YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

వైఎస్ విజయమ్మ, షర్మిలకు బ్రహ్మరథం

* వైఎస్ విజయమ్మ, షర్మిలకు బ్రహ్మరథం
* మాచర్ల, ప్రత్తిపాడు రోడ్‌షోలకు పోటెత్తిన జనం
* వెల్లువలా తరలివచ్చిన మహిళాలోకం
* సార్‌ని పోగొట్టుకొని మీ దగ్గరికొచ్చా
* జగన్‌బాబును జైల్లో పెట్టడంతో మీ దగ్గరికొచ్చా
* గద్గద స్వరంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రసంగం
* అభ్యర్థులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సుచరితలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి
* ఓటుతో జగనన్నకు జరిగిన అన్యాయాన్ని చాటిచెప్పాలని షర్మిల పిలుపు


గుంటూరు, న్యూస్‌లైన్ : జనకెరటం ఉప్పొంగింది. దారులన్నీ కిక్కిరిసి పోయాయి. ఎటు చూసినా కనుచూపు మేర ఇసుకేస్తే రాలన్నంత రీతిలో జనమే. అడుగడుగున మహిళల నీరాజనాల నడుమ జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ రోడ్ షో సాగింది. రాజకీయ రాజధానిగా ఖ్యాతి గాంచిన గుంటూరు జిల్లా రాజకీయ చరిత్రలో మరో నూతన శకం ఆవిష్కృతమైంది. స్వాతంత్య్రం అనంతరం ఏ రాజకీయ నేతల బహిరంగ సభలకు గానీ, రోడ్‌షోలు గానీ జరగని రీతిలో అశేషజనం పోటెత్తింది. మాచర్ల, ప్రత్తిపాడు రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి.

దారి పొడవునా ప్రజలు పట్టుబట్టిన అభిమానంతో కాన్వాయ్‌ను ఆపుతుండటంతో నిర్ణీత షెడ్యూల్ కన్నా రోడ్‌షో ఆలస్యంగా సాగింది. అయినప్పటికీ ప్రజలు మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా ఆ దివంగత మహానేత సతీమణిని చూడాలన్న ఆశతో కాన్వాయ్ వెంట పరుగులుతీశారు. మరో వైపు గుంటూరు జిల్లాతో మహానేతకు ఉన్న అనుబంధాన్ని వివరించడంతోపాటు ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో దివంగత నేత చేసిన అభివృద్ధి పనులు వివరించి, ఆ నేత మరణంతో ఆగిన పనులను వివరించి జగన్ ఇవన్ని తప్పక పూర్తి చేస్తారని మాట ఇచ్చారు.సార్‌ను పోగొట్టుకున్నాను.జగన్ బాబును జైల్లో పెట్టారు. ఇంతటి బాధలోనూ మీ దగ్గరకు వచ్చానంటూ విజయమ్మ గద్గగ స్వరంతో అన్నారు. విజయమ్మతోపాటు దివంగత మహానేత కుమార్తె షర్మిల కూడా రోడ్‌షోలో పాల్గొన్నారు.

పోలీసు నిఘా వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ప్రత్తిపాడు,మాచర్ల నియోజకవర్గంలో జనసంద్రం పోటెత్తారు. శనివారం రాత్రి నరసరావుపేట చేరుకున్న వై.ఎస్.విజయమ్మ ఆదివారం ఉదయం 9.40 గంటలకు రోడ్‌షోకు బయలుదేరారు. తొలుత మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి చేరుకున్న విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయమని చెబుతూ ముందుకు సాగారు. అనంతరం నరమాలపాడు గ్రామం మీదుగా దుర్గికి చేరుకున్న విజయమ్మకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ఉప్పలపాడుమీదుగా వెల్దుర్తికి చేరుకున్న విజయమ్మకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా రోడ్‌షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి విజయమ్మ, షర్మిలలు ప్రసంగించారు. ఫ్యాను గుర్తుకు ఓటేస్తే రాజన్నకు ఓటేసినట్లే... ఫ్యాను గుర్తుకు ఓటేస్తే జగన్‌కు ఓటేసినట్లే. మనపార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయానికి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఉద్వేగంగా ప్రసంగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, టీడీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గానికి పయనమయ్యారు.

