YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 15 June 2012

ఫ్యాన్ ప్రభంజనంతో ఢిల్లీ పెద్దల్లో కలవరం

ఫ్యాన్ ప్రభంజనంతో ఢిల్లీ పెద్దల్లో కలవరం 
స్పందించేందుకు ఏఐసీసీ నిరాకరణ
రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదికలు కోరిన కాంగ్రెస్ హైకమాండ్
త్వరలో కీలక మార్పులు!

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకే ఒక్క లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఘోర ఓటమితో హస్తిన పెద్దలు హతాశులయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అగ్నిపరీక్షలాంటి ఉప పోరులో ఘోరంగా ఓడిపోవడం వారికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. 

మరీ ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని ఊహించని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు... రాష్ట్ర నాయకత్వం తమ పుట్టి ముంచుతోందనే అభిప్రాయానికొచ్చారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వరుస పరాజయాలతో ఇప్పటికే క్రమంగా కోల్పోతూ వస్తున్న ప్రతిష్టను ఈ ఎన్నికలతోనైనా కొంతవరకు పునరుద్ధరించుకోవాలని గట్టిగా భావించింది. ఆ మేరకు ముందస్తు కసరత్తులు ప్రారంభించిన అధిష్టానం అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రచారం వరకు ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. 

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను కాకుండా మరో కేంద్ర మంత్రి వయలార్ రవిని రాష్ట్రానికి పంపి ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేలు, పీసీసీ నేతలతో నియోజకవర్గాలవారీగా ప్రత్యేక సమన్వయ కమిటీలను నియమించి పార్టీ అభ్యర్థుల అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నాలు చేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించి పార్టీ విజయానికి అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించింది. ప్రచార పర్వంలో ఆజాద్, వయలార్‌లను సైతం రంగంలోకి దింపి ప్రచారం చేయించింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డింది. ఇంతాచేస్తే కేవలం రెండు సీట్లలో పార్టీ గెలుపొందడం, మిగతా స్థానాల్లో చాలాచోట్ల పార్టీ అభ్యర్థులు డిపాజిట్లను సైతం కోల్పోవడంతో కంగుతింది. 

‘చిరు’గాలితో లాభం లేదు!

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతిలో పార్టీ 17వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోవడం కాంగ్రెస్ పెద్దలను విస్మయానికి గురిచేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిరంజీవి చరిష్మా పనిచేయకపోవడం అధిష్టానం పెద్దల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇకపై చిరంజీవిని నమ్ముకుంటే లాభం ఏమీ ఉండబోదని ఈ ఫలితంతో తమకు తెలిసొచ్చిందని ఏఐసీసీ పెద్దల్లో ఇద్దరు మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన మెజార్టీలు కాంగ్రెస్ పెద్దలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో సగానికిపైగా 20, 30 వేల మెజారిటీని సాధించడం చూస్తేనే రాష్ట్రంలో వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ఎంత విస్తృతస్థాయిలో ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చని వారంటున్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 2.91 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందడం వారిని నివ్వెరపాటుకు గురిచేసింది. ఉప ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు ఏఐసీసీ పెద్దలెవరూ ముందుకు రాలేదు. వయలార్ రవి మాత్రం ఫలితాలు పార్టీ కళ్లు తెరిపించాయంటూ వ్యాఖ్యానించారు. పార్టీ ఘోర ఓటమిపై ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర ముఖ్య నేతలను నివేదికలు కోరినట్లు తెలిసింది. విదేశాల్లో ఉన్న ఆజాద్ వచ్చిన వెంటనే వయలార్‌తో కలిసి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారని, కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. దీనికి ముందస్తు కసరత్తుగా వయలార్ రెండురోజుల్లో రాష్ట్రానికి వచ్చి ఫలితాలపై పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని తెలుస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!