YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 13 June 2012

ఉత్పత్తి లక్ష్యమే ఉసురు తీసిందా..?

అధిక ఉత్పత్తి లక్ష్యమే కార్మికులు, ఉద్యోగుల ఉసురు తీసిందా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది. స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్టులో ఆగమేఘాలమీద ఉత్పత్తి ప్రారంభించాలన్న యాజమాన్య ఆతృతే ఈ భారీ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. కార్మికుల భద్రతను పూర్తికి గాలికొదిలేయడంతో పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. ఎస్‌ఎంఎస్-2లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు యాజమాన్యం బుధవారం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హీట్‌లు తీయాలని నిర్ణయించారు. దీనికోసం అక్కడి ఆక్సిజన్ ప్లాంట్‌నుంచి ఆక్సిజన్‌ను బ్లో చేయాల్సి ఉంది. హీట్ ఉత్పత్తులకు ఉపయోగించే ల్యాన్సర్ లిఫ్ట్ కాకపోవడంతో దాన్ని బలవంతంగా లిఫ్ట్ చేయడం కోసం అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. 

అనుకున్న ప్రకారం ఎలాగైనా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో స్టీల్‌ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టిన ఎం.ఎన్.దస్తూర్, సీమేగ్ వంటి కంపెనీలకు చెందిన అధికారులు అధిక సంఖ్యలో ఒక గదిలో మోహరించి ల్యాన్సర్‌ను లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రక్రియ వికటించి ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందువల్లే ఈ ప్రమాదంలో అధికంగా అధికారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. భద్రత విషయంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఎప్పుడూ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని, గతంలో జరిగిన అనేక ప్రమాదాలే ఇందుకు నిదర్శనమని కార్మికులు మండిపడుతున్నారు.

విస్తరణ పనులపై ప్రభావం...
మరోవైపు ఈ ప్రమాద ప్రభావం విస్తరణ పనులపై పడే అవకాశం ఉందని ఉక్కు వర్గాలు భావిస్తున్నాయి. ఏదైనా పరిశ్రమలో విస్తరణ చేపట్టిన తరువాత ఉత్పత్తిని ప్రారంభించాలంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఎస్-2లో చోటు చేసుకున్న ప్రమాదం ఉక్కువర్గాలకు తేరుకోలేని దిగ్భ్రాంతిని కలిగించింది. దీంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండదని, ఇది విస్తరణకు ఆటంకం కలిగించే అంశమని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.

భద్రతను పట్టించుకోవడం లేదు...
స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఉత్పత్తి ప్రక్రియ కోసమే చూస్తోంది తప్ప భద్రతను పట్టించుకోవడం లేదు. ఇటీవల బ్లాస్ట్‌ఫర్నేస్‌లో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దానిపై ఇంకా నివేదిక కూడా రాకముందే ఎస్‌ఎంఎస్-2లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్పత్తి ఒక్కటే ముఖ్యంకాదనే విషయాన్ని యాజమాన్యం గుర్తించడంలేదు. ఉత్పత్తి కోసం కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
-ఎన్.రామారావు, గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు

యాజమాన్యం ఒత్తిడి వల్లే ప్రమాదం...
ఎస్‌ఎంఎస్-2లో ఎలాగైనా ఉత్పత్తి ప్రారంభించాలనే యాజమాన్య ఒత్తిడి వల్లే ఈ ప్రమాదం జరిగింది. భద్రతా చర్యలు లేకుండానే ఉత్పత్తి ప్రారంభించారు. ఈ సంఘటనకు ఎవరు కారకులో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం ఇప్పటికీ గుణపాఠాలు నేర్వకపోవడం దురదృష్టకరం.
- డి.ఆదినారాయణ, గుర్తింపు యూనియన్ ప్రధానకార్యదర్శి

ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం...
స్టీల్‌ప్లాంట్‌లో జరుగుతున్న ప్రమాదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా కొత్త యూనిట్లు ప్రారంభించవద్దని గతంలో బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యానికి చెప్పాం. అయినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 
- చింతలపూడి వెంకట్రామయ్య, గాజువాక ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి
స్టీల్‌ప్లాంట్ ప్రమాద మృతులకు రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలి. ప్రమాద సంఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. స్టీల్‌ప్లాంట్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం స్పందించకపోవడం దారుణం.
- సీహెచ్ నర్సింగరావు, సీపీఎం నేత

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!