నీ ‘తమదొక రీతి... జనానికొక నీతి’గా పాలిస్తున్న యూపీఏ వ్యవహార శైలిని మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి. 

స్వయంగా ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వం వహించే ప్రణాళికా సంఘంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక చెప్పేదేముంది! కనీసం ఇలాంటివి బయటపడినప్పుడైనా పొరపాటును ఒప్పుకుని, సరిదిద్దుకోవడం మాని దబాయింపులకు దిగితే ఏమనుకోవాలి? పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!