YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 16 June 2012

తిరుపతిలో పరపతి గోవిందా

కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైన తిరుపతి ఓటమి 
‘రాజ్యసభ’ కోసం ఖాళీ చేసిన సీటు చిరుకు ప్రతిష్టాత్మకం 
సొంత జిల్లాలోని నియోజకవర్గం కావడంతో కిరణ్‌కు ప్రతిష్టాత్మకం 
సర్వశక్తులూ ఒడ్డినా గట్టెక్కలేకపోయిన కాంగ్రెస్ 
వెయ్యి నోట్లు కురిపించి, రూ. కోట్ల పనుల హామీలిచ్చి...
భారీగా బలప్రయోగం చేసినా ఫలితం శూన్యం 
చిరు ‘దత్తత’ తీసుకుంటానన్నా నమ్మని జనం 
హేమాహేమీల ప్రచారాలూ పనిచేయని వైనం 
వైఎస్సార్ కాంగ్రెస్‌కే తిరుపతి ఓటర్ల పట్టం 
గతంలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఆధిక్యం

తిరుపతి, న్యూస్‌లైన్: వెయ్యి నోట్ల వర్షం.. నాయకులకు తాయిలాలు.. ప్రజలకు హామీలు.. పోలీసు బలప్రయోగం.. అధికార దుర్వినియోగం.. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఓటుకు రెండు వేలిస్తామంటూ అడ్డుకోవటం.. పోలింగ్ సాగుతున్నంత సేపూ నేరుగా కేంద్రాల వద్ద ఓటర్లకు అదనంగా వెయ్యి నోట్ల పంపకం... ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ తిరుపతి అసెంబ్లీ స్థానం ‘చే’జారిపోవటంపై కాంగ్రెస్‌లో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. పార్టీ మహామహులు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ.. ప్రతిష్టాత్మకమైన తిరుపతి నియోజకవర్గంలో ఓడిపోవటం కాంగ్రెస్ నేతలకు అంతుబట్టటం లేదు. 

రాజకీయ చైతన్యం ఉన్న తిరుపతి నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు తక్కువగా అంచనా వేయటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. నిజానికి ఈ స్థానం అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, ఇటు చిరంజీవికి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. తిరుపతి సీఎం సొంత జిల్లా చిత్తూరు పరిధిలోనిది కావటమే కాక.. చిరంజీవి రాజ్యసభకు వెళ్లటానికి రాజీనామా చేసిన కారణంగా ఏర్పడిన ఖాళీ. సొంత జిల్లాలో ఓడిపోతే ఆ ప్రభావం తనపై ఉంటుందని ఆందోళన చెందిన ముఖ్యమంత్రి మిగతా నియోజకవర్గాలకన్నా ఇక్కడ విజయం కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అధికార పార్టీ.. ఈ నియోజకవర్గానికి మొత్తంగా రూ. 400 కోట్ల మేర అభివృద్ధి పనులు ప్రకటించారు. హామీలకు తోడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులను రంగంలోకి దించి ప్రచారం చేయించారు. చిరంజీవి నాలుగైదు సార్లు, సీఎం మూడు సార్లు తిరుపతిలో ప్రచారం చేశారు. ప్రతి సభలోనూ జగన్‌పై నాయకులు దుమ్మెత్తిపోశారు. అయినప్పటికీ జగన్‌ను ప్రజలు ఆద రిస్తున్నారన్న విషయం గమనించి.. లక్షా 30 వేల మందికి లెక్కగట్టి డబ్బులు పంపిణీ చేశామని ఫలితాల అనంతరం కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. పోలింగ్‌కు ముందు రోజు తమ ఓటింగ్‌ను మరింత బలం చేసుకునే లక్ష్యంతో తిరుపతి అర్బన్ పంచాయతీలు, నగరంలోని మురికి వాడల్లో సుమారు 50 వేల మందికి అదనంగా ఓటుకు మరో రూ. 1000 ఇచ్చి హస్తానికి ఓటు వేయించే ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించలేదని.. దీనికి చిరంజీవి, కిరణ్‌కుమార్‌రెడ్డిల వైఖరే కారణమని కాంగ్రెస్ స్థానిక నేతలు విశ్లేషిస్తున్నారు. 

