కడప, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఇచ్చిన మాట తప్పనందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కేసులు, రైడ్‌లు, అరెస్టులతో వేధిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మహానేత రాజశేఖరరెడ్డి చనిపోతే.. అది తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గుండె పగిలి మరణించారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు నల్లకాలువలో జరిగిన సంతాప సభలో.. తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తానని నా బిడ్డ చెప్పాడు.
అలా వెళ్లడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం లేదు. ఓదార్పు యాత్ర చేయొద్దని చెప్పింది. కానీ.. ఆ మాట తప్పేది లేదని జగన్ బాబు చెప్పాడు. మాట మీద నిలబడి.. చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చుతూ నిరంతరం ప్రజల మధ్యే గడిపాడు. ఇదే కాంగ్రెస్ పెద్దలకు కంటగింపుగా మారి.. కక్ష సాధిస్తున్నారు’’ అని విజయమ్మ అన్నారు. ఓదార్పు యాత్ర మొదలుపెట్టిన వెంటనే ‘సాక్షి’ పత్రికకు ఐటీ నోటీసులు పంపారని, ఆపై 700 మందితో రైడ్ చేయించారని ఆమె గుర్తుచేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె తన కుమార్తె షర్మిలతో కలిసి వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. రోడ్‌షోలకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
సీబీఐది ద్వంద్వ వైఖరి: కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న సీబీఐ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విజయమ్మ ఆరోపించారు. కోర్టు చెప్పి 24 గంటలు గడవకముందే సీబీఐ.. జగన్ బాబుపై దర్యాప్తు ప్రారంభించిందని, అదే చంద్రబాబు మీద నెలరోజుల్లోపు దర్యాప్తు ప్రారంభించాలని న్యాయస్థానం చెప్పినా.. పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘బోఫోర్స్ కుంభకోణంలో సోనియా, రాజీవ్ గాంధీపై ఆరోపణలు వచ్చాయి. వారి ఇళ్లలో సీబీఐ సోదాలు చేయలేదే? మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌పై ఆరోపణలు వచ్చినా.. సీబీఐ విచారించలేదే? ఫోక్స్ వ్యాగన్ కేసులో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిపై రైడ్‌లు చేయలేదే? 26 జీవోలు విడుదల చేసిన మంత్రుల ఇళ్లలో సోదాలు చేయలేదే?’’ అని ఆమె ప్రశ్నించారు. జగన్ మీద దర్యాప్తునకొచ్చేసరికి తమతోపాటు, పెట్టుబడిదారులు, బంధువులందరి ఇళ్లలోనూ తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. ‘‘జగన్‌పై తొమ్మిది నెలలుగా విచారణ చేస్తూనే ఉన్నారు. ఏరోజూ పిలిచి విచారించలేదు. కానీ ఉప ఎన్నికలొచ్చేసరికి.. ప్రచారంలో ప్రజల మధ్య ఉన్న జగన్ బాబును తీసుకెళ్లిపోయారు. జగన్ బయటుంటే ఒకటి, రెండు సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమని భావించే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఈ కుట్ర చేశాయి’’ అని దుయ్యబట్టారు.
ఏసీబీ కేసులున్న రోశయ్యకు గవర్నర్ పదవా?: జగన్ కాంగ్రెస్‌లో ఉంటే కేంద్ర మంత్రి పదవి, ఆ తర్వాత సీఎం పదవి ఇచ్చేవారమని కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ చెప్పారని విజయమ్మ గుర్తుచేశారు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి సొంత పార్టీ పెట్టుకుని ప్రజాభిమానాన్ని జగన్ చూరగొనడంతోనే కేసులు బనాయించామని ఆయన చెప్పకనే చెప్పారని ఆమె వివరించారు. అలాగే ఏసీబీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం రోశయ్యపై ఎలాంటి చర్యా తీసుకోకపోగా.. ప్రమోషన్ ఇచ్చి తమిళనాడు గవర్నర్‌గా నియమించారన్నారు. ఈ ఘటన కూడా కాంగ్రెస్ పెద్దల వైఖరిని తేటతెల్లం చేస్తోందన్నారు.
నేతల ప్రవర్తనతో మహానేత మరణంపై అనుమానాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, సీబీఐ వేధింపులు చూస్తుంటే దివంగత నేత వైఎస్ మరణంపై అనుమానాలు బలపడుతున్నాయని విజయమ్మ అన్నారు. ఆ రోజు కొత్త హెలికాప్టర్ ఉన్నా పాత హెలికాప్టర్ తీసుకురావడం, మార్గం చూపే మ్యాప్‌లు అందులో లేకపోవడం, రెండు గంటలపాటు హెలికాప్టర్ అక్కడే గాలిలో చక్కర్లు కొట్టడానికి సరిపడా ఇంధనమున్నా కూలిపోవడం, సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ తుపాకీలో తూటాలు కనిపించకపోవడం, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో కొన్ని నిమిషాల సంభాషణే ఉండడం.. ఇలా అనేక అనుమానాలు సీబీఐ విచారణలో నివృత్తి కాలేదన్నారు. ‘‘అయినప్పటికీ సీబీఐ విచారణ సవ్యంగానే జరిగిందని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. ఒక ఎంపీ అంటారు తన వద్ద బ్లాక్ బాక్సు రికార్డు ఉంది, వినిపిస్తానంటారు. ముఖ్యమంత్రి అందులో ఎలాంటి అనుమానాలూ లేవంటారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.. అధికారదాహంతో మేమే చంపుకున్నామని చెపుతారు. వారి మాటలను బట్టే ఆయన మరణంపై మరింత అనుమానం పెరుగుతోంది’’ అని విజయమ్మ అన్నారు.
మీ ఓట్లు వైఎస్సార్‌పైనే: ‘‘పేదల కోసం, రైతుల కోసం పదవులు త్యజించిన ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు వేసే ప్రతి ఓటు వైఎస్సార్‌కు వేసినట్లే. మీరు వేసే ప్రతి ఓటు జగన్‌కు వేసినట్లే. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుళ్లు, కుతంత్రాలను కడిగేసేందుకు మీ ఓటే ఆయుధం. జైలుగోడలు బద్దలయ్యేలా ఉప ఎన్నికల్లో మీరు తీర్పు చెప్పాలి. మా కుటుంబానికి అండగా నిలిచిన వారిని గెలిపించండి’’ అంటూ విజయమ్మ ప్రజలను అభ్యర్థించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆ హెలికాప్టర్‌లో ఎందుకు ఎక్కలేదు: షర్మిల‘‘నాన్న తెచ్చిన అధికారాన్ని వాడుకుని కాంగ్రెస్ పెద్దలు మా కుటుంబాన్నే వేధిస్తున్నారు. సీబీఐ విచారణ పేరుతో జగనన్నను జైలుపాలు చేశారు. సింహం బోనులో ఉన్నా సింహమే అని వారు గుర్తెరిగేలా ఉప ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి’’ అని వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సీబీఐ.. జగన్ కేసులో ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘నాన్న సెప్టెంబర్ 2న హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లాకు పయనమయ్యారు. ఆ రోజు ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా నాన్నతో కలిసి ఆయన సొంత జిల్లాకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన వెళ్లలేదు. మరి హెలికాప్టర్ ప్రమాదం తెలిసే వెళ్లలేదా? తెలియక వెళ్లలేదా?’’ అని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment