YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 15 June 2012

ప్రజాగ్రహానికి నిదర్శనం

సమర్థ, సంక్షేమ పాలన అందించే సత్తా జగన్‌కు ఉందని జనం విశ్వసించారు
ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైంది.. ప్రజల హక్కుల పరిరక్షణ బాధ్యతను ప్రతిపక్షం విస్మరించింది
జగన్ బయటకు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు ఆపలేవు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల ఫలితాలు కేవలం సానుభూతి పవనాల ఫలితమే కాదని.., మహానేత రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యల ఫలితంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి చెప్పారు. సమర్థ, సుస్థిర, సంక్షేమ పాలన అందించే సత్తా జగన్‌కు ఉందని ప్రజలు విశ్వసించారని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శుక్రవారం పలు జాతీయ ఛానళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. ఆ ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పిన ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
గత ఏడాది కడప ఉప ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించినప్పుడు.. వైఎస్ సొంత ప్రాంతం కాబట్టే విజయం సాధ్యమైందని కాంగ్రెస్, టీడీపీలు వ్యాఖ్యానించాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అవే ఫలితాలు పునరావృతమయ్యాయి.
జగన్ గత రెండున్నరేళ్లుగా ప్రజల్లోనే ఉన్నారు. కుటుంబంతో గడిపిన సమయంకంటే.. ప్రజల్లో ఉన్నదే ఎక్కువ. ప్రజలు ఆయన్ని కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడలేదు. వారి అన్నగా, తమ్ముడిగా, మనవడిగా... సొంత కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు. వారి సొంత మనిషికి అండగా నిలిచారు.
ఫలితాలు వచ్చిన తర్వాత జైల్లో జగన్‌ను కలిశాం. ఆయన చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. ఫలితాలపట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఎమ్మెల్యే పదవులను వదులుకున్న సుభాష్‌చంద్రబోస్, కొండా సురేఖ, ప్రసాదరాజు ఓడిపోవడంపట్ల బాధపడ్డారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటువైపు ఉండాలనే విషయాన్ని పార్టీ నాయకులు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ప్రతి కుటుంబానికి 30 కిలోల బియ్యం, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు.. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న హామీలు. వైఎస్ మరణం తర్వాత ఆ హామీలను కాంగ్రెస్ పార్టీ గాలికొదిలేసింది. అప్పటికే అమల్లో ఉన్న పలు సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసింది. సర్కారు అసమర్థత వల్ల ధనికుల నుంచి పేదల వరకు.., పట్టణవాసుల నుంచి గ్రామీణుల వరకు... అందరూ తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సర్కారు మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యతను ప్రతిపక్షం విస్మరించింది. ప్రజల పక్షాన నిలిచింది వైఎస్సార్‌సీపీ మాత్రమే. అందుకే వైఎస్సార్ సీపీని ప్రజలు విశ్వసించారు. ధాన్యానికి మద్దతు ధర కోసం మొదలు పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జగన్ ఒక్కరే పోరాటం చేశారు. అందుకే ప్రజలు జగన్ పక్షాన నిలిచారు.

జగన్ అరెస్టుకు ముందే భారీ విజయాన్ని ఊహించాం. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించడంపట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. జగన్ దోషి కాదని ప్రజలు తీర్పు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు సమాధానమిచ్చారు. దేశంలో ఏ రాజకీయ నేత ఇంటి మీదా సీబీఐ దాడులు జరగలేదు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షసాధింపే. చంద్రబాబు అక్రమాస్తుల మీద అన్ని ఆధారాలతో విజయమ్మగారు కోర్టుకు వెళితే.. సీబీఐ విచారణ జరగలేదు. ఒక ఎమ్మెల్యే లేఖ రాయడం, జగన్ మీద సీబీఐ విచారణ జరగడం.. రాజకీయ వేధింపుల్లో భాగమే.

ఈ ఫలితాలే పునరావృతమైతే 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 200కు పైగా స్థానాలు రావడం ఖాయం.
జగన్ బయటకు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు ఆపలేవు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా.., దేశవ్యాప్తంగా పర్యటించడం ఖాయం. జగన్ వచ్చేవరకు పార్టీకి విజయమ్మ నాయకత్వం వహిస్తారు.
నేను రాజకీయ నేతను కాదు. జగన్ భార్యగానే నా పాత్ర ఉంటుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!