YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 21 October 2012

చెరగని చిరునవ్వు


అది వైఎస్‌కే సొంతమైన నవ్వు.. కష్టాలను మైమరపించే చిరునవ్వు.. షర్మిల మరో ప్రజా ప్రస్థానం నాలుగో రోజుకు చేరుకున్నా వైఎస్‌ను గుర్తుకు తెచ్చే చిరునవ్వు చెరగలేదు.. ప్రతి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. రాజన్న రాజ్యం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలను ఓదారుస్తున్నారు.. రాజన్న లేడని దిగులుపడవద్దని మీకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు..రాజన్న తనయకు దిష్టి తగలకుండా మహిళలు మంగళహారతులు పడుతుంటే.. ఇన్నాళ్లూ ముఖం చాటేసిన వరుణుడు భారీ వర్షంతో షర్మిలను ఆశీర్వదించాడు.. పాదయాత్రలో ప్రజలందరూ కురిపించిన ప్రేమాభిమానాలకు షర్మిల తడిసిముద్దయ్యారు.

కడప, న్యూస్‌లైన్: చెరగని చిరునవ్వుతో ప్రజాసమస్యలను సావధానంగా వింటూ మహానేత తనయ షర్మిల నాలుగోరోజు పాదయాత్రను సాగించారు. ‘విద్యుత్, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కనీసం నష్టపరిహారం ఇచ్చేవారు లేరు. ప్రజలు ఎలా ఉన్నార ని చూసే నాథుడే లేడు. ప్రతి పల్లెలోనూ ఇదే దుస్థితి ఉంది. మరో ప్రజా ప్రస్థానం చేస్తున్న షర్మిలకు పల్లెలు గోడెల్లబోసుకున్నాయి. నాలుగోరోజు పాదయాత్ర పులివెందులలోని రిషీ పాఠశాల నుంచి లోపన్నూతల క్రాస్ వరకు 16.2 కిలోమీటర్ల మేర సాగింది.

పల్లెపల్లెనా జనం బ్రహ్మరథం పట్టారు. ప్రతిఒక్కరి సమస్యా ఓపిగ్గా విన్న షర్మిల వారిని ఆప్యాయంగా పలకరించారు. రాజన్న రాజ్యం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలను ఓదార్చుతూ ముందుకు కదిలారు. ఆమె ఆప్యాయంగా చేయి ఊపుతుంటే జనం పెద్దాయనను గుర్తుకు తెచ్చుకుని పులకించిపోయారు. నాలుగోరోజు పాదయాత్రలో షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ ఆద్యంతం వెన్నంటే ఉన్నారు. వైఎస్ జగన్ సతీమణి భారతి భోజన విరామ సమయంలో పాదయాత్రలో పాల్గొన్నారు.

సమస్యల జడిలో...
నాలుగోరోజు పాదయాత్రలో షర్మిల ప్రజా సమస్యలలో మునిగిపోయారు. ప్రధానంగా విద్యుత్, సాగునీరు, పింఛన్లు తదితర సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. పులివెందులలో ఓ విద్యార్థిని చదువుకోవడానికి కరెంటు లేదమ్మా.. అని మొరపెట్టుకున్నారు. స్పందించిన షర్మిల కరెంటు కొనుక్కొవడంలో మన ముఖ్యమంత్రి జాప్యం చేశారు. ఆయన నిద్రపోతుంటే మిగతా రాష్ట్రాల వారు తన్నుకుపోయారన్నారు. ప్రాజెక్టులు అలమారలో పెట్టి తాళం వేశారు.. అనగానే అవునమ్మా! నిజమే అంటూ కరతాళధ్వనులు చేశారు. రైతు రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని, రాజన్న రాజ్యంలో ఎవరికీ సమస్యలే ఉండవని సర్దిచెప్పారు.

వికలాంగులకు భరోసా పాదయాత్రలో వికలాంగులు షర్మిలను కలిసి తమ గోడెల్లబోసుకున్నారు. ధ్రువీకరణ పత్రాల పేరుతో రాష్ట్రలో 1.83 లక్షల పింఛన్లను ఒక్క కలంపోటుతో తొలగించారని, దీంతో వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని షర్మిలతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాక్షస ప్రభుత్వం.. జగన్ సీఎం అయితే వికలాంగులకు 1000 రూపాయల పింఛన్ ఇస్తారని రాజన్న బిడ్డ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మూలె లీలావతి నాగిరెడ్డి స్మారక వృద్ధాశ్రమం వద్ద వృద్ధులను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

యాత్ర సాగిందిలా..
పులివెందులలోని పాతరిషీ పాఠశాల నుంచి ఉదయం 9.35 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. 9.50 గంటలకు రాజీవ్ నగర్ కాలనీ, 10.20కి చిన్న రంగాపురం చేరుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 10.45 గంటలకు వృద్ధుల అనాథ ఆశ్రమం, 11.15 గంటలకు ఇప్పట్ల క్రాస్, 2.20 గంటలకు కోమన్నూతల క్రాస్‌కు చేరుకున్నారు. మార్గమధ్యంలో టమోటా, వేరుశనగ తోటలను పరిశీలించారు.

