YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 4 June 2012

కాంగ్రెస్‌ను వీడని ‘కుట్ర’

సంక్షోభంలో నిండా కూరుకుపోయినప్పుడల్లా ప్రత్యర్థులపై నిందలేయడం, కుట్ర సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి జనంలో గందరగోళం సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. ఇందిరాగాంధీ కాలంనుంచీ ఆ పార్టీకి సంక్రమించిన ఈ జాడ్యం ఇంకా వదల్లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోమవారం సోనియాగాంధీ చేసిన ప్రసంగం మరోసారి తేటతెల్లం చేసింది. యూపీఏ ఈమధ్యే మూడేళ్లు పూర్తిచేసుకుంది. ఈ మూడేళ్లలోనూ సాధించిన ప్రగతేమైనా ఉంటే అది కుంభకోణాల్లో మాత్రమే. వరసగా రెండోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు యూపీఏ అంతకుమించి ఒరగబెట్టింది శూన్యం. 

‘ఆమ్ ఆద్మీ’ పేరుమీద తాము గద్దెనెక్కామన్న సంగతిని కూడా విస్మరించి వారిని మరింత కుంగదీసే నిర్ణయాలు తీసుకుంటున్న సర్కారు, ఆ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారిపైన మాత్రం సహజంగానే కత్తిగడుతోంది. అందులో భాగంగానే సోనియాగాంధీ విపక్షాలపైన, పౌరసమాజం సభ్యులపైన లేనిపోని ఆరోపణలు చేశారు. ఈమధ్యే అన్నా హజారే బృందం సభ్యులు కేంద్రమంత్రివర్గం అవినీతిలో కూరుకు పోయిందని ఆరోపణలు చేశారు. తమ ఆరోపణలన్నిటికీ వారు ఆధారాలను సైతం చూపారు. నిష్కళంకులుగా పేరుప్రఖ్యాతులున్న సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి తాము చేసిన ఆరోపణల్లోని నిజానిజాలను తేల్చాలని వారు సవాల్ చేశారు. కేంద్రంలోని 14 మంది మంత్రులు, స్వయంగా ప్రధాని చూస్తున్న వివిధ శాఖల్లో అవినీతి తాండవం చేస్తున్నదని వారి ఆరోపణ. దీనిపై ప్రభుత్వం నుంచి సమగ్రమైన జవాబు రాలేదు. 

ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రధాని మన్మోహన్ చేసిన శపథం మినహా ఇతర మంత్రులు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. పౌరసమాజం వెల్లడించిన ఆధారాల్లోని నిజానిజాలపైనా, తమ సచ్ఛీలతపైనా సవివరమైన సమాధానం ఇవ్వడం మాని, ఎదురు ఆరోపణలకే కాంగ్రెస్ సిద్ధపడిందని సోనియాగాంధీ తాజా ప్రసంగం స్పష్టంచేస్తోంది. ఇందిరాగాంధీ కూడా ఇంతే. సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాల ప్రజలు రోడ్డెక్కినప్పుడల్లా ఆమెకు ‘కుట్ర’ కనబడేది. ‘విదేశీ హస్తం’ కనబడేది. తనను కూలదోయడానికి కుట్ర జరుగుతున్నదని, ఇందులో విదేశీ హస్తం కూడా ఉన్నదని ఆమె ఆరోపించేవారు. సోనియాగాంధీ ‘విదేశీ హస్తం’ మాట అయితే ఉపయోగించడం లేదు. అంతవరకూ ఈ దేశ ప్రజలు అదృష్టవంతులు. 

యూపీఏ గద్దెనెక్కి మూడేళ్లయిన సందర్భంగా ఈమధ్యే విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్టులో యూపీఏ చెప్పుకున్న గొప్పలు అన్నీ ఇన్నీ కావు. దారిద్య్రం గణనీయంగా తగ్గిపోయిందని, ఆహార ధాన్యాల దిగుబడి విపరీతంగా పెరిగిందని, రైతుల కష్టానికి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయని... ఇలా వరసబెట్టి విజయాల చిట్టా సాగిపోయింది. 

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడుగానీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడంలోగానీ, పండిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోగానీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఎక్కడిదాకానో అవసరంలేదు మన రాష్ట్ర రైతుల దుస్థితి చూసినా తెలుస్తుంది. రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఈ మూడేళ్లలో కోకొల్లలు. చివరకు ఉలుకూ, పలుకూ లేని సర్కారు వైఖరిని నిరసిస్తూ సాగు సమ్మెకు కూడా రైతులు తెగించారు. 

ఇన్నిచేసినా కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు తన వైఖరిని సమీక్షించుకోలేదు సరికదా... ఉపాధి హామీ పథకం కారణంగా కూలీలు లభ్యంకాకపోవడం వల్లే రైతులు ఈసారి పంటలు వేయడం మానుకున్నార ంటూ తప్పుడు ప్రచారానికి దిగింది. సర్కారు వైఖరితో దేశవ్యాప్తంగా రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, చివరకు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క రైతులే కాదు... అన్ని వర్గాల ప్రజలకూ యూపీఏ చేదు అనుభవాన్నే చూపింది. 

మరోపక్క కుంభకోణాలు మాత్రం అంతూ దరీ లేకుండా సాగిపోతూనే ఉన్నాయి. ఏ మాత్రమైనా ప్రగతి కనబడిందంటే అది స్కాముల్లోనే. రూ.లక్షా 76 వేల కోట్ల 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలుకొని కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, ఎస్-బ్యాండ్ కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, చివరకు ఇటీవల బయటపడిన లక్షా 82 వేల కోట్ల బొగ్గు కుంభకోణం... వీటికి మాత్రం తక్కువేం లేదు. మరోపక్క రూపాయి మారకం విలువ నానాటికీ దిగజారుతోంది. వృద్ధి రేటు తొమ్మిదేళ్ల కనిష్టస్థాయికి... అంటే 6.5 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం ఆనాటికానాటికి పెరిగిపోతోంది. ఈ పరిస్థితికంతటికీ కారణం అంతర్జాతీయ పరిస్థితులేనని యూపీఏ పెద్దలు గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. 

సోనియాగాంధీ సైతం అదే బాణీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రపంచాన్ని చూపించి తమ నిర్వాకాన్ని దాస్తున్నారు. మరి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ఇక్కడ మాత్రం పెట్రోల్ ధరను ఎందుకు చుక్కలనంటించారో ఆమె వివరణనివ్వాలి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుంది గనుక అంతా సర్దుబాటు అయిపోతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నమ్మబలుకు తున్నారు. 

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రదిష్టపాలు చేయడం కోసం పారిశ్రామికవేత్తలను వేధిస్తున్న తీరును, వారిని జైళ్లకు పంపుతున్న తీరును గమనిస్తే... ప్రకృతి మాత్రమే సహకరిస్తే సరిపోదని, యూపీఏ నేతల్లోని కుట్ర మనస్తత్వం కూడా అంతరించాలని, అప్పుడు మాత్రమే దేశ ఆర్ధిక వ్యవస్థ చక్కబడుతుందని ఎవరైనా అంగీకరిస్తారు. దేశాన్ని పాలించమని రెండోసారి అధికారం కట్టబెడితే తమ నిర్వాకంతో నాశనం చేసిన యూపీఏ నేతలు... తాము చేస్తున్న కుంభకోణాలను, కుట్రలను విడనాడక, వాటిని ఎత్తిచూపుతున్నవారినే కుట్రదారులని దూషించడం అతి పెద్ద కుట్ర. దీన్ని ప్రజలు ఎల్లకాలమూ సహిస్తారని భావించడం భ్రమే అవుతుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!