ప్రత్తిపాడు జనసంద్రం.. ప్రత్తిపాడు ప్రధాన రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. నాలుగు రోడ్లపై కిలో మీటర్ల పొడవునా ప్రజలు బారులు తీరారు. అశేష జనసంద్రం నడుమ నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోకి విజయమ్మ ప్రవేశించి రోడ్‌షో నిర్వహించారు. తొలుత గుంటూరు రూరల్ మండలంలోని నల్లపాడు వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు,ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడ రోడ్‌షో నిర్వహించిన అనంతరం అంకిరెడ్డిపాలెం చేరుకుని గ్రామంలో రోడ్‌షో నిర్వహించి, ఆ తరువాత ఏటుకూరు, వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట, కోయవారిపాలెం మీదుగా ప్రత్తిపాడు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాన్వాయ్ పర్యటించిన మార్గమంతా అశేష జనసంద్రంతో నిండిపోయింది. అనంతరం ప్రత్తిపాడు ప్రధాన సెంటర్‌లో షర్మిల, విజయమ్మలు ఉద్వేగంగా ప్రసంగించారు. ఫ్యాను గుర్తుకు ఓటుతో మన పార్టీ అభ్యర్థి సుచరితను గెలిపించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో తొలిసారిగా విజయమ్మ పర్యటించిన నేపథ్యంలో జిల్లాలోని 17 నియోజకవర్గాల నుంచిపార్టీ ముఖ్యనేతలు రోడ్‌షోకు వెల్లువలా తరలి వచ్చారు. ప్రత్తిపాడులో రోడ్‌షో ముగించుకుని ప్రజలకు అభివాదం చేస్తూ విజయమ్మ ప్రకాశం జిల్లాకు పయనమయ్యారు.

జిల్లాతో ప్రత్యేక అనుబంధం.. గుంటూరు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందని మహానేత వైఎస్ తనకు చెప్పేవారని వై.ఎస్.విజయమ్మ రోడ్‌షోలో చెప్పారు. ‘రాజకీయంగా చైతన్యవంతమైన ఈ జిల్లా ప్రజలు పాదయాత్రలకు దివంగత వైఎస్సార్ వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్టారు. ఆయన చేసిన ప్రతిపనిని, ప్రతి కార్యక్రమాన్ని ఆదరించి ప్రేమాభిమానాలు కురిపించారు. ఆయనా అదే రీతిలో సీఎం అయ్యాక జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషిచేశారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంతో ఆయనకు అనుబంధం ఉంది. సీఎం అయ్యాక దాదాపు ఏడు సార్లు మాచర్లకు వచ్చారు. నాగార్జున సాగర్ హైలెవల్‌బ్రిడ్జి ప్రారంభోత్సవానికి, సాగర్ స్వర్ణోత్సవాలకు, అనుపు, కొప్పునూరు ఎత్తిపోతల పథకాల శంకుస్థాపనకు, కొత్తపల్లిలో ఇందిరమ్మ ఫేజ్-2 ప్రారంభానికి, వరికపూడిశెల పథకం శంకుస్థాపనకు, కంభంపాడు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి, పల్లె బాటకు ఇలా అనేక పర్యాయాలు ఆ మహానేత జిల్లాకు వచ్చారు.

సాగర్ నీటితో మాచర్ల, గురజాల నియోజకవర్గాల సాగు, తాగునీరు సమస్యను తీరుస్తానని జగన్ మాట ఇచ్చారు. గతంలో వైఎస్ చేసిన విధంగానే జగన్ కూడా తప్పక చేసి తీరుతారు. 2004లో జిల్లాలోనే 19 నియోజకవర్గాలకు గాను 18 నియోజకవర్గాల్లో ఆయన నాయకత్వాన కాంగ్రెస్‌పార్టీని గెలిపించిన తీరును వైఎస్ పదేపదే చెప్పేవారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో ఈ జిల్లాకు అభివృద్ధిలో ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. అప్పాపురం ఇరిగేషన్ చానల్‌కు రూ.70 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయగా సాగర్ ఆయకట్టు ఆధునికీకరణ రూ. 3వేల కోట్లు కేటాయించారు. ప్రత్తిపాడులో 25వేల ఇందిరమ్మ ఇళ్ళు మంజూరుచేశారు. వాగుల అభివృద్ధికి రూ. 150 కోట్లు కేటాయించారు’ అని విజయమ్మ చెప్పారు. ఈ విషయాలను ప్రజలు గుర్తించాలని కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!