YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 15 June 2012

చేతిలో సైకిల్

రామచంద్రపురం, నరసాపురం ఫలితాలే నిదర్శనం
టీడీపీకి డిపాజిట్లు గల్లంతు, ఆ మేరకు కాంగ్రెస్‌కు ఓట్లు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్ బంధం ఈ ఉప ఎన్నికల్లో మరింతగా చిక్కబడింది! ఎంతగా అంటే.. కాంగ్రెస్ కోసం టీడీపీ తమ డిపాజిట్లను కూడా త్యాగం చేసేంతగా! ఒక లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తన ఓట్లను వీలైనంతగా కాంగ్రెస్ పార్టీకి వేయించడం ద్వారా ఆ పార్టీని గెలిపించేందుకు యథాశక్తి పాటుపడింది. ఈ వైనానికి రామచంద్రపురం, నరసాపురం నియోజకవర్గాల ఫలితాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రెండు చోట్లా టీడీపీ డిపాజిట్‌ను కోల్పోగా, ఆ పార్టీ నుంచి బదిలీ అయిన ఓట్ల సాయంతో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టెక్కారు. 

రామచంద్రపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వచ్చిన ఓట్ల కంటే ఈసారి దాదాపు తొమ్మిది వేల ఓట్లు ఎక్కువగా సాధించుకున్నారు. అయినా కేవలం కాంగ్రెస్, టీడీపీ పకడ్బందీ మ్యాచ్‌ఫిక్సింగ్ కారణంగా ఆయన ఓటమి పాలయ్యారు. బోస్‌కు 2009లో 56,589 ఓట్లు రాగా ఈసారి 65,373కి పెరిగాయి. కానీ టీడీపీకి 2009లో 23,252 ఓట్లు రాగా, ప్రస్తుతం కేవలం 6,256 ఓట్లతో డిపాజిట్ కూడా కోల్పోయింది! టీడీపీకి తగ్గిన ఈ ఓట్లు ఈసారి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ కారణంగానే కాంగ్రెస్ 11,919 మెజార్టీతో గెలిచింది. అలాగే నరసాపురంలో కూడా టీడీపీ తన ఓట్లను భారీగా కాంగ్రెస్‌కు వేయించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకున్నట్టు స్పష్టమవుతోంది. సుదీర్ఘ కాలంపాటు టీడీపీలో ముఖ్య నేతగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి, ఆ పార్టీ తరఫున నరసాపురంలో పోటీ చేశారు. ఆయనతో పాటే స్థానిక టీడీపీ నేతలు, శ్రేణులు కూడా పీఆర్పీలోకి మారారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఎన్నికల్లో అక్కడ టీడీపీ 10,841 ఓట్లు సాధించింది. అలాంటిది, ఈ మూడేళ్లలో స్థానిక నాయకత్వాన్ని, క్యాడర్‌ను పటిష్టపరుచుకుని కాస్తోకూస్తో మెరుగైన ప్రదర్శన కనబరచాల్సింది పోయి.. తాజా ఉప ఎన్నికలో టీడీపీ కేవలం 8,813 ఓట్లకే పరిమితమైంది. అది పథకం ప్రకారం తన ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి బదలాయించిందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఫలితంగా నరసాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాదరాజు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

వారిద్దరూ టీడీపీ పాతకాపులే: రామచంద్రాపురం, నరసాపురం కాంగ్రెస్ అభ్యర్థులు తోట త్రిమూర్తులు, కొత్తపల్లి సుబ్బారాయుడు ఇద్దరూ టీడీపీ మాజీ నేతలే. ఆ కారణంగానే ఇరు పార్టీల పెద్దల మ్యాచ్‌ఫిక్సింగ్‌కు స్థానిక టీడీపీ కార్యకర్తల స్థాయి నుంచీ కూడా మంచి సహకారం లభించిందని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. నిజానికి రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కాబట్టి మామూలుగానైతే ఆ సామాజిక వర్గ ఓట్లలో చీలిక ఉండాలి. కానీ అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థులకు 2009లో కంటే ఈసారి ఓట్లు గణనీయంగా తగ్గి, అదే మోతాదులో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి గంపగుత్తగా పడ్డట్టు ఓటింగ్ సరళి స్పష్టం చేస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!