అనంతరం 4.15కు యాత్ర ప్రారంభమైంది. 4.50కి పెద్దకుడాల, 6.40కి లింగాల చేరుకున్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయక వేలాది మంది జనాలు తోడురాగా యాత్ర కొనసాగించారు. లింగాలలో వర్షంలో తడుస్తునే ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు వైవీ సుబ్బారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, కొల్లి నిర్మల, వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, భూమన కరుణాకరరెడ్డి, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాపు భారతి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ సురేశ్‌బాబు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, కొల్లం బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు గోసుల శివభారత్ రెడ్డి, కడప నగర ఇన్‌చార్జ్ అంజద్‌బాషా, హపీజుల్లా(కాల్‌టెక్స్), ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, పులివెందుల మాజీ చైర్‌పర్సన్ రుక్మిణమ్మ, పులివెందుల మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ మనోహర్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, ఈసీ దినేశ్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యులు ప్రసాదరాజు, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, వైఎస్ వియ్యంకుడు ఈసీ గంగిరెడ్డి,మాసీమ బాబు, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అడుగడుగునా బ్రహ్మరథం
ప్రజలు దారి పొడవునా ఇరువైపులా నిల్చుని జననేత చెల్లెలికి ఘన స్వాగతం పలికారు. ఆడబిడ్డను అక్కున చేర్చుకుని హారతులు పట్టారు. కుంకుమ బొట్లతో సంప్రదాయ బద్ధంగా గుమ్మడికాయ దిష్టితీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి 2000 మందికిపైగా రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వచ్చి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వారిలో ఎక్కువ మంది చేనేత మహిళలే ఉండటం విశేషం. మహిళలు పెద్ద ఎత్తున షర్మిల కరచాలనం చేసేందుకు ఆరాటపడ్డారు. కూర్చోండక్కా! కూర్చోండమ్మా.. అంటూ షర్మిల వారిని ఆప్యాయంగా పలకరించారు. దీంతో వారు పులకించిపోయి ఆమె వెంట అడుగు కలిపారు. అలాగే తొండూరు మండలం నుంచి వచ్చిన 1500 మంది మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు.

షర్మిల పాదయాత్ర సైడ్‌లైట్స్
షర్మిల పాదయాత్ర నాల్గవ రోజు(ఆదివారం) పులివెందులలోని విద్యాధరి స్కూలు నుంచి ప్రారంభమైంది.
పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో వైఎస్‌ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు.
రాజారెడ్డి కాలనీ వాసులు పలు సమస్యలను షర్మిల దృష్టికి తీసుకొచ్చారు.
కాలనీ వాసులంతా జై జగన్.. జై షర్మిల అంటూ నినాదాలు చేశారు.
పాదయాత్రలో చెక్కభజన ప్రజలను ఆకట్టుకుంది
షర్మిల పాదయాత్రలో వేల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
చిన్నరంగాపురం వద్ద మహిళలు షర్మిలకు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
చిన్నరంగాపురం వద్ద వైఎస్‌ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాలవేసి నివాళులర్పించారు.
ఇందిరమ్మ కాలనీ వద్ద తాగునీటి విషయమై షర్మిల మహిళలతో చర్చించారు.
ఇప్పట్ల వద్ద సమావేశంలో మాట్లాడారు.
ఇప్పట్ల వృద్ధాశ్రమంలో వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పెద్దకుడాల క్రాస్ వద్ద రైతులు ఎండిన చీనీ చెట్లను షర్మిల, విజయమ్మ, భారతికి చూపించారు.
దారి పొడవునా పాదయాత్రలో తనతో వస్తున్న మహిళలతో షర్మిల ఉత్సాహంగా మాట్లాడుతూ ముందుకు సాగారు.
షర్మిలకు దారి పొడవునా పూలు చల్లుతూ.. బాణ సంచా పేల్చుతూ స్వాగతం పలికారు.
లింగాల బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.
లింగాల మండలం లోపట్నూతల క్రాస్‌లో ఆమె రాత్రి బస చేశారు.
- న్యూస్‌లైన్, పులివెందుల అర్బన్

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!