చిరు ‘దత్తత’ మాటలూ నమ్మలేదు... 

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగిన 18 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాలకు ఒక కారణంతో ఎన్నికలు జరగ్గా.. తిరుపతి మాత్రం చిరంజీవి రాజీనామాతో జరిగింది. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ అవిశ్వాస తీర్మానంలో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అనర్హతకు గురైన కారణంగా 17 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే తిరుపతిలో మాత్రం ఎలాంటి కారణంగా లేకుండా తన రాజ్యసభ స్థానం కోసం చిరంజీవి రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. 

అయితే ప్రచారం సందర్భంగా ఆ విషయాన్ని చెప్పకుండా జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ స్వార్థం వల్ల, అధికార దాహం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయంటూ చిరంజీవి ప్రతి బహిరంగ సభలోనూ ఊదరగొట్టారు. తాను రాజీనామా చేసినా ఇక్కడే శాశ్వత సభ్యుడిగా ఉంటాననీ, తిరుపతిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చిరంజీవి చెప్పారు. కానీ.. చిరంజీవి మాటలను జనం నమ్మలేదని ఫలితాలతో రూఢీ అయ్యింది. తన కు రాజకీయ భిక్ష పెట్టిన తిరుపతిని వదిలిపెట్టిన కారణంగానే ప్రజలు ఆయనకు గట్టి షాక్ ఇచ్చారన్న వాదన కాంగ్రెస్‌లో బలంగా వినిపిస్తోంది. తనపై ఎన్నో ఆశలు పెట్టుకుని పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్న నేపథ్యంలో తిరుపతి ఓడిపోతే పార్టీలో తన ప్రాభవం తగ్గుతుందన్న ఆందోళనతో చిరంజీవి ఇక్కడ ఏకంగా నాలుగుసార్లు ప్రచారం చేశారు. ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి డిమాండ్ చేయటం కూడా సులభమవుతుందని చిరంజీవి సన్నిహితులు అంచనా వేశారు. కానీ.. అవేవీ ఫలించలేదు. 

అన్ని రౌండ్లలోనూ ఆధిక్యమే... 

కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ చివరకు గతంలో చిరంజీవికి ఇచ్చిన మెజారిటీకన్నా ఎక్కువగా 17,975 ఓట్ల భారీ మెజారిటీతో భూమన కరుణాకర్‌రెడ్డిని ప్రజలు గెలిపించారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 16 ఓట్ల ఆధిక్యత వచ్చింది. రెండో రౌండ్‌లో 133 ఓట్ల ఆధిక్యత సాధించిన ఫ్యాన్.. ప్రతిరౌండ్‌లోనూ పెరుగుతూనే వచ్చింది. ఎనిమిదో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుణాకరరెడ్డి మెజారిటీ 6,000 దాటడంతో విజయం ఖరారైంది. తర్వాత 18వ రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలో భారీ ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. 19వ రౌండ్ ముగిసే సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్‌కు 59,195 ఓట్లు, కాంగ్రెస్‌కు 41,220, టీడీపీకి 30,453 ఓట్లు లభించాయి. ప్రతి రౌండులోనూ కరుణాకర్‌రెడ్డి మెజారిటీ పెరగటాన్ని బట్టి తిరుపతి నియోజకవర్గంలోని ప్రతి ప్రాంత ఓటరూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఆదరించారన్న విషయం అర్థమైందని, కొన్ని ప్రాంతాలు ఓటు వేయవని, అలాగే కరుణాకర్‌రెడ్డికి ఓటు వేస్తారని భావించిన కాలనీల్లో ఓటు వేయకుండా ప్రయత్నాలు చేసిన సందర్భాలను విశ్లేషించుకుంటూ నాయకులు మాట్లాడుతున్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!